1️⃣2️⃣3️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*40. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతిl*
*నాయం లోకోఽస్థి న పరో న సుఖం సంశయాత్మనఃll*
సామాన్య జ్ఞానం(కామన్ సెన్స్) లేని వాడు అంటే విచక్షణా జ్ఞానం లేనివాడు. చేసే పని మీద శ్రద్ధ, విశ్వాసము లేని వాడు, ఎల్లప్పుడూ ప్రతి దానినీ సందేహించేవాడు ఎన్నటికీ బాగుపడడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహముతో సతమతమౌతూ ఉండేవాడు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు. ఇటువంటి వాడికి గురువు మీద, శాస్త్రము మీదా నమ్మకం ఉండదు. ఎవరి మీదా విశ్వాసం ఉంచడు. కాబట్టి అజ్ఞానికి, శ్రద్ధలేని వాడికీ, ముఖ్యంగా సందేహజీవికి ఎక్కడా సుఖం లభించదు.
మనకు తెలియనపుడు ఏదో ఒకటి నమ్మాలి. దాని మీద విశ్వాసం ఉంచాలి. పూర్వపు మహాఋషులు, మునులు, ఎంతో ఆలోచించి, దర్శించి, శాస్త్రజ్ఞానమును మనకు అందించారు. మనకు ఉన్న మిడి మిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న ఒకే ఒక జాడ్యం అల్లా... "వాడికి తెలియదు. వాడికి తెలియదు అన్న విషయం వాడికి తెలియదు." అంటే అంతా నాకు తెలుసు అనుకుంటాడు. అదే అజ్ఞానం. తెలియకపోతే తెలుసుకోవాలి. గురువును ఆశ్రయించాలి. తన సందేహాలు తీర్చుకోవాలి. అంతే కానీ ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకము, పైగా అటువంటి వాడు ప్రతిదానినీ సందేహిస్తాడు.
ఇది ఇలా ఎందుకుంది. అలా ఎందుకు ఉండకూడదు. ఇది నిజంగా జరిగిందా! లేక పుక్కిటి పురాణమా! జరిగితే ఇలానే ఎందుకు జరిగింది. అలా ఎందుకు జరగకూడదు. వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాసారు? వాళ్లు మగాళ్లు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకొని ఉంటారు. గీతను కృష్ణుడు చెప్పాడా? 700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలడు? అసలు భారత యుద్ధం జరిగిందా! ఇలా అనునిత్యమూ ఏదో ఒక పనికిమాలిన సందేహంతో బాధపడుతుంటాడు. అటువంటి వాడికి సుఖమూ, శాంతి అనేదే దొరకదు.
వేదాలలో గానీ, శాస్త్రాలలోగానీ, గీతలో గానీ మనకు ఉపయోగించే వాటిని తీసుకొని, చదివి, అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని, విన్నదాన్ని అర్థం చేసుకొని, మననం చేసుకొని, అనుసరించాలి, ఆచరించాలి గానీ అనునిత్యం సందేహాలతో బాధపడితే వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు.
*41. యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్l*
*ఆత్మవస్తం న కర్మాణి నిబధ్నన్తి ధనజ్ఞయll*
నిష్కామ కర్మయోగమును అవలంబించి, తాను చేసిన కర్మల యొక్క ఫలములను వదిలిపెట్టిన వాడిని, తాను సంపాదించుకున్న జ్ఞానము చేత తన సందేహములను అన్నిటినీ పోగొట్టుకున్నవాడినీ, ఆత్మజ్ఞానము కలిగిన వాడిని, అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు.
మనం ఏ కర్మలు చేసినా ఆ కర్మఫలములు మనలను బంధింపకుండా ఉండాలంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి. కర్మలు చేసిన తరువాత, ఆ కర్మఫలములను పరమాత్మకు అర్పించాలి. సర్వం భగవదారణ చేయాలి. అప్పుడు ఆ కర్మలు మనలను బంధించలేవు. అలాగే శాస్త్రములు చదివి జ్ఞానము కలిగినందువలన మనలో ఉన్న సంశయములు అన్నీ తొలగి పోతాయి. మనసు నిర్మలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక తపస్సు లాగా చేస్తాడు. ఏకాగ్రతతో చేస్తాడు. ఎటువంటి అలసత్వము చూపడు. ఈ రెండు పనులు చేస్తే మనసు ఆత్మయందు లగ్నం అవుతుంది. అతనికి ఎటువంటి సంగము అంటే అటాచ్ మెంటు ఉండదు. ప్రాపంచిక విషయములకు అతడు ఆకర్షితుడు కాదు. ఏదీ కావాలని కోరుకోడు. తనకు లభించిన దానితో, తనకు ఉన్నదానితో తృప్తి పడతాడు. లేని దాని కొరకు ఆరాటపడడు. ఈ దేహము మీద అభిమానము, అహంకారము వదిలిపెడతాడు. నేను వేరు ఈ దేహము వేరు అనే స్థితికి చేరుకుంటాడు.
కర్మబంధము అనేది కేవలం కర్మలు చేస్తే రాదు. కర్మఫలముల యందు ఆసక్తి కలిగి ఉండటం, ఈ కర్మ నేను చేస్తున్నాను దీని ఫలితం నాకు రావాలి అనే కర్తృత్వ భావన కలిగి ఉండటం, చేసే కర్మల యందు విపరీతమైన ఆసక్తి, సంగము అంటే అటాచ్మెంట్ కలిగి ఉండటం... వీటి వలన బంధనములు కలుగుతాయి. ఆత్మజ్ఞానము కల వాడికి ఇవేమీ ఉండవు. ఆత్మజ్ఞానము అంటే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం, ఆత్మనిత్యము, శరీరము అనిత్యము. నేను ఆత్మనే కానీ ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడం. నేను ఈ మనస్సు, బుద్ధి, శరీరాలతో చేసే అన్ని పనులకు కేవలం సాక్షిని మాత్రమే. ఈ కర్మఫలములతో నాకు సంబంధము లేదు. సుఖము దుఃఖము వస్తుంటాయి పోతుంటాయి. వాటిని నేను అనుభవించను. దీనినే ఆత్మజ్ఞానం అంటారు. ఇటువంటి ఆత్మజ్ఞానం కలవాడికి ఏ కర్మచేసినా ఎటువంటి బంధనము కలుగదు. అజ్ఞానములో ఉన్నంత వరకు సందేహములు తప్పవు. ఒకసారి జ్ఞానం కలిగిందంటే అన్ని సంశయములు తొలగిపోతాయి.
తరువాత ఆత్మవన్తం అని కూడా అన్నారు. ఆత్మవస్తం అంటే ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండటం. అది ఆధ్యాత్మిక విషయం అన్నా కానీ, ప్రాపంచిక విషయం అన్నా కానీ, చేసే పని మీద ఏమరుపాటు, అలసత్వం ఉండకూడదు. నిరంతరం మేలుకునే ఉండాలి. అప్పుడే అనవసరమైన విషయాలు మన మనసులోకి చొరబడవు. కాబట్టి మనం అందరం అజ్ఞానాన్ని వదిలిపెట్టి, ఆత్మజ్ఞానం సంపాదించి, అన్ని సంశయములు పోగొట్టుకొని, ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటూ, మనం చేసిన కర్మఫలములు అన్నీ పరమాత్మకు అర్చిస్తే, మనకు ఆ కర్మబంధనములు అంటవు.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P285
No comments:
Post a Comment