Monday, January 26, 2026

 💐34శ్రీ లింగ మహాపురాణం💐 

🌼దధీచి మహర్షి పై చేసిన యుద్దంలో విష్ణువు ఓటమి🌼

#ముప్పై నాలుగవ భాగం#

క్షుపుడికి మాట ఇచ్చిన విష్ణువు దధీచి మహర్షి వద్దకు వృద్ద బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి మహర్షిని "దధీచి మహర్షీ! ఈ వృద్ద బ్రాహ్మణుడికి భిక్ష రూపంలో ఒక వరం ఇవ్వుము" అని కోరాడు.

త్రికాలజ్ఞుడు, తపస్సంపన్నుడు అయిన దధీచి మహర్షి బ్రాహ్మణ రూపంలో వచ్చిన విష్ణుమూర్తిని గుర్తుపట్టి నమస్కరించి "ప్రభూ! మహాదేవుని దయతో తమరు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నాను. క్షుపుడు నీకు మహాభక్తుడు. అతని కోరిక తీర్చడానికి నా వద్దకు వచ్చావు. శివభక్తులు దేనికి భయపడరు అన్న సంగతి నీకు తెలుసును. ఏమి కావాలో అడుగుము" అని అడిగాడు.

మహావిష్ణువు నిజరూపంలో దర్శన మిచ్చి "మహర్షీ! నీ శివభక్తి అన్యనం. మహాశివుని అనుగ్రహం పొందిన వారిని ఎవరు ఏమి చేయలేరు. అయినా నా భక్తుడు క్షుపుని సంతృప్తి పరచడానికి ఒక కోరిక కోరుతున్నాను. నావెంట క్షుపుని వద్దకు వచ్చి "నేను మహావిష్ణువు తోడు ఉన్న క్షుపుని శక్తికి భయపడుతున్నాను" అని ఒక మాట చెప్పు. చాలు! నేను వెళ్ళి పోతాను" అన్నాడు.

దధీచి విష్ణువుతో "నారాయణా! నీవు కోరితే నా ప్రాణమైన ఇస్తాను. కానీ అసత్యమాడలేను. "శివభక్తులు దేనికి భయపడరు" అన్న మాటకు మచ్చ తేనీయను. నన్ను క్షమించు!" అని నమస్కరించాడు. తన మాట కాదన్నందుకు విష్ణువుకి ఆగ్రహం వచ్చింది. సుదర్శన చక్రాన్ని దధీచి మహర్షి పై ప్రయోగించాడు.

సుదర్శన చక్రం దధీచి మహర్షి వజ్ర శరీరం తాకింది. తాకిన భాగం ఏమి చేయలేక వంగి పోయి పడిపోయి అదృశ్యమయ్యింది. దధీచి మహర్షి నవ్వి "నారాయణా! సుదర్శనాన్ని మహాదేవుడే నీకు ఇచ్చాడు. అది శివభక్తులను ఏమి చేయలేదు" అనడంతో విష్ణువు మరింత ఆగ్రహం చెంది ధనుస్సుతో అనేక అస్త్రాశస్త్రాలు దధీచి పై ప్రయోగించాడు. అన్ని దధీచి మహర్షి శరీరాన్ని తాకి కిందపడి పోయాయి. ఒక చిన్న గాయం కూడా చేయలేక పోయాయి.

విష్ణువుకి సహాయంగా ఇంద్రాది దేవతలందరు వచ్చి దధీచి మహర్షి పై తమ ఆయుధాలన్ని ప్రయోగించాడు. అన్ని వర్షపు చినుకులు కొండకు తాకి రాలి పడినట్లు దధీచి శరీరం తాకి కింద పడిపోయాయి. విషయం తెలుసుకోకుండా తన పై దాడి చేసిన దేవతలపై కోపం వచ్చి దధీచి మహర్షి శివుని స్మరించి దర్భను తీసుకుని మంత్రించి దేవతలపై ప్రయోగించాడు.

దర్భ కాలాగ్ని సమానమైన కాంతి గల దివ్య త్రిశూలమై దేవతలను సంహరించ సాగింది. దేవతలందరు భయపడి తలో దిక్కు పారిపోయారు. విష్ణువు  ఆగ్రహంతో లక్షలాది నారాయణ గణాలను శరీరం నుంచి సృష్టించి దధీచి పైకి పంపాడు. దధీచి మహర్షి శివుని స్మరించడంతో నారాయణ గణాలకు సమానమైన రుద్రగణాలు వచ్చి వారిని ఓడించి తరిమేశారు.

మహావిష్ణువు విశ్వరూపం ధరించి తన శరీరంలో గల సమస్త సృష్టి, కోట్లాది దేవగణాలను దధీచికి చూపించి భయపెట్టే ప్రయత్నం చేశాడు. దధీచి మహర్షి భయపడకుండా "నారాయణా! నేను భయపడటం లేదు. నాలోను కోట్లాది గణాలు శివానుగ్రహంతో ఉన్నాయి. నేను చూపిస్తాను. నిజరూపంలోకి వచ్చి యుద్ధం చేయుము" అని శివుని ధ్యానిస్తూ కన్నులు మూసుకుని విష్ణువు ఎదుట నుంచున్నాడు.

నిజరూపంలో వచ్చిన నారాయణునికి దధీచి మహర్షి శరీరంలో తనలో ఉన్నట్టే అనంతకోటి బ్రహ్మండాలు, విశ్వాలు, దేవతాగణాలు కనిపించాయి.  సాక్షాత్తు మహాశివుడే దధీచి మహర్షిలో ప్రకటితమై తనకు సత్యాన్ని అవగతం చేసాడు అని అర్థమైంది. విష్ణువు శివ విశ్వరూపానికి ప్రణమిల్లి ఓటమి అంగీకరించి వైకుంఠానికి వెళ్లి పోయాడు.

క్షుపుడు "తన కోసం పోరాడి విష్ణువు దధీచి మహర్షి ముందు ఓటమి పాలై అవమానానికి గురై వెళ్లి పోయాడు" అని తెలుసుకుని గర్వ అహంకారాలు వదలి వచ్చి దధీచి మహర్షి పాదాలపై పడి క్షమించమని కోరాడు. దధీచి మహర్షి క్షుపుడికి క్షమించి వదలి వేశాడు.

కానీ విష్ణువుతో సహా దేవతలందరిని "మీరు దేవతలైనా మహాశివుని శక్తి తెలుసుకోలేక పోయారు. శివభక్తులను అవమానించారు. భవిష్యత్తులో జరిగే దక్ష యజ్ఞంలో మీరందరు మహాశివుడి కోపాగ్ని జ్వాలల్లో పడి దగ్ధమైపోతారు"  అని శపించాడు. దేవతలు చింతిస్తూ తమ నివాసాలకు వెళ్లారు.

క్షుపుని వంక తిరిగి "రాజా! లోక కల్యాణం కోసం, ప్రజల సుఖ సంతోషాల కోసం, రాజుల క్షేమం కోసం బ్రాహ్మణులు తపస్సులు, పూజలు నిస్వార్థంగా చేస్తారు, చేయిస్తారు. అందుకే వారు దేవ మానవ పూజ్యులు అవుతారు.  అందరి ముందు తమ తపశక్తులు ప్రదర్శించక సౌమ్యంగా, వినయంగా ఉంటారు. ఈ విషయం గ్రహించి అందరిని ఎక్కువ తక్కువ లేకుండా గౌరవించుము" అని హితబోధ చేసాడు. క్షుపుడు అంగీకరించి నమస్కరించి వెళ్లి పోయాడు.

సనత్కుమారా! దధీచి క్షుఫుల సంవాదం, విష్ణుమూర్తి ఓడిన ప్రదేశం, దేవతలకు దధీచి శాపం ఇచ్చిన ప్రదేశం స్థాణేశ్వరం. ఇక్కడ పరమేశ్వరుడు స్థాణేశ్వర లింగంగా వెలిశాడు. ఈ శివలింగాన్ని దర్శించి, పూజించిన వారు శివలోకం చేరుకుంటారు.

అలాగే ఈ దధీచి క్షుప సంవాదం వినిన వారు, చదివినవారు అపమృత్యు భయం నుండి విముక్తులవుతారు. మరణానంతరం శివలోకం చేరుకుంటారు" అని నందీశ్వరుడు కథ ముగించాడు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.

🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment