1️⃣2️⃣2️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*38. న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతేl*
*తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతిll*
జ్ఞానం యొక్క విశిష్ఠతను గురించి ఇంకా వివరంగా చెబుతున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి కానీ జ్ఞానము వంటి పరమ పవిత్రమైనది మరొకటి లేదు. అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానము. మానవుని పవిత్రుడిని చేయడంలో జ్ఞానమును మించినది ఏదీ లేదు. మానవునిలో అజ్ఞానమును నిర్మూలించి ఆత్మానుభూతిని కలిగించేదే జ్ఞానము. అటువంటి జ్ఞానమును యోగసిద్ధిని పొందిన సాధకుడు కాలానుగుణంగా తనకు తానే స్వయంగా పొందుతున్నాడు.
మనకు కనిపించేది ఈ దేహము. దీనిని శుద్ధిచేయాలంటే గంగాస్నానము పవిత్ర జలాలలో స్నానము, పరిశుభ్రంగా ఉండటం, పూజలు వ్రతాలు చేయడం మొదలగునవి చేస్తాము. కాని మనసుకు పట్టిన మకిలను వదల్చడానికి విహిత కర్మ ఆచరణ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము ఇటువంటి సాధనములు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటిలోకీ జ్ఞానము ముఖ్యమైనది. ఈ జ్ఞానము మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు. స్వయమ్ అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి. జ్ఞానం కలగడానికి గురువు, దైవము కేవలం తమ వంతు సాయం అందిస్తారు కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారు చేసుకోవాలి. అందుకే స్వయమ్ అనే పదాన్ని వాడారు.
జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మయోగమును చక్కగా అవలంబించాలి. నిష్కామ కర్మను అనుష్టించాలి. ఇంద్రియ నిగ్రహము పాటించాలి. చిత్తశుద్ధి కలగాలి. అప్పుడే జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అవుతాడు. ఈ జ్ఞానం ఎక్కడ పుడుతుంది అంటే ఎవడి హృదయంలో వాడికి జ్ఞానం పుడుతుంది. ఒకరి హృదయంలో పుట్టిన జ్ఞానము మరొకరికి పంచడం కుదరదు. ఎవడికి వాడే జ్ఞానం సంపాదించి అనుభవించాలి.
ఈ జ్ఞానం రావడానికి ఇంత సమయం అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు కొద్దికాలంలోనే రావచ్చు. చిత్మము ఎప్పుడు నిర్మలమై జ్ఞానం సంపాదించడానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అది వారు చేసే సాధనలను బట్టి, సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంత కాలము సాధన చేసాను. ఇంకా నాకు జ్ఞానం రాలేదే అని బాధ పడకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంతకాలమైనా వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎవరి ప్రయత్నమును బట్టి వారికి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాయ పండాలంటే సమయం కావాలి. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉంటే గానీ బయటకు రాడు ఇదీ అంతే. మొక్క మాను కావడానికి ఎంతోకాలం వడుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చల మనస్సుతో, నిష్కామ కర్మలు చేస్తూ, ప్రాణాయామం లాంటి సాధనలుచేసి ఇంద్రియ, మనో నిగ్రహములను పాటిస్తే, హృదయం నిర్మలంగా ఉంచుకుంటే, జ్ఞానము తప్పకుండా కలుగుతుంది.
*39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్డ్రియఃl*
*జ్ఞానం లబ్ద్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతిll*
శ్రద్ధకలవాడు, నిష్ఠ కలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు, జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానము లభించిన తరువాత పరమ శాంతిని పొందుతున్నాడు.
జ్ఞానము పొందడానికి ముఖ్యమైన మూడు లక్షణములను, ఆ జ్ఞానము పొందిన తరువాత కలిగే లాభమును వివరించాడు పరమాత్మ. మొదటిది శ్రద్ధ. ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యము. ఒక్క జ్ఞానము సంపాదించడానికే కాదు ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పని చేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకము విశ్వాసము ఉండాలి. అంతే కానీ అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదో అనే సందేహము కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణము అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలము కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది. నా ఉన్నతికి తోడ్పడుతుంది. నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు.
రెండవది... తత్పరః అంటే తదేకనిష్ట ఏకాగ్రత. పట్టుదల. నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగాచేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడం వలన విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఎవరూ మనలను నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి. అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యము సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి మరల్చి, ఆత్మవిచారణ వైపు తిప్పితే, ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది.
ఉదాహరణకు గీతాజ్ఞాన యజ్ఞమునకు వెళ్లాము. ఏదో చెప్పారు, విన్నాము అని కాకుండా ఏకాగ్రతతో వినాలి. అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి పోయి విన్న దానిని మననం చేసుకోవాలి. మనసుకు పట్టేటట్టు చేసుకోవాలి. అని ఆచరణయోగ్యము అవునో కాదో విచారించాలి. వీలైతే ఆచరించాలి. ఏమైనా సందేహాలు ఉంటే గురువులను అడిగి తీర్చుకోవాలి. ఇలా చెయ్యాలి కానీ, ఆయనేదో చెప్పాడు, మనం ఏదో విన్నాములే, ఇదేమన్నా మనకు వీలు అయ్యేదా ఏమన్నానా, అని అనుకుంటూ వెంటనే మరిచిపోకూడదు.
ప్రస్తుతానికి వస్తే విద్యార్థులు చాలా మందికి చదివే చదువు మీద నిష్ఠ ఉండదు. ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టివి. పక్కనే సెల్ఫోను, (పురాణ కాలాల్లో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్విశి మొదలగు అప్సరసలను పంపేవాడని విన్నాము. ఈ రోజుల్లో, మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్టఫోన్ ను కనిపెట్టి మన మీదికి వదిలాడు.) అందులో ఫేసుబుక్కు, వాట్సప్ ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు రాంకు ఖాయం. కాని ఈ రహస్యం తెలుసుకోలేక క్వష్చన్ బాంకుల మీద వేలకు వేల ట్యూషన్ల మీద ఆధారపడుతుంటారు. క్లాసు రూములో చెప్పే పాఠం శ్రద్ధగా విని, ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే, తెలియని విషయాలను మరునాడు టీచరును కానీ, లెక్చరరును గానీ అడిగి చెప్పించుకుంటే, అది మెదడులో శాశ్వతంగా రికార్డు అవుతుంది. పరీక్షలలో ఎంతో సాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం.
మూడవది ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. ప్రాపంచిక విషయములలో లీనం అయి ఉంటాయి. ఇంద్రియములు చూచిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలం అవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఆత్మజ్ఞానము అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే గానీ సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు.
ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేకనిష్ఠ, ఇంద్రియనిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానము, పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావాల్సింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువయింది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. పై విధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్యప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P283
No comments:
Post a Comment