Saturday, December 12, 2020

మనిషి ఎలా బతకాలంటే?

🥀 మనిషి ఎలా బతకాలంటే..🥀

✍️ మురళీ మోహన్

🧘‍♂️ తృష్ణాం ఛిన్ది భజక్షమాం జహిమదం పాపేరతిం మా కృథాః
సత్యం బ్రూ మ్యనుయాహి సాధుపదవీం నేవస్య విద్వజ్జనమ్‌
మాన్యాన్మానయా విద్విషో ప్యనునయం
ప్రఖ్యాపయ ప్రశ్రయం

కీర్తిం పాలయ దుఃఖితే కురుదయా, మేతత్సతాం చేష్టితమ్‌

ఆశ లేకుండటం, ఓర్పు కలిగి ఉండడం, గర్వం లేకుండడం, పాపాలను కలిగించే పనులు చేయకుండడం, నిజమే చెప్పడం, పండితులకు, ఆర్యులకు ప్రీతిని కలిగించే విధంగా ప్రవర్తించడం, సజ్జనులకు సేవలు చేయడం, నిర్మలమైన మనసుతో ఉండడం, శత్రువులను సైతం హితవచనాలతో ఓదార్చడం, పూజ్యులందు ప్రేమ, విధేయతలు కలిగి ఉండడం, దీనుల యెడ దయ కలిగి ఉండడం అందరూ ఆచరించదగ్గ మంచి పనులని దీని అర్థం. శాస్త్రమర్యాదననుసరించి ధర్మమార్గంలో ఆశను అదుపులో పెట్టాలి.

అలా చేస్తే అశాంతి అంతరిస్తుంది. జీవితం సుఖమయమౌతుంది. వ్యక్తికి తెలియకుండానే స్వార్థభావం తగ్గిపోయి సమానత్వం హృదయంలో స్థాపితమౌతుంది. అలాగే, మనిషికి ఓర్పు చాలా ముఖ్యం. అది అన్ని సద్గుణాలకూ ఆలవాలం. ఓర్పుతో తొందరపాటు తొలిగిపోతుంది. వ్యక్తికి నిత్యం తాను చేసే కార్యకలాపాలలో మంచిచెడ్డలను గమనించే తార్కిక శక్తి కల్గుతుంది. దీనివల్ల మంచిని మాత్రమే పాటిస్తాడు. మూర్ఖులు వివేకవంతులను కారణం లేకుండా అశాంతికి లోను చేయడానికి ప్రయత్నించినప్పుడు ఓర్పు అనే వజ్రాయుధంతో వాని చెడు తలంపును ఖండిస్తాడు. ఇక, గర్వం.. మంచి వ్యక్తిత్వాన్ని దరిజేరనీయకుండా చేస్తుంది. ప్రగతి మార్గాన్ని నిరోధింపజేస్తుంది. మానవుడు జీవితాంతం నేర్చుకునే పద్ధతిలో ఉండాలి. కానీ, గర్వం తనకంతా తెలుసుననే దురుద్దేశాన్ని కలిగేలా చేస్తుంది. పురోగతికి అడ్డుపడుతుంది.

పాపకార్యాల దుష్ఫలితం యమపాశమై బాధిస్తుంది. పాపకార్యాలు అనేకవిధాలు. త్రికరణాలని చెప్పబడే మనసును, మాటను, కాయాన్ని పాపకార్యాల జోలికి పోనివ్వకూడదు. మనోవాక్కాయ కర్మలు పవిత్రమైన పద్ధతిలో పయనిస్తే మనిషి మాన్యత పెరుగుతుంది. అందుకోసం మనసు ఇంద్రియాలను సన్మార్గంలో నడిపించాలి. వాక్కు (మాట) మంచిగా ఉండాలి. మంచిమాట ద్వారా మణులు కురిపించాలి. చెడ్డగా మాట్లాడి చేటు తెచ్చుకోకూడదు. మాటతో మంచికి కోటకట్టాలి. ఇక.. కలియుగంలో సత్యం తపస్సుతో సమానమని రామకృష్ణ పరమహంస బోధించారు. ఎంతోమంది మహనీయులు సత్యదీక్షలో నెగ్గి ఆదర్శవంతులయ్యారు. అలాగే, జీవితంలో ఎదగాలంటే పండితుల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి. తత్ఫలితంగా సదాలోచన, సత్వగుణ సంపన్నత, సత్కార్యాచరణ కల్గుతాయి. సజ్జనసాంగత్యం సర్వదోష నివారిణి. ఇక, దయాగుణం ధర్మమార్గాల్లో ఉత్తమమైంది. దీనులను అన్నివిధాలా ఆదుకోవడం మానవుల మాన్యతకు నిదర్శనం. అన్నదానం, ధనదానం, విద్యాదానం, వస్త్రదానం, శ్రమదానం విరివిగా చేయాలి. వీటిని అందరూ పాటిస్తే మానవత్వం పరిమళిస్తుంది. 🤘

Source - Whatsapp Message

No comments:

Post a Comment