💐37శ్రీ లింగ మహాపురాణం💐
🍀చతుర్యుగ లక్షణాలు - కలియుగం🍀
#ముప్పై ఏడవ భాగం#
కలియుగంపూర్తిగాతమోగుణంతో నిండిపోయి ఉంటుంది. ప్రజలు మనస్సులు ఈర్ష్య ద్వేషము మోహ మాయలతో నిండి ఉంటుంది.అనావృష్టి అతివృష్టి భూమండలం పై తమ ప్రతాపం చూపుతాయి. కష్టపడి శ్రమ చేయడం వదలివేసి జనులు సోమరితనం పాలవుతారు, రోగాలు, ఆకలిచావులు అధికంగా ఉంటాయి.
అధర్మం ధర్మంగా, ధర్మం అధర్మంగా పరివర్తన చెందుతుంది. పాపభీతి, దైవభీతిపోయి పాపకార్యాలు అధికమవుతాయి. బ్రాహ్మణులు వేదాధ్యయనము, యజ్ఞయాగాదులు వదలి వేస్తారు. క్షత్రియులకు బదులుగా శూద్రులు రాజులై పరిపాలిస్తుంటారు. చోరులు రాజులలాగా, రాజులు చోరులుగా ఉంటారు. వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ ధ్వంసం అవుతాయి.
పరిపాలించే రాజులు ప్రజలకు రక్షకులు కాకుండా ప్రజల ప్రాణాలు, సంపదలను దోచుకుంటారు. పురుషుల ఏకపత్ని వ్రతము, స్త్రీల పాతివ్రత్యం క్షీణిస్తాయి. అల్పబుద్ది కలవారు, అహంకారం, బలం, అధికారం కలిగి వేదాంతులను, జ్ఞానులను బాధలు పెడుతుంటారు.
నాలుగు ఆశ్రమాలు క్షీణించి ధర్మం పాటించేవారు ఉండరు. పాలకులు, అధికారులు, ధర్మకర్తలు దేవాలయాలకు, దేవతలకు సమర్పించబడిన ధన కనక వస్తువులకు రక్షకులుగా ఉండక వాటిని స్వయంగా దోచుకుంటారు. ప్రసాదాలు, అకాలములో చేయబడిన ఆహార పదార్థాలు బజారులలో అమ్మకానికి ఉంటాయి.
వేదాలు, ఇతర ధార్మిక పవిత్ర సాహిత్యము అమ్మకానికి ఉంచబడుతుంది. దేవుళ్ళ మీద, పెద్దల మీద, తల్లి తండ్రులు గురువు మీద భక్తి గౌరవం వినయం ఉండదు. గోవుల సంఖ్య తగ్గుతుంది. అడవి జంతువులు, క్రూర మృగాలు అడవిని వదలి గ్రామాలు, నగరాల పై పడి ప్రజలను, పాడి, పెంపుడు జంతువులను చంపుతుంటాయి.
ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. ధన సంపదలు కోసం తనవారు, పరాయివారు అనే బేధం లేకుండా హింసించడానికి, చంపడానికి వెనుకాడరు. దౌర్జన్యం చేసేవారు, ధన సంపదలు ఏవిధంగా నైనా సంపాదించిన వారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నాయకులు అవుతారు. అధికారులు, పరిపాలకులు వారి సేవలు చేస్తూ సామాన్యులను పట్టించుకోరు.
దేశాలు, నగరాలలో, గ్రామాలలో వివిధ ఆయుధాలు ధరించిన వారి సంఖ్య అధికం అవుతుంది. భూమిలో జల సంపద క్షీణిస్తుంది. చోరులు ఇతర చోరుల సంపద దోచుకుంటారు. పుష్టికరమైన, నాణ్యమైన ఆహరం లభించదు. కలుషిత ఆహారం, నీరు, గాలి వలన ప్రజల శక్తి సామర్థ్యాలు తగ్గి అనేక రోగాల పాలవుతారు.
ప్రజల ఆయుష్యు తగ్గుతుంది. వంద సంవత్సరాలు బ్రతికేవారు ఉండరు. కలియుగం చివరలో పదహారు సంవత్సరాల ఆయుష్యు కల ప్రజలు జన్మిస్తారు. ధర్మ భావన పూర్తిగా నశిస్తుంది. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు, కాపాలికుల సంఖ్య అధికం అవుతుంది. ప్రజలు వీరి మాటలు నమ్మి వీరిని అనుసరించడం ప్రారంభిస్తారు. ఫలితంగా వీరి ఆశ్రమాలు, నివాసాలు అధిక ధన సంపదలకు నిలయం అవుతాయి.
ఫలితంగా కలియుగంలో ఆయువు, బలము, రూపము క్షీణించి పోతాయ. బ్రహ్మ హత్య, స్త్రీ హత్య, భ్రూణ హత్యలు జరుగుతాయి. పుత్ర సంతానం పై అధిక మోహంతో పుట్టక ముందే శిశువును గర్భావస్థలోనే నాశనం చేస్తారు.
భగవంతుని నమ్మి నిర్మలంగా పూజించేవారు, వేదాలను, స్మృతి, శ్రుతలను పాటించేవారు కొందరు మాత్రమే ఉంటారు. వీరు ప్రజలలో భగవంతుని పై భక్తి, ధర్మాచరణ పై ఆసక్తి కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కలియుగ అంతంలో ధర్మ స్థాపనకు, దుష్ట సంహరణకు చంద్రవంశంలో భగవంతుడు జన్మిస్తాడు. ప్రమతి అనే పేరుతో పిలువ బడతాడు.
గొప్ప సైన్యం సమకూర్చుకుని ముఫై రెండు సంవత్సరాలు భూమండలం పరిభ్రమించి అధార్మిక రాజులను, ప్రజలను సంహరిచి ధర్మ ప్రతిష్టాపన చేసి ఇరవై సంవత్సరాలు ప్రభువుగా ఉంటాడు. యుగాంతంలో మిగిలిన కొద్ది మంది ప్రజలు ఒక సమూహం ఏర్పడి జీవిస్తారు. కలియుగంలో మిగిలిన కొద్ది మంది కృతయుగంలో ప్రవేశిస్తారు. అప్పటివరకు అదృశ్యంగా ఉన్న సిద్దులు, ఋషులు రూపం దాల్చి వీరికి మార్గదర్శకులు అవుతారు.
వర్ణాశ్రమ ధర్మాలు బోధిస్తారు. యజ్ఞ యాగాదులు చేయిస్తారు. సప్త ఋషుల ద్వారా నిర్దేశించబడిన ధర్మములో నడవడం వలన కృతయుగంలో ప్రజల సంఖ్య వృద్ధి చెందటం ఆరంభమవుతుంది.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment