Monday, January 26, 2026

 💐36శ్రీ లింగ మహాపురాణం💐 

🍀చతుర్యుగ లక్షణాలు🍀

    #ముప్పై ఆరవ భాగం#

నంది తండ్రి అయిన శిలాద మహర్షి ఇంద్రుని "బ్రహ్మదేవుడు విశ్వానికి కాల పరిమాణంగా నిర్ణయించిన నాలుగు యుగాల లక్షణాలు, ధర్మాలు వివరించమని" కోరాడు.

ఇంద్రుడు "కృత యుగము సత్త్వ గుణ ప్రధానమైనది,  త్రేతా యగం రాజస గుణ ప్రధానమైనది. , ద్వాపర యుగం రజో తామస గుణాల  మిశ్రమంగా ఉంటుంది. కలియుగం పూర్తిగా తామస గుణము కలిగి ఉంటుంది.  భగవంతుని అనుగ్రహం కోసం కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చనము, కలియుగంలో శుద్ద దానము, భక్తి ముఖ్య సాధనాలు అవుతుంది.

కృతయుగం నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు, త్రేతాయుగం మూడువేల ఆరు వందల దివ్య సంవత్సరాలు, ద్వాపరం రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు, కలియుగం ఒక వేయి రెండు వందల దివ్య సంవత్సరాలు ఉంటుంది. మానవ సంవత్సరాలలో అయితే వరుసగా 17,28, 000 ; 12,96,000; 8,64, 000; 4,32, 000 ఉంటుంది. మానవుల ఒక సంవత్సరం దేవతలకు ఒక దివ్య దినము (రోజు) అవుతుంది. మూడు వందల అరవై మానవ సంవత్సరాలు దేవతలకు ఒక దివ్య సంవత్సరం అవుతుంది. 

యుగానికి యుగానికి మధ్య యుగ సంధ్య ఉంటుంది. ఇది మూడు వేలు, రెండు వేలు, ఒక వేయి సంవత్సరాలుగా ఉంటుంది. సంధ్యకాల, సంధ్యాంశ కాల పరిమాణం సమానంగా ఉంటుంది. ధర్మము కృతయుగంలో నాలుగు పాదాలపై, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై, కలియుగంలో ఒక పాదం పై నిలబడుతుంది

ఇక యుగ లక్షణాలు, ధర్మాలు వివరిస్తాను.

కృతయుగంలో ప్రజలందరు విశేష విశిష్ట గుణ ధర్మాల కలిగి ఉంటారు. రూపములో, ఆయుష్యులో, సుఖములలో అందరు సమానంగా ఉంటారు. స్త్రీ పురుషులలో ద్వంద్వ భావాలు, రాగద్వేషాలు ఉండవు. పర్వతాల పైన, సముద్రాలలోని దీవులలో నివసిస్తారు.

సత్త్వ గుణం కలిగి ఒకరి పై ఒకరు సమభావం కలిగి ఉంటారు. వర్ణాశ్రమ జాతుల బేధం లేక అందరు ఒకటిగా ఉంటారు.  కృతయుగంలో ప్రజల ఆయుష్యు నాలుగు వేల సంవత్సరాలు ఉంటుంది. పాప చింతన, పాప కర్మలు ఉండవు.

త్రేతాయుగంలో ప్రజల ఆనందం ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. నీరు మేఘాలలాగా మారి భూమి పై వర్షరూపంలో కురుస్తుంది. ఆ నీటితో భూమి పై పాడి పంటలు, ఫల వృక్ష సంపద ఉత్పత్తి అవుతుంది. ప్రజల వీటి పై ఆధారపడి జీవిస్తారు. పర్వతాల పై, వృక్షాలు కింద కాకుండా ప్రజలు ఇళ్లు కట్టుకుని నివసిస్తారు. పూల తేనలు, తేనెటీగల పుట్టల తేనలు త్రాగుతారు.

మొదట మొదట ఉన్నవాటితో అందరు సంతృప్తిగా జీవితం గడుపుతారు. కాలక్రమేణా రాగద్వేషాలు, లోభ మోహాలు కలుగుతాయి. సంపదలు ప్రోగు చేయడం ప్రారంభిస్తారు. సమానత్వం పోతుంది. ఇతరుల ధన కనక స్త్రీ పుత్రులను బలవంతంగా వశం చేసుకుంటారు.

అప్పుడు బ్రహ్మ దేవుడు ధర్మ పరిరక్షణకు వర్ణాశ్రమ ధర్మాలు, నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాలు ఏర్పరిచాడు. ప్రతి జాతికి వృత్తి జీవన విధాన ఆచరణలు ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణులను వేద ధర్మ పరిరక్షణ, యజ్ఞయాగాదుల నిర్వహణకు, క్షత్రియులను ప్రజల రక్షణకు, వైశ్యులను పాడి పంటలు వ్యాపారాలకు, శూద్రులను పై మూడు వర్ఙాల విధుల నిర్వహణలో సహాయం చేయడానికి ఏర్పాటు చేశాడు.

ద్వాపర యుగం వచ్చేసరికి ప్రజలలో మనో వాక్కాయ కర్మలలో వివిధ అభిప్రాయ బేధాలు వచ్చాయి. పాడి పంటలకు, ఇతర కార్యాలకు అధిక శారీరక శ్రమ అవసరమైంది. ఫలితంగా రోగాలు, వ్యాధులు రాసాగాయి.  ఫలితంగా ప్రజల ఆయుః పరిమాణం తక్కువ అయ్యింది. జీవితం వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాలకు పడిపోయింది.

ప్రజలలో సేవకులు, కార్మికులు, యజమానులు అనే బేధం ఏర్పడింది. ఫలితంగా మద మోహ లోభ మాత్సర్య గుణాలు ప్రజలలో ఎక్కువ అయ్యాయి. గమనించిన వేదవ్యాసాది ఋషులు ధర్మ ప్రతిష్టాపనకు, పరిరక్షణకు, విస్తృత వ్యాప్తికి వేదాలను నాలుగు భాగాలుగా విభజించి రచించారు. ప్రజలకు వేద ధర్మాలు సులభంగా అర్థం అవ్వడానికి ఇతిహాస పురాణాల రచనలు జరిగాయి.

అనావృష్టి అతివృష్టి మొదలైన ప్రకృతి విపత్తులు, రోగాలు, దీర్ఘవ్యాధులు, అకాల మృత్యువులు మొదలైన శారీరక మానసిక స్థితుల వలన మనుషులలో దుఖములు కలిగాయి. ఆ దుఖాల నుండి విముక్తి పొందాలనే ఆలోచన కలిగి వైరాగ్యం కలిగింది. తద్వారా ద్వాపరంలో ప్రాపంచిక విషయాలపై, వాటిలో గల దోషాలు పై జ్ఞానము కలగటం ఆరంభమైంది. ఈ జ్ఞానము రజోతమో గుణ మిశ్రమమైనది.

కృతయుగంలో ప్రజలందరికి సమాన ధర్మముగా ఉన్నది త్రేతాయుగంలో ఆచరణ కార్యంగా మారింది. ద్వాపరానికి వచ్చేసరికి మరింత కలుషితమై స్వార్థపూరితమైంది. కలియుగానికి వచ్చేసరికి ధర్మము పూర్తిగా మారిపోయి వ్యక్తిగతము అయ్యింది.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.

🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment