Sunday, June 21, 2026

 బ్రతుకు – బ్రతకనివ్వు 

“అహింసా పరమో ధర్మః” — ఈ వాక్యం కేవలం ఒక నీతి సూక్తి కాదు; సనాతన భారతీయ ఆధ్యాత్మికతకు మూలాధారం. భారత దేశ ఆవిర్భావానికై గాంధీజీ చేపట్టిన నినాదం. వసుదైక కుటుంబంలోని సమస్త జీవుల శ్రేయస్సును కాపాడే జీవన విధానం.

ఇద్దరి మధ్య ప్రేమ భావం ఏర్పడాలంటే వారిద్దరిలోనూ ఉన్న ఒకే స్వభావం, ఒకే చైతన్యం, ఒకే జీవసారం వ్యక్తమవ్వాలి. తల్లి తన బిడ్డను అపారంగా ప్రేమించడానికి కారణం, బిడ్డలో తన స్వరూపాన్ని, తన అంశాన్ని దర్శించుకోవడమే. అలాగే ఒక జాతికి చెందిన జీవి అదే జాతికి చెందిన మరొక జీవిని సహజంగా హింసించకపోవడానికి కారణం, ఎదుటి జీవిలో తన ప్రతిబింబాన్ని చూసుకోవడమే.

అందుకే పంచభూతాలతో నిర్మితమైన భూమి, పంచభూతాలతో నిర్మితమైన ప్రతి జీవిని, ప్రతి వస్తువును తనవైపు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ కేవలం భౌతిక శక్తి మాత్రమే కాదు; అది సృష్టిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న ఏకత్వ భావానికి ప్రతీక. ఒకటి మరొకదానితో అనుసంధానమై ఉండే ఈ సహజ సంబంధమే ప్రేమ.

పరిణామ ప్రక్రియ అమీబా లాంటి ఏక కణ జీవితో మొదలై ఆ  తరువాత అనేక జీవుల దశలను దాటి చివరకు అత్యున్నతమయిన బుద్ధి కుశలత విచక్షణా జ్ఞానం కలిగిన మానవుడిగా మార్చింది. ఆంటే సకల జీవ జాతుల అంశలు మానవునిలో ఉన్నాయి అన్న మాట. విశ్వంలో ఇక ఏ జీవికి లేనంత విచక్షణా జ్ఞానం ఉండి కూడా, తనలో ఉన్న సకల జీవుల అంశలను విస్మరించి, ప్రేమను మరచి హింస పేరుతొ ఇతర జంతువులను ఆహారం కోసం హింసించడం, విచక్షణ జ్ఞానాన్ని విపరీత జ్ఞానంగా మార్చుకొని హింసను ప్రేరేపించే మాంసా హారిగా మారడం కడు శోచనీయం. 

ఈ విశ్వంలో జన్మించిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అలానే ప్రతిజీవికి ప్రక్క జీవిని ప్రేమించే బాధ్యత కూడా ఉంది.  జీవించడం మనిషి హక్కు మాత్రమే కాదు; ప్రతి జీవి హక్కు కూడా. జీవితం అనేది ప్రకృతి ప్రసాదించిన పవిత్ర వరం. ఆ వరాన్ని హరించే హక్కు ఏ జీవికీ లేదు.

మాంసాహారం గురించి చర్చ కేవలం ఆహారపు అలవాట్ల గురించి కాదు. అది మన హృదయ స్థితి గురించి. ఒక జీవి భయాన్ని, బాధను, వేదనను మనం అర్థం చేసుకోగలమా అన్న ఆలోచన గురించి.. కరుణ లేని హృదయం ఆధ్యాత్మికతను పొందలేదు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే దైవాన్ని దేవాలయంలో వెతకడం కాదు; ప్రతి జీవిలో దైవాన్ని దర్శించడం. అందుకే “నేను మాంసాహారం తింటాను, మంచి ఆధ్యాత్మిక వేత్తగా ఉంటాను” ఆంటే కుదరదు. ఆలా జీవిస్తే మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవించడమే.

అహింస అనేది బలహీనత కాదు. అది అత్యున్నత బలం. హింసకు కోపం చాలు; అహింసకు జ్ఞానం కావాలి. హింసకు స్వార్థం చాలు; అహింసకు ప్రేమ కావాలి. హింసకు అహంకారం చాలు; అహింసకు ఆత్మజ్ఞానం కావాలి.

శాఖాహారం కేవలం ఆహార విధానం కాదు; అది అహింసకు ఆచరణ రూపం. అది కరుణకు ప్రతిరూపం. అది జీవదయకు సంకేతం. శాఖాహార జీవనం ద్వారా మనిషి తన హృదయాన్ని మరింత సున్నితంగా, మరింత విశాలంగా మార్చుకోగలడు.

మనిషి ఒక చీమకు ప్రాణం పోయలేడు. ఒక విత్తనాన్ని తన చేతులలో మొలకెత్తించ లేడు. ఒక గడ్డి పరకలో దాగి ఉన్న జీవశక్తిని తయారు చేయలేడు. అటువంటప్పుడు సృష్టించలేని ప్రాణాన్ని తీసివేసే హక్కు తనకు ఎలా ఉంటుందని ప్రశ్నించుకోవాలి.

ప్రకృతి మన కోసం ఎన్నో వరాలు ప్రసాదించింది. పండ్లు, ధాన్యాలు, కాయగూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు — ఇవన్నీ జీవాన్ని పోషించే ఆహారాలు. చెట్లు తమ ఫలాలను మనకు సమర్పిస్తాయి; పొలాలు ధాన్యాన్ని పండిస్తాయి; ఈ విధంగా ప్రకృతి నిస్వార్థంగా మనకు అవసరమైన ప్రతిదీ అందిస్తూనే ఉంది. అలాంటి పరిస్థితి మధ్య మరో జీవి ప్రాణాన్ని తీసి ఆహారం పొందాల్సిన అవసరం ఏమిటి?

ప్రపంచంలో శాంతి కోసం మనం ప్రార్థిస్తాం. కానీ శాంతి బయట నుంచి రాదు. అది మన హృదయంలోని కరుణ నుంచి పుడుతుంది. కరుణ అహింస నుంచి పుడుతుంది. అహింస జీవదయ నుంచి పుడుతుంది.

అందుకే “బ్రతుకు – బ్రతకనివ్వు” అనేది కేవలం ఒక నినాదం కాదు; అది ఒక ఆధ్యాత్మిక విప్లవం. మనం జీవిద్దాం. ఇతర జీవులను కూడా జీవించనిద్దాం. మన ఆకలి కోసం కాదు, మన ఆత్మ వికాసం కోసం జీవిద్దాం. ప్రతి జీవిలో పరమాత్మను దర్శిద్దాం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment