Sunday, January 25, 2026

 నేతాజీ కన్నీటి తీర్థయాత్ర: కాల పానీ గోడల వెనుక దాగి ఉన్న వీరగాథ!
---
త్రివర్ణ పతాకం ఎగురవేశాక.. నేతాజీ నేరుగా ఆ నరకకూపానికే ఎందుకు వెళ్లారు? కాల పానీలో ఆయన చేసిన నిశ్శబ్ద తీర్థయాత్ర! 
---
జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని మనం జరుపుకుంటున్న వేళ, ఆయన భయంకరమైన 'కాల పానీ'ని సందర్శించిన ఆ రోజును ఒకసారి గుర్తు చేసుకుందాం. 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత, ఉత్సాహంగా ఉన్న జనసమూహం నుండి కొంచెం దూరంగా జరిగి, అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు వైపు అడుగులు వేశారు. 'కాల పానీ శిక్ష' అనగానే భారతీయుల్లో ఒక రకమైన భయం, వేదన కలిగేది. నేతాజీ దీనిని "ఇండియన్ బాస్టిల్" (Indian Bastille) అని పిలిచేవారు. అది తరతరాల స్వాతంత్య్ర సమరయోధుల ఒంటరితనాన్ని, చిత్రహింసలను మౌనంగా భరించిన ఒక నరకకూపం. 

అసలు ఏమిటీ కాల పానీ?

నేతాజీ అడుగుపెట్టిన ఆ కాల పానీ జైలు, బ్రిటిష్ వారి క్రూరత్వానికి అత్యంత భయంకరమైన చిహ్నం. మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా దీనిని నిర్మించారు. ప్రతి ఖైదీ పూర్తి ఒంటరిగా ఉండేలా రూపొందించారు కాబట్టే దీనికి "సెల్యులార్" జైలు అనే పేరు వచ్చింది. దీనిలోని ఏడు విభాగాలు (Spokes) ఎంత చాకచక్యంగా నిర్మించారంటే, ఒక సెల్ ముందు భాగం మరో సెల్ వెనుక వైపుకు ఉంటుంది. దీనివల్ల ఏ ఇద్దరు ఖైదీలు ఒకరినొకరు చూసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ సాధ్యం కాదు. 

ఖైదీలను మరింత వేధించడానికి, జైలర్లు సెల్ తాళం వేసిన తర్వాత తాళం చెవిని సెల్ లోపలికి విసిరేవారు. కానీ ఆ తాళం లోపలి నుండి చెయ్యి అందనంత దూరంలో ఉండేది. ఇటు ఆ గదులు ఎంత ఇరుగ్గా ఉండేవంటే.. ఖైదీ కనీసం సరిగ్గా కాళ్లు చాచుకోవడానికి కూడా వీలుండేది కాదు. కిటికీలు చాలా ఎత్తులో ఉండటం వల్ల గాలి, వెలుతురు రావడం అసాధ్యం. అటువంటి చీకటి గదుల్లో ఖైదీలు కొరడా దెబ్బలు, ఆకలి మరియు ఏకాంతవాసాన్ని అనుభవించేవారు. కనీస పారిశుధ్యం లేకుండా కేవలం హింసించడానికే ఈ జైలును బ్రిటిష్ వారు రూపొందించారు. కాల పానీ అంటే కేవలం ఒక జైలు మాత్రమే కాదు.. భారత వీర విప్లవకారుల అస్తిత్వాన్ని, గౌరవాన్ని మరియు ఆశలను తుడిచిపెట్టేందుకు బ్రిటీష్ వారు చేసిన ఒక విఫలయత్నం. 

కాల పానీ గోడల వెనుక.. అమరవీరుల ఆత్మఘోషతో నేతాజీ మౌన సంభాషణ!

చీకటి నిండిన ఆ కారిడార్లలో నడుస్తున్నప్పుడు, నేతాజీకి కేవలం గోడలు, ఇనుప కడ్డీలు మాత్రమే కనిపించలేదు.. ఆ గదుల్లో బంధీలుగా ఉన్న మహనీయుల ఆత్మల స్పందన వినిపించింది. 

1911 నుండి 1921 వరకు రెండు జీవితకాల శిక్షలను అనుభవిస్తూ, భారత పునర్వైభవం కోసం నిరంతరం ధ్యానించిన వీర సావర్కర్ ఆయనకు తలపుల్లో మెదిలే ఉంటారు. 

లాహోర్ కుట్ర కేసులో 1929లో ఇక్కడికి బహిష్కరించబడిన బతుకేశ్వర్ దత్ నినాదాలు నేతాజీకి వినిపించే ఉంటాయి. 

అలీపూర్ బాంబు కేసులో 12 ఏళ్ల శిక్ష అనుభవిస్తూ, దొంగచాటుగా కొవ్వొత్తి వెలుగులో చిత్రపటాలు గీస్తున్న బారింద్ర కుమార్ ఘోష్ ఆయన కళ్లముందు కదలాడి ఉంటారు. 

ముజఫర్‌పూర్ బాంబు కేసు తర్వాత తప్పించుకునే క్రమంలో పట్టుబడి, కాల పానీ జైలు చీకటి గదుల్లో చిత్రహింసలకు గురైన ఉల్లాస్కర్ దత్.. గోడల మీద రాళ్లను రక్కుతూ తన నిరసనను తెలిపిన తీరు నేతాజీని కలచివేసి ఉంటుంది. అలాగే, పారిస్‌లో బాంబుల తయారీలో శిక్షణ పొంది, అలీపూర్ కుట్ర కేసులో జీవితకాల శిక్షను అనుభవిస్తున్న హేమచంద్ర కనుంగో వంటి మేధావులు ఈ నరకకూపంలో మగ్గిపోవడం చూసి ఆయన హృదయం ద్రవించి ఉంటుంది. ఏకాంతవాసం (Solitary Confinement) అనే భయంకరమైన శిక్షలో ఉన్నప్పటికీ, తన మనోబలాన్ని కోల్పోకుండా ఉండేందుకు.. ధర్మ శ్లోకాలను ఆ చీకటి గదుల గోడల మీద చెక్కిన ఉపేంద్రనాథ్ బెనర్జీ గుర్తుకొచ్చి ఉంటారు. భాయ్ పరమానంద్, దివాన్ సింగ్ ధిల్లాన్ లాంటి వీరుల శరీరంపై బ్రిటిష్ వారి కొరడాలు విరుచుకుపడుతున్నా, ఆ నొప్పిని ఏమాత్రం లెక్కచేయకుండా పంజాబీ వీర గీతాలను ఆలపించారు. రక్తం ఓడుతున్నా వారు పాడిన ఆ గీతాల ధైర్యం, ఆ కారిడార్లలో నేతాజీకి వినిపించి ఉంటుంది. ఆ వీరుల అజేయమైన సంకల్పమే నేతాజీని దేశ విముక్తి కోసం అంత పెద్ద పోరాటానికి సిద్ధం చేసి ఉంటుంది. 

1930లలో నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టిన యోగేంద్ర శుక్లా దృశ్యాలు కూడా కాల పానీ గోడలపై ముద్రించబడి ఉన్నాయి. అక్కడ పర్యటించిన నేతాజీకి, ఆ వీరుల అచంచలమైన స్ఫూర్తి తనను ముందుకు నడిపిస్తున్నట్లు అనిపించి ఉంటుంది. తాను ఎగురవేసిన త్రివర్ణ పతాకం కేవలం ఒక ముగింపు మాత్రమే కాదని, అది ఒక కర్తవ్య బోధ అని నేతాజీకి తెలుసు. సావర్కర్, దత్, ఘోష్, శుక్లా వంటి లెక్కలేనంత మంది త్యాగాలకు అర్థం చేకూరాలంటే, వారి అసంపూర్ణ పోరాటాన్ని కొనసాగించి స్వతంత్ర భారతాన్ని సాధించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగారు.🙏... దయచేసి భారతీయులందరూ చదవండి...🙏

No comments:

Post a Comment