Monday, January 26, 2026

 *శ్రీ శివ మహా పురాణం*
*406.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఇరువది ఐదవ అధ్యాయం* 

*పార్వతి గౌరి యగుట* 

*వాయువు ఇట్లు పలికెను:* 

తరువాత పతివ్రతయగు ఆ జగన్మాత భర్తకు ప్రదక్షిణమును చేసి వియోగదుఃఖమును అణిచి పెట్టుకొని హిమవత్పర్వతమునకు వెళ్లెను. ఆమె పూర్వము సఖీజనులతో గూడి ఏ స్థానములో తపస్సును చేసియుండెనో, మరల తపస్సు కొరకై ఆమె అదే స్థానమును ప్రేమ పూర్వకముగా ఎన్నుకొనెను. తరువాత ఆ పార్వతీ దేవి తన తల్లిదండ్రులను వారి గృహమునందు దర్శించి వారికి నమస్కరించి, జరిగిన వృత్తాంతమును విన్నవించి, వారి అనుమతిని పొంది, మరల తపోవనమునకు వెళ్లి, ఆభరణములను విడిచి పెట్టి, స్నానమును చేసి, తపశ్శాలురు ధరించే మిక్కిలి పవిత్రమగు వేషమును ధరించి, సర్వకాలములలో భర్తయొక్క పాదపద్మములను మనస్సులో నిలిపి, మిక్కిలి తీవ్రమైనది మరియు చేయుటకు చాల కష్టమైనది అగు తపస్సును చేయ సంకల్పించెను. ఆ శివుని ఉత్సవలింగమునందు ధ్యానిస్తూ మూడు సంధ్యలలో బాహ్యపూజావిధానముతో అడవిలో దొరికే పువ్వులతో పండ్లతో ఆరాధించెను. ఆ శివుడే బ్రహ్మ రూపమును దాల్చి వచ్చి నాకు తపస్సుయొక్క ఫలమును ఈయగలడని నిత్యము భావిస్తూ ఆమె తపస్సును చేసెను. ఈ విధముగా ఆమె తపస్సును చేయుచుండగా చాల కాలము గడిచెను. ఒకనాడు ఒక పెద్ద పులి హింసించ వలెననే తలపుతో ఆమె మీదకు వచ్చెను. మిక్కిలి చెడ్డ సంకల్పముతో ఆమె మీద మీదకు వచ్చిన ఆ పులి, బొమ్మ పులి వలె స్తంభించి పోయి నిలబడెను. ఆ విధముగా చెడు తలంపుతో మీదకు వచ్చిన పెద్దపులిని చూచి కూడా ఆ దేవి సామాన్య జనుని వలె తన ధ్యానమునుండి చలించలేదు.

ఆకలిచే నిరంతరముగా పీడింపబడి స్తంభించిన సకలావయవములు గల ఆ పులి ఈమె తప్ప నాకు మరియొక ఆహారము లేదని భావించెను. అపుడు ఆ పులి ఎడతెరపి లేకుండగా సర్వకాలములలో ఆమె వైపునకు చూచుచు ఆమెను ఉపాసించు చున్నదా యన్నట్లు యెదురుగా నిలబడి యుండెను. ఇతి నిత్యము నన్నే ఉపాసించుచున్నది; నన్ను క్రూరమృగముల బారి నుండి ఇది కాపాడగలదు అని దేవియొక్క హృదయములో కూడ దయ పుట్టెను. అపుడు ఆమె యొక్క దయాసంబంధముచే వెంటనే ఆ పులియొక్క మనోవాక్కాయముల యందలి దోషములు తొలగి పోయి, అది దేవిని తెలియగల్గెను. ఇంతే గాక, దాని శరీరావయవముల స్తంభనము తొలగి పోయి, దాని ఆకలి కూడ తీరెను. దానికి పుట్టుకనుండి వచ్చిన దుష్టబుద్ధి తొలగి పోయి తృప్తి కలిగెను. వెను వెంటనే అది పరమభక్తిభావముతో తన కృతార్థతను గుర్తించి ఉపాసకుని భావమును పొంది ఆ పరమేశ్వరిని సేవించెను. ఆ పులి క్రూరమృగములను, దుష్టబుద్ధి గల ఇతర ప్రాణులను తరిమి గొట్టుచూ ఆ తపోవనమునందు తిరుగాడెను. దేవియొక్క తీవ్రమగు తపస్సు మరింత తీవ్రముగా వర్ధిల్లెను. రాక్షసుల బాధల వలన దేవతలు బ్రహ్మను శరణు పొందిరి. తమకు శత్రువుల పీడ వలన కలిగిన దుఃఖమును, వరములను పొంది మిక్కిలి గర్వించియున్న శుంభనిశుంభులు తమకు కలిగించే ఇబ్బందులను ఆ దేవతలు బ్రహ్మకు విన్నవించుకొనిరి. ఆ బ్రహ్మ కూడా దేవతల దుఃఖమును గురించి విని దయతో కూడిన వాడై, తనకు శంకరునితో హేతుయుక్తముగా జరిగిన సంభాషణమును స్మరించి, రాక్షసుల వధ కొరకు ఆకాంక్ష గలవాడాయెను.

ఈ విధముగా ప్రార్థింపబడిన బ్రహ్మ దేవతలతో గూడినవాడై, దేవతలకు తన ప్రయత్నముచే కలుగవలసిన దుఃఖనివృత్తిని గురించి మనస్సులో తల పోస్తూ పార్వతీదేవియొక్క తపోవనమునకు వెళ్లెను. ఆయన గొప్ప తపస్సును దృఢముగా చేయుచున్నట్టియు, జగత్తునకు ఆధారము వలెనున్నట్టియు, పరమేశ్వరియగు భవానిని చూచెను. జగత్తునకు, తనకు, విష్ణువునకు మరియు రుద్రునకు కూడ తండ్రియగు శివుని భార్య, సర్వశ్రేష్ఠురాలు, పర్వతరాజు పుత్రిక యగు ఆ దేవికి ఆయన నమస్కరించెను. దేవగణములతో గూడి వచ్చియున్న బ్రహ్మను చూచి ఆ దేవి ఆయనకు తగిన విధముగా అర్ఘ్యమును ఇచ్చి స్వాగతమును పలికి ఉపచారములను సమర్పించెను. పద్మసంభవుడగు బ్రహ్మ ఆ ఉపచారములకు తగిన రీతిలో బదులు చెప్పి ఆమెను సత్కరించి అభినందించి తెలియని వాడు వలె ఆమె తపస్సును చేయటకు గల కారణమును గురించి ప్రశ్నించెను.

*బ్రహ్మ ఇట్లు పలికెను:* 

దేవి ఇచట ఈ విధముగా తీవ్రమగు తపస్సును చేసి దేనిని సాధించగోరుచున్నది? తపఃఫలములకు సంబంధించిన సిద్ధులన్నియు నీ అధీనములో నున్నవే గదా! జగత్ర్పభువగు ఆ పరమేశ్వరునే భర్తగా పొందిన నీవు తపస్సుయొక్క ఫలము ను పొందియే యున్నావు. లేదా, ఇదంతా నీ వినోదము కొరకు చేయబడే విలాసము మాత్రమే. కాని ఇది యొక చిత్రము గలదు. శివుని విరహమును నీవు ఎట్లు సహించుచున్నావు? 

*దేవి ఇట్లు పలికెను:* 

సృష్ట్యాదియందు నీవు పరమేశ్వరునినుండి జన్మించినావని వేదములు చెప్పుచున్నవి. ఆ ప్రసంగములో నీవు నా సంతానములో మొదటి కుమారుడవు. మరల సంతానము వర్ధిల్లుట కొరకై శివుడు నీ లలాటమునుండి పుట్టిన సందర్భములో నీవు నాకు మామగారు అగుటచే తండ్రితో సమానము అగుచున్నావు. ఓ సర్వలోకపితామహా! మరల, నాకు స్వయముగా తండ్రియగు పర్వతరాజు నీకు పుత్రుడైన సందర్భములో నీవు నాకు పితామహుడ వగుచున్నావు. లోకములను సృష్టించే ఇట్టి నీకు అంతఃపురములో నాకు భర్తతో జరిగిన వృత్తాంతమును ఎట్లు చెప్పగలను ?  ఇన్ని మాటలేల? నా దేహమునకు గల ఈ నల్లదనమును సాత్త్వికమగు విధానములో విడిచి పెట్టి, నేను పచ్చని దానను కాగోరుచున్నాను.

 *బ్రహ్మ ఇట్లు పలికెను:* 

ఓ దేవీ! ఇంతటి చిన్న ప్రయోజనము కొరకై తీవ్రమగు తపస్సును ఏల చేసితివి? దీని కొరకై నీ సంకల్పమాత్రము చాలదా? ఇట్టి తపస్సు నీకు క్రీడయే సుమా!  ఓ జగన్మాతా! నీ క్రీడ కూడ లోకములకు హితమును చేగూర్చును. కావున, నీ వు ఈ తపస్సుచే నాకు అభీష్టమగు ఫలమును దేనినైననూ సంపాదించుము. నిశుంభశుంభులనే ఇద్దరు రాక్షసులకు నీ చేతిలో మరణము కలుగునట్లు నేను వరముల నిచ్చితిని. వారు గర్వించి దేవతలను బాధించు చున్నారు. ఈ విషయములో విలంబము వలన ప్రయోజనము లేదు. నీవు క్షణకాలము స్థిరముగా నుండుము. ఇప్పుడు విడువబడ బోయే శక్తి వారిద్దరిని సంహరించ గలదు. ఈ విధముగా బ్రహ్మ ప్రార్థించగా, పర్వతరాజపుత్రిక యగు ఆ దేవి వెంటనే శరీరముయొక్క పై చర్మమును విడిచి పెట్టి పచ్చని దేహవర్ణము గలది ఆయెను. తాను విడిచి పెట్టిన ఆ పై చర్మము నల్లని మేఘము వలె ప్రకాశించే కౌశికి అనే కన్యకరూపమును దాల్చెను. మాయ (పార్వతి) యొక్క స్వరూపమగు ఆ శక్తి విష్ణువుయొక్క యోగనిద్ర అయినది. ఆమె శంఖము, చక్రము , త్రిశూలము మొదలగు ఆయుధములతో కూడిన ఎనిమిది పెద్ద భుజములను కలిగి యుండెను. మూడు కన్నులు గలది, చంద్రవంకను శిరస్సుపై దాల్చినది, పురుషస్పర్శను మరియు రతిని యెరుంగనిది, గొప్ప సౌందర్యము గలది అగు ఆమెకు సౌమ్య (ప్రసన్నము), ఘోర(భయంకరము), మరియు మిశ్ర (రెండింటి కలయిక) అనే మూడు రూపములు గలవు. నిశుంభశుంభులనే రాక్షసశ్రేష్ఠులను సంహరించే అనాది యగు శక్తిని బ్రహ్మ ఆ దేవికి ఇచ్చెను. మరియు బ్రహ్మ చాల సంతోషించి మహాశక్తిస్వరూపిణి యగు ఆమెకు వాహనముగా నుండుట కొరకై అచటకు వచ్చియున్న గొప్ప బలము గల సింహమును ఇచ్చెను.

ఆయన ఆమెను మద్యము, మాంసములు, చేపలు, అప్పములు అను వాటితో పూజించి వింధ్య పర్వతముపై నివాసమును నిర్దేశించెను. ఈ విధముగా సన్మానించబడిన ఆ శక్తి తల్లియగు గౌరికి, జగత్తును సృష్టించే బ్రహ్మకు వరుసగా నమస్కరించెను.తననుండి పుట్టి తనతో సమానమైన అనేకులగు శక్తులతో ఆమె చుట్టువార బడినదై, ఆ రాక్షసవీరులను సంహరించుటకు సిద్ధపడి వింధ్య పర్వతమునకు వెళ్లెను. ఆమె అచట ఆ రాక్షసవీరులను యుద్ధములో సంహరించెను. మన్మథుని బాణములచే కొట్ట బడిన మనస్సులు గల ఆ రాక్షసుల దేహములను ఆమె తన బాణములతో కొట్టి సంహరించెను. ఆ యుద్ధము మరియొక చోట వర్ణించబడి యుండుటచే ఇచట వర్ణించ బడుట లేదు. మరియొక స్థానమునుండి ఆ వివరములను తెలియవలెను. నేను మీకు ప్రస్తుతవృత్తాంతమును వర్ణించెదను.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండములో పార్వతి గౌరి యగుటను వర్ణించే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment