*శ్రీ శివ మహా పురాణం*
*404.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం)ఇరువది మూడవ అధ్యాయం*
*దేవతలు శివుని అనునయించుట*
*వాయువు ఇట్లు పలికెను:*
ఈ విధముగా విష్ణువు మొదలగు దేవతలు ఛిన్నాభిన్నము గావింపబడిన అవయవములు గలవారై క్షణకాలములో కష్టస్థితిని పొంది భయపడుచుండిరి. వారు కొద్ది మంది మాత్రమే మిగిలి యుండిరి. వీరభద్రునిచే ప్రోత్సహించబడి మిక్కిలి కోపమునుపొంది యున్న ప్రమథగణములు యుద్ధములో భయపడియున్న ఆ దేవవీరులను మరియు ఇతరులను బలాత్కారముగా పట్టుకొని, దోషమును చేసియున్న ఆ దేవతల చేతులను, కాళ్లను, భుజములను, ఉదరములను దృఢమైన ఇనుప సంకెళ్లతో బంధించిరి. ఆ సమయములో సారథి కార్యమును చేసి ప్రేమను సంపాదించి యున్న బ్రహ్మ పార్వతీపుత్రుడగు వీరభద్రునకు నమస్కరించి ప్రార్థిస్తూ ఇట్లు పలికెను. ఓ పూజ్యా! కోపమును చాలించుము. ఈ దేవతలు నశించి యున్నారు. ఓ గొప్ప వ్రతము గలవాడా! ప్రసన్నుడవు కమ్ము. రోమములనుండి పుట్టిన గణములతో కూడియున్న నీవు అందరినీ క్షమించుము. పరమేష్ఠియగు బ్రహ్మ ఈ విధముగా విన్నవించగా, మిక్కిలి ప్రీతిని పొందిన ఆ గణాధ్యక్షుడు ఆయనయందలి గౌరవముచే శాంతించెను. దేవదేవుడగు వీరభద్రునకు సలహాను ఇచ్చిన బ్రహ్మ ద్వారా ఈ అవకాశమును పొందియున్న దేవతలు దోసిళ్లను శిరస్సులపై దాల్చి వివిధస్తోత్రములతో స్తుతించిరి.
*దేవతలు ఇట్లు పలికిరి:*
శాంత మూర్తియగు శివునకు నమస్కారము. త్రిశూలమును చేతబట్టి యజ్ఞమును వినాశము చేసినవాడు, రుద్రునకు ఆనందమును కలిగించువాడు, రుద్రులకు ప్రభువు, రుద్రుని మహిమతో కూడినవాడు, ప్రళయకాలమునందలి అగ్నియొక్క రూపము గలవాడు, కాలమునకు అతీతుడై కాముని సంహరించిన శివుని స్వరూపమైన వాడు, దేవతల శిరస్సులను మరియు దక్షుని శిరస్సును నరికినవాడు అగు వీరభద్రునకు నమస్కారము. ఓ వీరా! మేము దోషము లేనివారమే అయిననూ, అయోగ్యమగు పనులను చేసే పాపాత్ముడగు ఈ దక్షుని సహవాసము వలన నీచే యుద్ధములో శిక్షించ బడితిమి. మమ్ములనందరినీ నీవు దహించి వేసితివి. ఓ ప్రభూ! మేము నీ వలన భయపడుచున్నాము. నీవే మాకు గతి. శరణు పొందిన మమ్ములను రక్షించుము.
*వాయువు ఇట్లు పలికెను:*
ఈ విధముగా దేవతలు స్తుతించగా ఆ వీరభద్రప్రభుడు సంతసించి వారిని సంకెళ్లనుండి విడిపించి కైలాసములో దేవదేవుడగు శివుని వద్దకు తీసుకొని వచ్చెను. ప్రకాశస్వరూపుడు, దేవతలకు ప్రభువు, గణములతో కూడి యున్నవాడు, సర్వవ్యాపకుడు, సర్వలోకములకు గొప్ప శాసకుడు అగు ఆ శివభగవానుడు కూడ అచట అంతరిక్షమునందు ఉండెను. విష్ణువు మొదలగు దేవతలు ఆ పరమేశ్వరుడగు మహేశ్వరుని చూచి ప్రీతిని పొందినవారే అయిననూ భయపడినవారై నమస్కరించిరి. నమస్కరించిన వారి కష్టములను పోగొట్టే మహాదేవుడగు ఆ శివుడు భయపడియున్న ఆ దేవతలను చూచి చిరునవ్వుతో పార్వతిని చూచి ఇట్లు పలికెను.
*మహాదేవుడు ఇట్లు పలికెను:*
ఓ దేవతలారా! మీరు భయపడకుడు. మీరందరు నా సంతానమే. దయామయుడనగు నేను మిమ్ములను అనుగ్రహించుట కొరకు మాత్రమే శిక్షను వేసితిని. దేవతలగు మీరు చేసిన తప్పిదమును మేము క్షమించితిమి. మేము కోపించినచో మీరు నిలబడ లేరు.మీరు బ్రతుకులు ఉండవు.
*వాయువు ఇట్లు పలికెను:*
సాటిలేని తేజస్సు గల శివుడు ఇట్లు పలుకగా నిత్య¸°వనులగు దేవతలందరు వెనువెంటనే తొలగిన సందేహములు గలవారై ఆనందముతో నాట్యమాడిరి. ఆనందముతో నిండిపోయి కంగారు పడుచున్న మనస్సులు గల ఆ దేవతలు మనస్సులలో ప్రసన్నతను నింపుకొని శంకరుని స్తుతించుటకు ఆరంభించిరి.
*దేవతలు ఇట్లు పలికిరి:*
ఓ దేవా! లోకములనన్నింటినీ సృష్టించి పాలించి సంహరించే పరమేశ్వరుడవు నీవే. ఆత్మస్వరూపుడవగు ఓ దేవా! నీవు రజస్సత్త్వతమోగుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ విష్ణురుద్రరూపములను దాల్చితివి. విశ్వమును సృష్టించే ఓ దేవా! సర్వము నీ స్వరూపమే. పావనుడవగు నీకు నమస్కారమగుగాక! రూపము లేని నీవు భక్తుల కొరకై రూపములను దాల్చి సౌఖ్యముల నొసంగెదవు. ఓ దేవదేవా! శంకరా! నీ దయచే చంద్రుడు రోగవిముక్తుడైనాడు. మరణించ బోయే చంద్రుడు యమునానదిలో స్నానమును చేసి సుఖమును పొందెను. ఓ ప్రభూ! భర్తను పోగొట్టుకున్న సీమంతిని సోమవారవ్రతమును చేసి నిన్ను పూజించి సాటిలేని సౌభాగ్యమును పుత్రులను పొందెను. శివప్రభుడు శ్రీకరునకు తన సర్వోత్కృష్టమగు స్థానమును ఇచ్చెను. రాజుల సమూహము వలన భయమును పొందియున్న సుదర్శనుని నీవు రక్షించితివి. దయానిధివగు నీవు మేదురుని భార్యతో సహా గట్టెక్కించితివి. నీవు నీ కర్మచే శారదయొక్క భర్తకు ప్రాణభిక్షను పెట్టి ఆమె మాంగల్యమును కాపాడితివి. నీవు భద్రాయుషుని ఆపదను పోగొట్టి సుఖము నిచ్చితిమి. సౌమిని నిన్ను సేవించి సంసారబంధమునుండి విముక్తిని పొందెను.
*విష్ణువు ఇట్లు పలికెను:*
ఓ శంభూ! నీవు జనులను అనుగ్రహించ గోరి రజస్సత్త్వతమోగుణముల ద్వారా బ్రహ్మవిష్ణురుద్రరూపుడవై సృష్టించి పాలించి ఉపసంహరించు చున్నావు. అందరి గర్వమును పోగొట్టువాడవు, సర్వవిధముల తేజస్సుల విలాసములు గలవాడవు, సర్వవిద్యలు మొదలగు వాటికి నిగూఢమగు నిధానమైనవాడవు అగు నీవు అందరినీ అనుగ్రహించుచున్నావు. ఓ కైలాసపతీ! సర్వము నీనుండి పుట్టినది. సర్వము నీ స్వరూపమై యున్నది. సర్వము నీయందు ఉన్నది. నీవు నాపై దయను చూపి ముమ్మాటికీ రక్షించుము. ఇదే సమయములో ఇట్లి అవకాశమును పొందిన బ్రహ్మ చేతులను జోడించి నమస్కరించి శూలధారియగు శివునకు ఇట్లు విన్నవించు కొనెను.
*బ్రహ్మ ఇట్లు పలికెను:*
ఓ దేవా! మహాదేవా! నీకు జయమగుగాక! నమస్కరించిన వారి కష్టములను పోగొట్టు వాడా! ఇట్లు అపరాధములయందు నీవు తప్ప మరి యెవరు ప్రసన్నులు కాగలరు? పూర్వము యుద్ధములో ప్రాణములను పోగొట్టుకున్న వారు మరల జీవించ గలరు. పరమేశ్వరుడే ప్రసన్నుడు కాగా, ఎవనికి మరల ప్రాణములు దక్కవు? ఓ దేవా! దేవతలు చేసిన పనిలోని ఈ దోషము యేది గలదో, అది నీ అంగీకారము యొక్క మహిమచే భూషణముగా మారినదని నేను తలపోయుచున్నాను. పరమేష్ఠియగు బ్రహ్మ ఇట్లు విన్నవించు కొనగా, ఆ దేవదేవుడు పార్వతీదేవియొక్క ముఖమును చూచి చిరునవ్వు నవ్వినాడా యన్నట్లు ఉండెను. పద్మమునుండి జన్మించిన బ్రహ్మయందు ఆయనకు పుత్రవాత్సల్యము ఉండుటచే ఆ ప్రభుడు దేవతలు మొదలగు వారికి పూర్వమునందు ఉన్న విధముగా అవయవములను ఇచ్చెను. ప్రమథగణములు మొదలగువారిచే దండించబడి యున్న దేవతల తల్లులకు కూడ కైలసపతి పూర్వమునందు ఉన్న విధముగనే అవయవములను ఇచ్చెను. పితామహుడగు బ్రహ్మభగవానుడే స్వయముగా దక్షునకు వాని పాపములకు తగినట్లుగా ముసలి మేక యొక్క ముఖమునే ముఖముగా చేసెను. అపుడు ఆ దక్షుడు కూడా మరల జీవించి సంజ్ఞను పొంది బుద్ధిమంతుడై భయముతో చేతులను జోడించి అనేకవాక్యములను పలుకుతూ శంభుని స్తుతించెను.
*దక్షుడు ఇట్లు పలికెను:*
ఓ దేవా! జగన్నాథా! లోకములను అనుగ్రహించు వాడా! మహేశ్వరా! దయను చూపుము. నా తప్పును క్షమించుము. ఓ ప్రభూ! నీవే లోకములను సృష్టించి పోషించి సంహరించు చున్నావు. విష్ణువు మొదలగు వారందరికీ నీవే ఈశ్వరుడవని నేను విశేషముగా తెలుసుకొంటిని. సర్వమును నీవే వ్యాపించి యున్నావు. ఈ సృష్టిని నీవు ఇంకనూ నశింప చేయలేదు. విష్ణువు మొదలగు వారు ఎవ్వరైననూ నీ కంటె గొప్ప ప్రభువులు కారు.
*వాయువు ఇట్లు పలికెను:*
ఆ విధముగా తప్పును చేసి భయపడుతూ కంగారుతో అధికముగా మాటాలాడుచున్న ఆ దక్షుని చూచి దయానిధినయగు శివుడు చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు చూచి భయపడవద్దని పలికెను. ఆ విధముగా పలికి వాని తండ్రియగు బ్రహ్మకు ప్రీతిని కలిగించ గోరి ఈశ్వరుడు ఆ దక్షునకు వినాశము లేని గణాధ్యక్షస్థానమును ఇచ్చెను. తరువాత బ్రహ్మ మొదలగు దేవతలు వినయము గలవారై చేతులను జోడించి నమస్కరించి పార్వతీపతియగు శంకరుని స్తుతించిరి.
*బ్రహ్మ మొదలగు వారు ఇట్లు పలికిరి:*
ఓ శంకరా! దేవదేవా! నీకు జయమగుగాక! దీనులకు ప్రభువైన వాడా! ఓ మహాప్రభూ! దయను చూపుము. ఓ మహేశ్వరా! మా అపరాధమును నిశ్చయముగా క్షమింపుము. యజ్ఞమును రక్షించువాడా! యజ్ఞప్రభూ! దక్షయజ్ఞమును ధ్వంసము చేసినవాడా! ఓ మహేశ్వరా! దయను చూపుము. మా అపరాధమును నిశ్చయముగా క్షమించుము. ఓ దేవదేవా! సర్వమునకు కారణమగు ప్రకృతిని నియంత్రించు వాడా! భక్తుల ప్రాణములను నిలబెట్టువాడా! దుష్టులను శిక్షించే స్వామీ! దయను చూపుము. నీకు నమస్కారమగుగాక! ఓ ప్రభూ! నిన్ను తెలియజాలని దుష్టుల గర్వమును నీవు అడంచెదవు. నీయందు లగ్నమైన మనస్సు గల సత్పురుషులను నీవు ప్రత్యేకముగా రక్షించెదవు. నీ చరిత్రము అద్భుతమని నీ దయచేతనే నిశ్చయించు కొంటిమి. మా అపరాధముల నన్నింటినీ క్షమించ వలెను. ప్రభువులు దీనులపై దయను కలిగి యుందురు గదా!
*వాయువు ఇట్లు పలికెను:*
ఈ విధముగా బ్రహ్మ మొదలగు దేవతలచే స్తోత్రము చేయబడిన ఆ మహాదేవప్రభుడు సంతోషించెను. భక్తవత్సలుడగు ఆ స్వామి కరుణాసముద్రుడు. దీనులపై ప్రేమ గల ఆ శంకరుడు బ్రహ్మ మొదలగు దేవతలపై అనుగ్రహమును చూపి వారికి మిక్కిలి ప్రీతితో వరముల నిచ్చెను. తరువాత అతిశయించిన దయ గల పరమేశ్వరుడు చిరునవ్వుతో గూడిన వచనముతో శరుణు జొచ్చిన దేవతల భయములనన్నింటినీ పోగొట్టుతూ ఇట్లు పలికెను.
*శివుడు ఇట్లు పలికెను:*
దేవతలు విధివిధానమునకు వశులై దానిచే నియంత్రింప బడినారా యన్నట్లు ఇచట పాపమును చేసియున్నారు. కాని అట్టి మీరు నన్ను శరణు పొందినారు. మిమ్ములను ఈ విధముగా చూచి మేము ఆ పాపమునంతనూ మరచిపోయినాము. విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన ఓ దేవతలారా! కావున, మీరు కూడ ఇక్కడ మీకు జరిగిన దేహశుద్ధిని మనస్సులో పెట్టుకొనకుండగా, బిడియమును విడిచినవారై, సుఖముగా ఇప్పుడు స్వర్గమునకు వెళ్లుడు. దేవతలకు ప్రభువు, దక్షయజ్ఞమును విధ్వంసము చేసినవాడు, సంకల్పరహితుడు, పార్వతీదేవితో, గణములతో మరియు అనుచరులతో కూడియున్నవాడు అగు శివుడు, ఆకాశములో నిలబడి యున్నాడు అనుకుంటూ ఉండగనే అంతర్థానమును చెందినాడు. తరువాత ఇంద్రుడు మొదలగు ఆ దేవతలు కూడా భయము తొలగిన వారై వీరభద్రుని మిక్కిలి మంగళకరమగు పరాక్రమమును గురించి ముచ్చటించుకొని, వెనువెంటనే సుఖముగా నుండే ఆకాశమార్గములో వివిధదిక్కులలో సుఖముగా వెళ్లిరి.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో దేవతలు శివుని అనునయించుటను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment