Monday, January 26, 2026

 *శ్రీ శివ మహా పురాణం*
*405.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఇరువది నాలుగవ అధ్యాయం* 

*శివుడు పార్వతితో పరిహాసవచనమును పలుకుట* 

*ఋషులు ఇట్లు పలికిరి:* 

దేవితో మరియు అనుచరులతో గూడి అంతర్ధానమును జెందిన శివుడు ఎక్కడకు వెళ్లినాడు? ఎక్కడ నివసించినాడు? ఏయే కార్యములను చేసి విరమించినాడు? 

*వాయువు ఇట్లు పలికెను:* 

శోభాయుక్తమైనది, రంగు రంగుల గుహలు గలది, పర్వతములలో శ్రేష్ఠమైనది అగు మందరపర్వతము దేవదేవుడగు శివునకు తపస్సును చేసుకొనే నివాసస్థానముగా నుండెను. ఆ పర్వతము తన శిఖరముపై పార్వతీపరమేశ్వరులను దాల్చ గోరి గొప్ప తపస్సును చేసి చిరకాలము తరువాత వారి పద్మముల వంటి పాదముల స్పర్శ వలన కలిగే సుఖమును పొందెను. వేయు ముఖములు గలవారైననూ వంద కోటి సంవత్సరములు ప్రయత్నించిననూ ఆ పర్వతము యొక్క సౌందర్యమును వివరముగా చెప్పజాలరు. ఆ పర్వతసౌందర్యమును నేను వర్ణించగలను. కాని, నాకు వర్ణించే ఉత్సాహము లేదు. ఏలయనగా, ఈ పర్వతము కూడా ఇతర పర్వతముల వలెనే సామాన్యమగు సౌందర్యమును కలిగియుండుననే అభిప్రాయము కలుగువచ్చును. కాని ఆ పర్వత శోభను గురించి ఒక మాటను చెప్ప వచ్చును. ఒక విలక్షణమైన సౌభాగ్యము కారణముగా ఈ పర్వతమునందు ఈశ్వరుడు నివసించుటకు యోగ్యమగు సౌందర్యము గలదు. ఇందు వలననే శివుడు పార్వతికి ప్రీతిని కలిగించ గోరి మిక్కిలి సుందరమగు ఈ పర్వతమును తన అంతఃపురముగా చేసుకొనినాడు. స్వచ్ఛమగు శిలలతో మరియు వృక్షములతో కూడి ఆ పర్వతమునకు మేఖలలవలె నున్న సానువులు (కొండ చరియలు) పార్వతీపరమేశ్వరుల నిత్యనివాసముచే జగత్తునంతనూ తృణీకరించు చున్నవి. ముల్లోకములకు తల్లిదండ్రులగు పార్వతీపరమేశ్వరులు నిత్యము స్నానమును చేసి త్రాగుటకు ఉపయోగించుట వలన పొందబడిన పుణ్యసంస్కారము గలవి, ఇటునుండి అటునుండి ప్రవహించునవి, చల్లని తేలిక (పలచని) స్పర్శ గలవి, మిక్కిలి స్వచ్ఛమైనవి అగు కొండ కాలువల జలములచే ఈ పర్వతుడు పర్వతములకు చక్రవర్తి అనే పదవినందు అభిషేకించబడు చున్నాడు. రాత్రులయందు శిఖరములకు దగ్గరలో నుండే చంద్రుడు ఆ పర్వతముయొక్క పర్వతసామ్రాజ్యధిపతిత్వమునకు చిహ్నము అగు గొడుగు వలె నున్నాడు.

ఆడు చామరమృగముల పిల్లలు ఇటునటు పరుగులెత్తుచుండగా, పర్వతములన్నింటి సామ్రాజ్యమునందు అభిషిక్తుడైన ఆ పర్వతమునకు అవి వింజామరలను వీచుచున్నట్లుండెను. ఉదయము సూర్యుడు ఉదయించినప్పుడు రత్నములచే అలంకరింపబడి యున్న ఆ పర్వతము అద్దములో తన దేహముయొక్క సౌభాగ్యమును చూడ గోరుచున్నదా యన్నట్లు ఉండెను. పక్షికూతలే మంత్రపఠనములుగా కలిగినట్టియు, గాలికి పైకి యెత్తబడిన లతలే భుజములుగా కలిగినట్టియు, పరస్పరము చిక్కువడియున్న తీగలు అనే జటాజూటములను కలిగియున్న చెట్లు అనే తపశ్శాలురు ఎల్లవేళలా పుష్పములను జార్చుచూ వ్రేలాడే కొమ్మలకు సుకుమారమగు చిగుళ్లను కలిగియుండి జయాశీస్సులను పలుకుతూ ఆ పర్వతరాజును పూజించి సేవించుచున్నవా యన్నట్లుండెను. కొన్ని శిఖరములు పైకి, మరికొన్ని క్రిందకు, ఇంకొన్ని అడ్డముగా వ్యాపించి యుండ ఆ పర్వతము పాతాళములోనికి దుముకుచున్నదా యన్నట్లు,భూతలమునుండి పైకి లేచుచున్నదా యన్నట్లు, ఆకాశములో అంతటా అన్ని దిక్కుల యందు తిరుగాడుతూ జగత్తునంతనూ చూచుచున్నదా యన్నట్లు, ఎడతెరపి లేకుండగా నాట్యమాడుచున్నదా యన్నట్లు ఉండెను. శిథిలము కాని సౌందర్యము గల ఆ పర్వతము ప్రతిదినము విశాలమగు లోపలి భాగములు గల గుహలు అనే ముఖములతో నోటిని తెరచి ఆవలించు చున్నదా యన్నట్లు ఉండెను. ఆ పర్వతము జగత్తునంతనూ మ్రింగుచున్నదానివలె, సముద్రమును త్రాగుచున్న దానివలె, తన లోపలనున్న చీకటిని గ్రక్కుచున్న దాని వలె, ఆకాశమును మేఘములతో కప్పుచున్నదాని వలె నుండెను. ఆయా నివాసస్థానములు అద్దము వలె స్వచ్ఛముగా నుండెను. ఆశ్రమమునందు నీడనిచ్చే దట్టని చెట్లు ఎండను తిరస్కరించుచుండెను. నదులు, సరస్సులు, చెరువులు మొదలగు వాటితోడి సంపర్కము వలన చల్లనైన వాయువులు అక్కడక్కడ కూర్చుండిన పార్వతీపరమేశ్వరులచే సఫలము చేయబడినవి.

రైభ్యుని ఆశ్రమమునకు సమీపమునందున్న ముక్కంటి యగు శివుడు అట్టి ఈ సర్వోత్కృష్టమైన పర్వతమును గర్తుకు దెచ్చుకొని పార్వతితో గూడి అంతర్ధానమును చెంది అచటకు వెళ్లెను. మహేశ్వరుడు పార్వతీదేవితో గూడి అచట ఉండే ఉద్యానవనము వద్దకు వెళ్లి సుందరమగు అంతఃపురస్థానముల యందు రమించెను. ఆ విధముగా కాలము గడచుచుండగా సృష్టిలో ప్రజల సంఖ్య పెరిగెను. శుంభనిశుంభులు అనే సోదరులగు ఇద్దరు రాక్షసులు ఉదయించిరి. వారి తపోబలము వలన వారికి ఈ జగత్తులో సర్వపురుషుల చేతిలో మరణము లేకుండునట్లు పరమేష్ఠియగు బ్రహ్మ వరమునిచ్చెను. అయోనిజ, పార్వతీదేవి యొక్క అంశనుండి జన్మించినది, పురుషునితో స్పర్శ మరియు రతి లేనిది, ఉల్లంఘింప శక్యము కాని పరాక్రమము గలది అగు ఏ కన్య గలదో, ఆమె చేతిలో మాత్రమే కామముచే పరాజితులమై యున్న మేమిద్దరము యుద్ధములో వధింప బడెదము గాక! అని వారు ప్రార్థించగా, బ్రహ్మ అటులనే యగుగాక! అనెను. అప్పటి నుండియు వారు ఇంద్రుడు మొదలగు దేవతలను యుద్ధములో జయించి, జగత్తులో స్వాధ్యాయము గాని, యజ్ఞములు గాని లేని విధముగా అక్రమముగా చేసిరి. బ్రహ్మ వారి వధ కొరకై దేవదేవుడగు శివుని మరల ప్రార్థించెను. పార్వతిని నిందించి గాని, లేక ఏదో విధముగా రహస్యముగా కోపమును తెప్పించుము. ఆమె రూపమునుండి రంగునుండి పుట్టినది, కామము లేనిది, కన్య రూపములో నున్నది, శుంభనిశుంభులను సంహరించునది అగు శక్తిని దేవతలకు నీవు ఈయ దగుదువు. నీలలోహితుడగు శివభగవానుని బ్రహ్మ ఈ విధముగా ప్రార్థించగా, ఆయన ఏకాంతమునందు పార్వతిని నిందించు చున్న వానివలె చిరునవ్వుతో ' నీవు నల్లని దానవు' అనెను. అపుడు చక్కని దేహవర్ణము గల ఆ దేవి వర్ణమును గురించి శివుడు చేసిన వ్యాఖ్యకు కోపించి వెటకారముగా నవ్వి సమాధాన పరచుటకు వీలు లేని విధముగా కఠినమగు వాక్కుతో భర్తను ఉద్దేశించి ఇట్లు పలికెను.

*దేవి ఇట్లు పలికెను:* 

నా ఇట్టి ఈ రంగునందు మీకు ప్రీతి లేని పక్షములో, ఇంత దీర్ఘకాలము మీరు ఈ అరుచిని ఎట్లు దాచి పెట్ట గల్గితిరి?  ప్రేమ లేకున్ననూ మీరు నాతో ఎట్లు రమించితిరి? జగత్తులకు ప్రభువగు ఈశ్వరునకు ఈ జగత్తులో శక్యము కానిది ఏది లేదు. తన ఆత్మస్వరూపములోని ఆనందమునందు రమించే మీకు స్త్రీ సహవాసము సుఖమునకు సాధనము కాదు. ఈ కారణము చేతనే మీరు మన్మథుని బలాత్కారముగా బూడిదగా మార్చివేసితిరి. స్త్రీ సర్వావయవములయందు సుందరియే అయిననూ ఆ సౌందర్యము భర్తకు అభిమతము కానిచో, ఆమెకు సమస్తసద్గుణములు ఉన్ననూ, ఆమె జన్మ వ్యర్థమే. భర్త యొక్క ఆనందము మాత్రమే స్త్రీ యొక్క సృష్టికి ఏకైకప్రహయోజనము.స్థితి ఇట్లుండగా దానికి విరుద్ధముగా నుండే స్త్రీకి మరియొక్క ప్రయోజనమేమి గలదు ?  కావున, నేను నీచే ఏకాంతములో నిందించబడిన ఈ వర్ణమును విడిచి పెట్టి మరియొక్క రంగును పొందెదను. లేదా, స్వయముగా ప్రాణములను విడిచెదను. ఆ దేవి ఈ విధముగా పలికి శయనమునుండి లేచి తపస్సును చేయవలెననే నిశ్చయమునకు వచ్చి గద్గదమగు వచనముతో భర్తను అనుమతిని కోరెను. సకలప్రాణులకు ప్రభువగు ఆ శివుడు ఆ విధముగా తన ప్రేమకు భంగము కలుగునని భయపడిన వాడై స్వయముగా ఆ భవానియొక్క పాదములకు ప్రణమిల్లి ఇట్లు చెప్పెను.

*ఈశ్వరుడిట్లు పలికెను:* 

ఓ ప్రియురాలా! నేను పలికిన పలుకులోని పరిహాసమును తెలియ జాలక నాపై కోపించుచున్నావా? నాకు నీపై ప్రేమ లేనిచో, నాకు ఇతరము దేనిపై ప్రేమ ఉండగల్గును? నీవు ఈ జగత్తునకు తల్లివి. నేను ఈ జగత్తునకు ప్రభువు మాత్రమే గాక, తండ్రిని కూడా. నాకు నీపై ప్రేమ లేనిచో, ఈస్థితి ఎట్లు పొసగును?  మన మధ్య గల పరస్పరప్రేమకు ఈ మన్మథుడు కారణమా యేమి? కాదు. ఏలయనగా, మన్మథుడు పుట్టుటకు పూర్వమే జగత్తు పుట్టినది. స్త్రీ పురుషుల పరస్పరప్రేమ కొరకై నేను కాముడను వానిని కల్పించితిని. ఇట్టి స్థితిలో నేను కాముని దహించి వేసితినని నీవు నన్ను ఎట్లు నిందించితివి?  నన్ను ఒక సామాన్యదేవతగా భావించిన మన్మథుడు నన్ను కొద్దిగా అవమానించ బోగా, నేను వానిని భస్మము చేసితిని. మన యిద్దరి ఈ విహారము కూడా జగత్తును రక్షించుట కొరకు మాత్రమే ఉద్దేశించ బడినది. కావుననే, నేను ఆ ప్రయోజనము కొరకు మాత్రమే ఈ నాడు నీతో పరిహాస వాక్యమును పలికితిని. ఈ ప్రయోజనము నీకు తొందరలోననే స్పష్టము కాగలదు. తనకు కోపమును కలిగించిన శివుని మాటను మనస్సులో నుంచుకొని దేవి ఇట్లు పలికెను.

 *దేవి ఇట్లు పలికెను:* 

ఓ భగవాన్‌! నేను నీ పరిహాసోక్తులను ఇదివరలో విని యుంటిని. నేను అతిధీరురాలనే అయిననూ, నీవు అట్టి వచనములతో నన్ను పూర్వములో మోసగించి యుంటివి. మంగళ స్వరూపురాలగు ఏ కులస్త్రీ భర్త యొక్క ప్రీతిని పొందలేనిదైననూ ప్రాణములను విడువకుండునో, ఆమెను సత్పురుషులు దుష్టురాలనియే భావించెదరు. నా దేహము పచ్చగా లేదని నీకు నాపై అరుచి అధికముగా గలదు. అట్లు గానిచో, పరిహాసమునకైననూ నీవు నల్లనిది అనుట ఎట్లు సంభవమగును?  కావున, సత్పురుషులు ఏవగించుకొనే ఈ నల్లదనము నీకు నచ్చుబాటు కాదు. తపస్సుయొక్క ప్రభావముచే దానిని తొలగించు కొన కుండగా ఇక్కడ నిలిచి యుండుటలో నాకు ఉత్సాహము లేదు.

*శివుడు ఇట్లు పలికెను:* 

నీకు ఈ విధమగు మనోవేదన ఉన్నచో, తపస్సుతో పని యేమి? నా సంకల్పముచే గాని, లేదా నీ ఇచ్ఛచే గాని మరియొక వర్ణమును పొందుము.

 *దేవి ఇట్లు పలికెను:* 

నేను మరియొక దేహవర్ణమును నీనుండి పొంద గోరుట లేదు. స్వయముగా దేహవర్ణమును మార్చుకొనుట యైననూ నాకు సమ్మతము కాదు. నేను తపస్సును చేసి బ్రహ్మను ఆరాధించి శీఘ్రముగా పచ్చని రంగు గలదానను కాగలను.

 *ఈశ్వరుడు ఇట్లు పలికెను:* 

పూర్వము బ్రహ్మనా అనుగ్రహముచే బ్రహ్మ పదవిని పొందినాడు. ఓ మహాదేవీ!ఆతనిని పిలిపించెదము. నీవు తపస్సును చేయుట యేల? 

 *దేవి ఇట్లు పలికెను:* 

బ్రహ్మ మొదలగు దేవతలు అందరు నీనుండి పదవులను పొందిన వారే. అయినప్పటికీ, నీ అనుమతిని పొందు నేను పూర్వము తపస్సుచే బ్రహ్మను ఆరాధించి, సతి అను పేరుతో దక్షుని కుమార్తెనై జన్మించి, జగత్తులకు ప్రభువగు నిన్ను ఈ విధముగా భర్తగా పొందితిని. అదే విధముగా ఈ నాడు కూడ వేదవేత్తయగు బ్రహ్మను తపస్సుచే సంతోషపెట్టి, గౌరి (పచ్చని వర్ణము గలది) ని కావలెనని కోరుచున్నాను. దీనిలో దోషమేమియో చెప్పుడు. మహాదేవి ఇట్లు పలుకగా, ఆ వామదేవుడు చిరునవ్వు నవ్వుచున్న వాని వలె నుండి, దేవకార్యమును చేయగోరుటచే ఆమెను వద్దని నిర్బంధించ లేదు.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు శివుడు పార్వతిని పరిహాసము చేయుట అనే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment