1️⃣2️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*36. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమఃl*
*సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసిll*
ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు. అర్జునా! ఒక వేళ (అస్యూమింగ్ వితవుట్ కన్ సీడింగ్ లేక అస్యూమింగ్ ఫార్ ఏ మూమెంట్) నీవు యుద్ధము చేసి వీళ్లందరినీ చంపి, అంతులేని పాపము మూటగట్టుకొని, తద్వారా జరగబోయే వర్ణసంకరమునకు బాధ్యుడవయి, ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరి కంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా, నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే, జ్ఞానము అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపము కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది. అని అభయం ఇచ్చాడు.
అందుకే పై శ్లోకంలో యుద్ధం అయిన తరువాత మంచి గురువును చూచి ఆయన వద్ద జ్ఞానమును సంపాదించు అని బోధించాడు. అంటే ఇంత చెప్పినా అర్జునుడికి జ్ఞానం తలకెక్కలేదు అని వ్యంగ్యంగా అంటున్నట్టు ఉంది.
ఈ శ్లోకమును అర్జునుడి పరంగా కాకుండా మానవుల పరంగా కూడా అర్ధం చేసుకోవచ్చు. ఎలాగంటే మానవుడు కర్మలు చేయడం, అందులో పాప కర్మలు చేయడం, పాపాలు మూటగట్టుకోవడం సర్వసాధారణం. కాబట్టి మానవుడు పాపాలు చేసినా కూడా గురువు గారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానమును పొందితే ఆ పాపాలు అన్నీ పోతాయి అని భావన. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పతలచుకున్నది ఏమిటంటే ఎన్ని మహాపాపములు చేసినప్పటికినీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించి పోతాయి. అంటే ముందు పాపాలు చేసి తరువాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసీ తెలియకుండా, అజ్ఞానం చేత, ఏమైనా పాపాలు చేసి ఉంటే, గురువు ఉపదేశమువలన అజ్ఞానము నుండి జ్ఞానము లోకి అనగా చీకటి లో నుండి వెలుగులోకి ప్రవేశించి, ఆ జ్ఞానముతో గత జన్మలోని కానీ ఈ జన్మలోని కానీ చేసిన పాపములను పోగొట్టుకొనే అవకాశము ఉంది. జ్ఞానము అంతగొప్పది అని చెప్పడమే ఈ శ్లోకము ఉద్దేశ్యము కానీ పాపములు చేయడానికి లైసెన్సు ఇచ్చినట్టు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు! అంతే కానీ సముద్రం అంత పడవ అక్కరలేదు. అలాగే మనం చేసిన పాపము ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానముతో ఆ పాపసముద్రమును దాటవచ్చు. అందుకనే ఈ శ్లోకంలో సంతరిష్యసి అనే మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం.
ఇంకా కొంతమంది ఒక దురభిప్రాయములో ఉంటారు. పాపం చేసిన వాళ్లు వేదములు శాస్త్రములు చదువరాదు. అసలు తాకనేకూడదు. ఓంకారము పలుకకూడదు. గీతను చదవకూడదు అనే ఆంక్షలు పెడుతుంటారు. అది శుద్ధ తప్పు. ఈ శ్లోకం ప్రకారము ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానము సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానము రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్నీ చదవవచ్చు. ఏ దోషము లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్న వాడికి మందు అక్కరలేదు. రోగికే మందు కావాలి. అలాగే పాపము చేసిన వాడికే దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. వాడే వేదములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ, ఎవరైనా కానీ ఆత్మజ్ఞానము పొందడానికి అర్హులు.
*37. యథైధాంసి సమిద్ధోఽగ్నిర్భస్మసాత్కురుతేఽర్జునl*
*జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథాll*
బాగుగా మండుతున్న అగ్ని తనలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వ కర్మలను భస్మము చేస్తుంది.
ఈ శ్లోకములో జ్ఞానము అంటే అగ్ని అని అన్నారు. జ్ఞానమును అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుంగో అలాగే, జ్ఞానము కూడా కర్మలను కాలుస్తుంది అని అన్నారు. ఇంతకు ముందు మనం చేసిన పాపములు ఎలా నాశనం అవుతాయో చెప్పబడింది. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెబుతున్నాడు పరమాత్మ.
మనం దుఃఖములో ఉన్నాము. ఆ దుఃఖము పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదు అంటే కర్మలు, కర్మబంధనములు ఉండకూడదు. కర్మబంధనములు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో వేసి కర్మలను, కర్మబంధనములను కాల్చివేయవచ్చు. ఆ అగ్ని కూడా ఎటువంటిది అంటే సమిద్ధోగ్ని అంటే బాగా మండుచున్న అగ్ని. అంటే నివురు గప్పిన నిప్పుకాదు. జ్ఞానము కూడా మానవునిలో ఆ మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉండాలి.
ఇంకొక పదం కూడా వాడారు సర్వ కర్మాణి అని. సకల కర్మలు, ఆ కర్మల వలన కలిగిన బంధనములు. అంటే మానవుడు ఎటువంటి కర్మ చేసినా సరే ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము తొలగిస్తుంది. జ్ఞానము అంటే ఏమిటి? ఆత్మతత్వమును తెలుసుకోవడం. ప్రాపంచిక విషయములు అన్నీ అశాశ్వతములు అసత్యములు. పరమాత్మ ఒక్కటే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములను నదిలిపెట్టి శాశ్వతుడు అయిన పరమాత్మలో మనసును లగ్నం చేయడం. ఇదే అసలైన జ్ఞానము.
ఇంక కర్మలు మూడు రకాలు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే సంచిత కర్మ పూర్తిగా కాలి పోతుంది. అసలు మొలకెత్తదు. రెండవది ఆగామి కర్మ ఒక సారి జ్ఞానం కలిగితే ఆగామి కర్మలను మనం నివారించవచ్చు. ప్రారబ్ధ కర్మ జ్ఞానం కలిగే కొద్దీ క్రమక్రమంగా క్షీణించి పోతుంది. ఈ ప్రారబ్ధ కర్మ జ్ఞానిని ఏమీ చేయలేదు. అంటే జ్ఞాని బయట ప్రపంచంలో ఏమిచేసినా అతనికి ఆ కర్మబంధనములు అంటవు. కాబట్టి ఈ జనన మరణ చక్రములో నుండి బయట పడదలచుకున్నవాడు ముందు కర్మయోగము తరువాత జ్ఞానయోగము అవలంబించి కర్మలను, ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము అనే అగ్నిలో దగ్ధం చేయాలి.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P280
No comments:
Post a Comment