మూడు ప్రశ్నలు .నీకు ఏ పని అంటే అత్యంత ఇష్టం? గమనించు. నీవు ఏ పనిలో అలసట లేని ప్రశాంతత పొందగలవు? ఆలోచించు.
ఏ పని ద్వారా నీవు ప్రపంచానికి ఉపయోగ పడగలవు? విచారించు.
ఈ మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం దొరికినప్పుడు, అదే నీ జీవన గమ్యం, అదే నీ జన్మకు కారణం. ఆ కార్యాన్ని నిర్వర్తించడానికే నీవు ఈ భూమి మీదకు వచ్చావు అని గుర్తుంచుకో.
కారణం లేకుండా ఏ విశ్వ కార్యం జరుగదు. ప్రతి జన్మకు ఒక కారణం ఉంటుంది . కొన్ని పువ్వులు గుడిలోకి చేరి దేవుడి హారంగా మారతాయి. భక్తుని యొక్క భక్తి అనే ఆధ్యాత్మిక శక్తికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. కొన్ని పువ్వులు వివాహ వేదికను అలరిస్తాయి. రెండు నిండు జీవితాలను కలపడానికి సహకరిస్తాయి. మరి కొన్ని పూలు శవ పేటికపై అలంకారంగా మారతాయి.ఆఖరి ప్రయాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తాయి. మరి కొన్ని పూలు వేశ్య గృహానికి వెళ్లే, విటుని మణి కట్టుకి చుట్టుకుంటాయి. నీచ ప్రవృత్తికి గుర్తులుగా నిలిచి పోతాయి.
అయితే ఒక సత్యం మాత్రం శాశ్వతం. ప్రతి పుష్పం యొక్క పరమ గమ్యం ప్రకృతిలో కలిసిపోవడమే. అది దేవుని పాదాలను అలంకరించినా, వివాహ వేదికను శోభాయమానం చేసినా, శవ పేటిక పై పేర్చబడినా, విటుని మణి కట్టుకు చుట్టబడినా, చివరకు చేరేది ప్రకృతి ఒడిలోకే.
మనిషి జీవితం కూడా అంతే. కొందరు ఆధ్యాత్మిక వినీలాకాశంలో ధ్రువతారలుగా వెలుగుతుంటారు. ఇంకొందరు సంసార సముద్రంలో పడి గజ ఇతగాళ్ళులాగా ఈదుతుంటారు.మరి కొందరు అవినీతి ఊబి గుంటలలో కూరుకుని పోయి వెలుపలకు రాలేక విలవిల లాడి పోతుంటారు. ఇంకా కొంత మంది ప్రాపంచిక సుఖాలకు బానిసలై ఆనందానికి అపార్ధాలను అంటగట్టి సంకెళ్లు లేని జీవిత ఖైదీలుగా తమకు తాను శిక్షించుకుంటూ ఉంటారు.
కానీ ఒక్క విషయం మాత్రం నిజం. “ప్రతి పుష్పం యొక్క అంతిమ గమ్యం, ప్రకృతి మాత ఒడిలోకే”, అన్న విధంగా, ప్రతి మనిషి యొక్క అంతిమ గమ్యం ఆనంతాత్మ లో విలీనం కావడానికే. మధ్యలో మజిలీలు వేరు కావచ్చు. కానీ చివరకు అందరం చేరేది ఆ ఆనంద సాగరం లోకే.
ఇప్పుడు మరి యొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు? అని. ఈ జన్మ లోనా? మరో జన్మలోనా? వంద జన్మల తరువాతనా?
ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆ ప్రయాణం కాలంతో కొలవబడేది కాదు; చైతన్య పరిణామంతో కొలవబడేది. ఆత్మకు జన్మల సంఖ్య ముఖ్యమైంది కాదు, జ్ఞాన పరిపక్వత ముఖ్యమైంది.
ఒక విద్యార్థి పాఠాన్ని త్వరగా అర్థం చేసుకుంటే ఒకే సంవత్సరంలో ఉత్తీర్ణుడవుతాడు. మరొక విద్యార్థికి అదే పాఠం నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాగే కొందరు జీవులు ఒకే జన్మలో ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. మరికొందరు అనేక జన్మల అనుభవాల ద్వారా క్రమంగా పరిపక్వతను సాధిస్తారు.
అయితే నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు “ఎప్పుడు చేరుతాను?” అని అడగడు. “ఈ క్షణంలో నేను ఎంత ఆనందంగా ఉన్నాను?” అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఎందుకంటె ఆనందమే మన అందరి గమ్యం. విముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో లభించే బహుమతి కాదు; ప్రతి క్షణంలో అనుభవించే అనుభూతి.
సముద్రాన్ని చేరే నది, సముద్రం ఇంకా ఎంత దూరంలో ఉందని ఆలోచించదు. తన ప్రవాహాన్ని ఆపకుండా కొనసాగిస్తుంది. అలాగే సాధకుని కర్తవ్యం గమ్యాన్ని గురించి ఆందోళన చెందడం కాదు; ప్రయాణాన్ని సార్థకం చేసుకోవడం.
సత్ చిత్ అనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఎప్పుడూ ఆనందంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే నీవు చేసే పనిలోనే నీవు ఆనందాన్ని అనుభవించాలి. నీవు చేసే పనిలోనే నీవు ఆనందాన్ని అనుభవించాలంటే నీకిష్టమయిన పని ఏదో గుర్తించాలి. నీకిష్టమయిన పనిని గుర్తించి, ఆ పని చేస్తూ ఆనందాన్ని అనుభవించి, ఆ ఆనందాన్ని పది మందికి పంచినప్పుడే సత్ చిత్ ఆనంద అనుభూతి పొందటం జరుగుతుంది. జీవన గమ్యం నేరవేరుతుంది.
అందుకనే మూడు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి
నాకు ఏ పని అంటే ఇష్టం?
నేను ఏ పనిలో అలసట లేని ప్రశాంతత పొందుతాను?
ఏ పని ద్వారా నేను సమాజానికి ఉపయోగ పడగలను?
ఈ మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం నీకు వచ్చినపుడు
నీవు నీజన్మ కారణాన్ని కనుగొన్నట్లే. ఆ పనిని నీవు నిస్వార్ధంతో నిర్వర్తించినపుడు, నీవు అనుభవించే స్థితే నిర్వాణం.
ఆచార్య డా అనిల్ ప్రసాద్.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment