*శ్రీ శివ మహా పురాణం*
*403.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఇరువది రెండవ అధ్యాయం*
*వీరభద్రుడు దేవతలతో యుద్ధమును చేయుట*
*వాయువు ఇట్లు పలికెను:*
ఆ సమయములో ఆకాశమునందు వేయి సూర్యుల కాంతి గలది, వృషభము చిహ్నముగా గల అందమైన పతాకము గలది, రెండు శ్రేష్టమైన గుర్రములతో అద్భుతముగా నున్నది, నాలుగు రథచక్రములు గలది, అనేక దివ్యములైన శస్త్రాస్త్రములు గుట్టలు గలది. రత్నములతో అలంకరింప బడినది అగు రథము ఆవిర్భవించెను. పూర్వము త్రిపురాసురయుద్ధములో శివుని రథముపై ఎవరు సారథిగా కూర్చుండిరో, వారే ఇప్పుడు కూడ ఆ శ్రేష్టమగు రథములో సారథి స్థానములో నుండెను. శూలధారియగు శివుని శాసనముచేతనే బ్రహ్మ ఆ గొప్ప రథమును వీరభద్రుని వద్దకు తీసొకొని వచ్చి చేతులను జోడించి ఇట్లు పలికెను. ఓ భగవాన్! వీరభద్రా! మంగళకరమగు అవయవమలు గలవాడా! వీరుడ, వినాశము లేనివాడు అగు చంద్రశేఖరభగవానుడు నిన్ను రథమునెక్కుమని ఆదేశించుచున్నాడు. ఓ గొప్ప బాహువులు గలవాడా! ఆ ముక్కంటి రైభ్యుని ఆశ్రమమునకు దగ్గరలో జగన్మాతతో గూడి ఉన్నవాడై సహింప శక్యము కాని నీ పరాక్రమమును చక్కగా చూచుచున్నాడు. వీరుడగు ఆ గణాధ్యక్షుడు బ్రహ్మయొక్క ఆ మాటలను విని ఆయనను అనుగ్రహించి ఆ దివ్యమగు రథమునధిష్ఠించెను. ఆ తీరున సారథిగా గల ఆ శ్రేష్ఠమగు రథములో కూర్చున్న ఆ వీరభద్రుని శోభ త్రిపురాసురసంహారకుడగు రుద్రుని శోభవలె వర్ధిల్లెను. తరువాత మహాబలశాలి యగు భానుకంపుడు పూర్ణచంద్రునితో సమానముగా ప్రకాశించే గొప్ప శంఖమును నోటివద్ద నుంచి పూరించెను. దగ్గరకు చేరి కూర్చున్న సారసపక్షిని బోలియున్న ఆ శంఖముయొక్క ఆ నాదమును విని దేవతల జఠరములలోని అగ్ని భయముతో నుండెను.
యుద్ధమును చూడగోరే యక్షలతో, విద్యాధరులతో నాగరాజులతో మరియు సిద్ధులతో క్షణకాలములో దిక్కులయందలి ఆకాశభాగము మరియు సందులు గొందులు అన్నియు దట్టముగా నిండిపోయెను. అపుడు నారాయణుడు అనే మేఘము తన శార్‌ఙ్గము అనే ధనస్సు మధ్యనుండి విడువ బడిన పెద్ద బాణముల వర్షముచే గణములు అనే ఆవుల మరియు ఎద్దుల మందను ముంచెత్తి పీడించెను. వందల సంఖ్యలో బాణములను వర్షిస్తూ వచ్చుచున్న ఆ విష్ణువును చూచి ఆ వీరభద్రుడు జయమును కలిగించే తన ధనస్సును స్వీకరించి వేల సంఖ్యలో బాణములను వర్షించెను. అతడు యుద్ధమునందు శత్రువులకు భయమును కలిగించే ఆ దివ్యధనస్సును తీసుకొని, ఈశ్వరుడు మేరుపర్వతమును ధనస్సుగా చేసుకొని దానిని టంకారము (నారిత్రాడును లాగి విడిచి పెట్టుట) చేసిన విధముగా, మెల్లగా టంకారము చేయజొచ్చెను. ఆ ధనస్సును టంకారము చేయుచుండగా పెద్ద ధ్వని బయలు దేరెను. ఆ పెద్ద ధ్వనిచే భూమి కంపించెను. శోభాయుక్తుడు, భయంకరమగు పరాక్రమము గలవాడు అగు ఆ గణాధ్యక్షుడు నాగుపామును బోలియున్న భయంకరముగా ప్రకాశించే శ్రేష్ఠమగు బాణమును చేతిలోనికి తీసుకొనెను. బాణమును చేతిలోనికి తీసుకొనుటకై అంబుల పొదిలోనికి చొరబడిన వీరభద్రుని భుజము కలుగులోనికి చొరబడ గొరుచున్న పాము వలె కానవచ్చెను. అతని చేతిలోనికి తీసుకొనబడిన బాణము అదే క్షణములో పెద్ద పాముచే కరవబడిన చిన్న పామువలె ప్రకాశించెను. భయంకరమగు పరాక్రమము గల వీరభద్రుడు కోపించి బరువైన వాడి బాణముతో వినాశము లేని విష్ణువును లలాటమునందు గట్టిగా కొట్టెను. పూర్వములో అవమానింపబడియున్న విష్ణువు ఇప్పుడు లలాటమునందు కొట్టబడినవాడై, సింహముపై కోపించిన వృషభమువలె, ఆ గణాధ్యక్షునిపై కోపించెను.
తరువాత విష్ణువు వాడికొన గల పిడుగువంటి పెద్ద బాణముతో ఆ గణాధ్యక్షుని పామువంటి భుజమునందు కొట్టెను. మహాబలుడగు ఆ వీరభద్రుడు కూడ పదివేల సూర్యులతో సమానమగు కాంతి గల బాణముతో మరల వేగముగా ఆ విష్ణువు యొక్క భుజమునందు కొట్టెను. ఓ బ్రాహ్మణులారా! ఆ విష్ణువు మరల వీరభద్రుని, అదే విధముగా వీరభద్రుడు మరల విష్ణువును, ఈ విధముగా వారిద్దరు ఒకరినొకరు బాణములతో కొట్టుకొనిరి. ఒకరిపైనొకరు వేగముగా శీఘ్రముగా బాణములను ప్రయోగించుచున్న వారద్దరికి శరీరములో గగుర్పాటును కలిగించే సంకులయుద్ధము కొనసాగెను. వారిద్దరు ఒకరితోనొకరు ఈ విధముగా ద్వంద్వయుద్ధమును సంకులముగా చేయుచుండగా, ఆకాశమునందు దేవతలు మొదలగు వారు బిగ్గరగా హాహాకారములను చేసిరి. తరువాత వీరభద్రుడు విష్ణువుయొక్క విశాలమగు వక్షఃస్థలమునందు కొననుండి నిప్పులను గ్రక్కే, సూర్యుని వలె ప్రకాశించే బాణముతో చాల గట్టిగా కొట్టెను. మహావేగముతో వచ్చి కొట్టిన ఆ బాణముచే గట్టిగా పీడింపబడిన ఆ విష్ణువు తీవ్రమగు నొప్పిని పొంది మూర్ఛిల్లి క్రింద పడెను. అపుడు అస్త్రములను అన్నింటినీ ప్రయోగించెను. శివుని సేనలకు అధ్యక్షుడగు ఆ వీరభద్రుడు కూడ విష్ణువుయొక్క ధనుస్సునుండి విడువబడిన బాణములనన్నింటినీ భయంకరమగు ఎదురు బాణములతో వెంటనే వారించెను.
తరువాత కోపముతో ఎరుపెక్కిన కన్నులు గల విష్ణువు తన పేరు చెక్కబడియున్నది, ఎక్కడనైననూ ఇంతవరకు వ్యర్థము కానిది అగు బాణమును ఆ గణాధ్యక్షుని ఉద్దేశించి ప్రయోగించెను. వీరభద్ర భగవానుడు భద్రనామముతో చిహ్నితములైన బాణములను వర్షముగా కురిపించి ఆ బాణము తన వరకు వచ్చుటకు ముందే మార్గమునందు వంద ముక్కలుగా విరుగగొట్టెను. తరువాత, ఆయన ఒక బాణముతో శార్‌ఙ్గధనస్సును, రెండు బాణములతో గరుత్మంతుని రెక్కలను క్షణకాలములోననే నరికెను. అది అత్యద్భుత దృశ్యము ఆయెను. తరువాత విష్ణువు యోగబలముచే తన దేహమునుండి మిక్కిలి భయంకరాకారులు, చేతులలో శంఖమును చక్రమును గదను ధరించినవారు అగు దేవతలను వేల సంఖ్యలో సృష్టించెను. శంకరుడు త్రిపురాసురులను వలె గొప్ప బాహువులు గల వీరభద్రుడు తన కంటినుండి పుట్టిన అగ్నితో వారి నందరినీ క్షణకాలంలో మాత్రమే పూర్తిగా దహించివేసెను. తరువాత విష్ణువు మరింత కోపించి వేగముగా చక్రమును పైకెత్తి అపుడా వీరునిపై ప్రయోగించుటకు సంసిద్ధుడాయెను. చక్రమును పైకెత్తి ఎదురుగా నిలబడియున్న ఆ విష్ణువును గాంచి, ఆ గణాధ్యక్షుడు చిరునవ్వు నవ్వుచున్న వాని వలె ప్రయత్నము లేకుండగనే విష్ణువు స్తంభించునట్లు చేసెను. స్తంభించబడిన అవయవములు గల విష్ణువు సాటి లేని ఆ భయంకరచక్రముతో ఎక్కడనైననూ కొట్టవలెనని తలపోసి, అట్లు చేయలేకపోయెను. చక్రముతో కూడియున్న ఒక చేతిని పైకి ఎత్తి ఉంచినవాడై విష్ణువు రొప్పుతున్నాడా యన్నట్లు కనబడెను. ఆయన నీరసముగా రాయి వలె కదలిక లేనివాడై నిలబడెను. ఆ విష్ణువు శరీరము లేని జీవుని వలె, కొమ్ములు లేని ఎద్దు వలె, కోరలు లేని సింహము వలె నిలబడి యుండెను. ఈ విధముగా దుర్దశను పొందియున్న ఆ విష్ణువును చూచి ఇంద్రుడు మొదలగు దేవతలు, వృషభములు సింహముతో వలె, గణాధ్యక్షుడగు వీరభద్రునితో పోరునకు తలపడిరి. వారు కోపించి అయుధములను చేతబట్టి ముందుకు వచ్చిరి. వీరభద్రుడు ఆ యుద్ధములో వారిని, సింహము చిన్న చిన్న లేళ్లను చూచినట్లు చూచెను.
సాక్షాత్తుగా రుద్రస్వరూపుడు, శ్రేష్ఠుడు మరియు వీరులు అగు గణములచే చుట్టువారబడి యున్నవాడు, దోషములు లేనివాడు అగు ఆ వీరుడు భయంకరమగు అట్టహాసమును చేసి వారిని స్తంభింపజేసెను. అదే విధముగా ఇంద్రుడు కుడి చేతిలో వజ్రమును పట్టుకొని దానిని ప్రయోగించుటకు సంసిద్ధుడగుచండగనే, చిత్రపటమునందలి బొమ్మవలె కదలిక లేనివాడై నిలబడెను. ఇంతేగాక, ఇతరులందరి చేతులు రక్తమాంసములు కలవియే అయిననూ, సోమరి పోతుల కార్యక్రమముల వలె, కదలిక లేనివి ఆయెను. ఈ విధముగా ఆ వీరభద్ర భగవానునిచే కొట్టివేయబడిన సమస్తవైభవములు గలవారగుటచే దేవతలు యుద్ధమునందు ఆయన యెదుట నిలబడలేకపోయిరి. వారు భయముతో కంగారు పడి స్తంభించియున్న అవయవములతోనే పరుగిడిరి; వీరుని తేజస్సునకు భయపడి కంగారుతో వారు యుద్ధమునందు నలిబడ లేదు. గొప్ప భుజములు గల వీరభద్రుడు పారపోవుచున్న వీరులగు దేవతలను వాడి బాణములతో, మేఘము పర్వతములను వర్షజలములతో వలె, కొట్టెను. ఆ వీరుని పరిఘలవంటి అనేకములగు అస్త్రములను, శస్త్రములను విడిచి పెడుతూ సృష్ట్యాదియందు సకలప్రాణులను సృజించుచున్న బ్రహ్మవలె ప్రకాశించెను. సూర్యుడు భూమిని కిరణములతో కప్పివేయు విధముగా, వీరభద్రుడు కేవలము క్షణకాలములో దిక్కులను బాణములతో కప్పివేసెను. బంగారముతో అలంకరింపబడిన వీరభద్రుని బాణములు ఆకాశమండలంలో ఎగురుచున్నవై మెరుపులను బోలియుండెను. ఆ గొప్ప బాణములు, నీటిపాములు కప్పలను వలె, దేవతాగణముల ప్రాణములనపహరించి, వారి రక్తము అనే ఆసవమును త్రాగెను.
కొందరి చేతులు తెగినవి. కొందరి అందమగు ముఖములు చీలిపోయినవి. కొందరు దేవతలు చీల్చబడిన ప్రక్క భాగములు కలవారై నేల గూలిరి. బాణములచే పొడిచి వేయ బడిన అవయవములు, తెగకొట్టబడిన బాహువులు కీళ్లు గల అనేకులు నేల గూలిరి, కొందరు పెరికి వేయబడిన కన్నులు గలవారై మరణించి నేల గూలిరి. కొందరు భూమి లోనికి చొచ్చుకు పోవ గోరుచున్నవారు వలె, మరికొందరు ఆకాశమును స్పృశించ గోరుచున్నవారు వలె నుండిరి. ప్రాణములు పోయి ఉండుటచే ఒక దేహము మరియొక దేహమునకు ఆటంకము అగుట లేదు. దేహములు ఒక దానితో మరియొకటి కలిసి యున్నవి. కొందరు భూమియందు ప్రవేశించగా, మరి కొందరు పర్వతగుహలలో దాగిరి. కొందరు ఆకాశమునకు ఎగురగా, మరికొందరు జలములో ప్రవేశించిరి. ఆ విధముగా ఆ వీరుడు చీల్చబడిన సర్వావయవములు గల దేవతలతో గూడి ప్రకాశించెను. అతడు జనసమూహమును తన గుప్పెటలో పెట్టుకున్న భైరవుని వలె, త్రిపురముల చక్కని వ్యూహమును తగులబెట్టిన శివుని వలె ఉండెను. ఈ విధముగా దేవసైన్యము అంతయు దీనముగా, బీభత్సవముగా కానవచ్చెను. ఆ సైన్యము గణాధ్యక్షుడగు వీరభద్రునిచే చేయబడిన దీనమైన రూపమును కలిగి యుండెను. అపుడు దేవవీరుల ఘోరమగు రక్తపు నది ప్రాణులకు భయమును సూచించుచున్నదై ప్రవహించెను. అపుడు యజ్ఞవాటిక అంతటా రక్తముతో తడిసి, శుంభుని సంహరించి రక్తముతో తడిసిని వస్త్రముతో నల్లని దేహవర్ణముతో నున్న కౌశిక వలె ప్రకాశించెను. మిక్కిలి దారుణమైన ఆ గొప్ప యుద్ధము జరుగుచుండగా, భూమి భయపడుచున్నదా యన్నట్లు కంపించెను. సముద్రము పెద్ద తరంగములతో నురగలతో సుడి గుండములతో అల్లకల్లోలముగా నుండెను. పెద్ద ఆపదను సూచిస్తూ ఉల్కలు పడినవి. చెట్లు కొమ్మలను రాల్చినవి. దిక్కులు అన్నియు ధూళితో నిండినవి. వాయువు అమంగళకరముగా వీచెను. ఆహా! విధి పరిస్థితిని తారుమారు చేసినది. ఇది అశ్వమేధ యాగము, బ్రహ్మపుత్రుడు, ప్రజాపతి అగు దక్షుడు స్వయముగా యజమానుడు.
ధర్ముడు మొదలగు వారు సభాసదలు. గరుడవాహనుడగు విష్ణువు రక్షకుడు. ఇంద్రుడు మొదలగు దేవతలు ప్రత్యక్షముగా హవిర్భాగములను స్వీకరించు వారు. అయినప్పటికీ యజమానునకు, యజ్ఞమునకు, ఋత్విక్కులకు వెంటనే తల నరకబడుట అనే ఫలము అభించు చున్నది. బాగున్నది! కావున, వేదముచే విధింపబడనది, ఈశ్వరునిచే బహిష్కరించబడినది, పాపాత్ములచే స్వీకరించబడినది అగు కర్మను ఏ కాలమునందైననూ చేయరాదు. మహాపుణ్యమును చేసిననూ, వందలాది యజ్ఞములను చేసిననూ, మహేశ్వరుని యందు భక్తి లేనివానికి ఆ ఫలము లభించదు. మహాపాపమును చేసిననూ, ఎవడైతే భక్తితో శివుని పూజించునో, వాడు సకలపాపములనుండి విముక్తుడగును. ఈ విషయములో శంకకు అవకాశము లేదు. అధికప్రసంగమేల? శివుని నిందుచుటయందు ప్రీతి గల వ్యక్తి చేసే దానము, తపస్సు, యజ్ఞము మరియు హోమము వ్యర్థము. తరువాత నారాయణుడు, రుద్రులు, లోకపాలకులు అను వారితో కూడియున్న దేవసంఘములు యుద్ధములో గణాధ్యక్షుడగు వీరభద్రుని ధనస్సునుండి విడువబడిన బాణములచే కొట్టబడినవారై తీవ్రమగు బాధకు తాళజాలక పారిపోయిరి. కొందరు కొన్ని చోట్ల చెల్లాచెదరైన జుట్టు గలవారై వణుకుచుండిరి. పెద్ద దేహములు గల కొందరు కొన్ని చోట్ల కూలబడిరి. చీలిన ముఖములు గల కొందరు కొన్ని చోట్ల పడిపోయిరి. దేవవీరులగు కొందరు కొన్ని చోట్ల మరణించిరి. జారిపోయిన వస్త్రములు, ఆభరణములు, అస్త్రములు మరియు శస్త్రములు గల కొందరు దేవతలు అచట గొప్ప ఆపదను పొంది దైన్యముతో నిండిన ముఖకవళికలు కొట్టవచ్చినట్లు కానవచ్చుచుండగా, గర్వమును స్వాభిమానమును బలమును పరిత్యజించి అచట పడియుండిరి. పరాజయమునెరుంగని ఆ గణాధ్యక్షుడగు వీరభద్రుడు తప్పు దారిలో ఆరంభమైన దక్షయజ్ఞమును మొక్కవోని అస్త్రములతో ధ్వంసము చేసి, ఇతరగణాధ్యక్షుల మధ్యలో వృషభముల మధ్యలోని సింహము వలె ప్రకాశించెను.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో దక్షయజ్ఞవిధ్వంసమును వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment