ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మహర్షి యథా ప్రకారం ఉదయం గోశాల వైపు వెళ్ళే దారిలో ఒక వాకిట ముందు ఒక అందమైన నెమలి ముగ్గు వేయబడి ఉండెను.
సరిగ్గా అదే సమయమునకు ఒక నెమలి కూడా అచ్చటికి వచ్చెను. అక్కడున్న వారు వెంటనే మరమరాలు, శనగపప్పు వేసియున్న డబ్బాను తెచ్చి నెమలి ముందు ఉంచారు. కానీ ఆ నెమలి ఎదుట పెట్టిన దానిని తినకుండా, ఆ నెమలి ముగ్గునే తీవ్రముగ చూచుచూ ఉండెను.
మహర్షి ఆ నెమలిని చూస్తూ “ఏమిరా! నాకు పోటీగా ఇంకొకడు వచ్చాడా! అని చూస్తున్నావా?" అని అడిగిరి. మహర్షి ఇట్లు అడిగిన వెంటనే నెమలి టక్, టక్ అని డబ్బాలో ఉన్న పప్పును తన ముక్కుతో పొడిచెను.
ఆ నెమలి ముగ్గు వేసినవారి గురించి మహర్షి ఇలా సెలవిచ్చెను ....
వీరందరికి ఆత్మ విద్య చాలా సులభం. ఎందుకంటే వీరి యొక్క బుద్ధి కుశలత అతి సూక్ష్మంగా ఉన్నది. అయితే ఆత్మ విద్యకు వెళ్ళరే! ఈ రోజు నెమలి భ్రమించి నిలుచునట్లు వేసిన ముగ్గును, రేపు మరొక నెమలి, ముగ్గును చూచి ఆడునట్లు వేయవలెనని, బుద్ధిని తీవ్రంగా అందులో ప్రవేశింప చేయుదురేకాని, ఆ బుద్దిని అంతర్ముఖం(ఆత్మ ముఖం) చేయజాలరు.
ఒకరు చేసిన పని యొక్క గొప్పతనమును తెలుసుకోవాలంటే, అదే పనిలో అనుభవమున్న వారి చేతనే తెలియవలయును. ఎదుటివారు తన గొప్పతనమును పొగడిననే వారికి గొప్పతనం.
ఇది ఎలాగంటే "ఒక సంగీత విద్వాంసుడు తన్ను గురించి పేక్షకులు ఎంత పొగడినను పూర్ణ తృప్తి పొందడు. తనవలెనే ఉన్న మరొక విద్వాంసుడు తనను గురించి పొగడినప్పుడే అతని మనసు పరిపూర్ణ తృప్తి చెందును."
No comments:
Post a Comment