Saturday, February 6, 2021

అంత కోపమున్నవాడివా?

సచ్చిదానంద శివాభినందనృసింహ భారతి అని శృంగేరి పీఠాధిపతులు అరణ్యం గుండా వెళుతున్నారు. చీకటి పడితే ఆ అరణ్యంలోనే ఒకచోట గుడారాలు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ వచ్చాడు అక్కడికి. వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. పీఠాధిపతి త్రికాలవేది. మనిషిని చూడగానే అతనిలో ఉన్నది అంతా చెప్పేస్తారు. అతన్ని చూడగానే ఒక మాటన్నారు. ‘‘నేను మూడు లక్షణాలు చెబుతాను. ఇందులో నీవే స్థాయిలో ఉన్నావో నీవు చెప్పు.’’ ‘‘అడగండి’’ అన్నాడతను. ‘‘అసలు నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వాడిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయే అంత కోపమున్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తరువాత వివరణ చేసి విరుచుకుపడే కోపమున్నవాడివా? అసలు విచారం అన్నదే లేకుండా కోప్పడిపోయి వెళ్లిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా?’’ అని అడిగారు. అది ఎందుకడిగారో అడిగినాయనకు తెలుసు, విన్నాయనకు తెలుసు. ఆయనన్నారు నేను మొదటి కోవకి చెందినవాణ్ణి. నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను. ఆయనన్నారు. ‘‘నీవు నా దర్శనానికి వచ్చావు కదా! నేను నీకిచ్చే కానుక ఒకటే నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు. ‘‘ఎందుకిలా చేశావ్’’ అని అడుగు. నీ జీవితంలో నీవెన్ని తప్పులు చేశావో తెలుస్తుంది.’’ అతను ఇంటికి వెళ్లిపోయాడు. వెళ్లిపోయేసరికి బాగా చీకటి పడింది. వంటవాడిని ‘‘బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు’’ అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే గోధుమ రొట్టెలు తీసుకువచ్చి వణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు. ఈయనకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఓ ఏడెనిమిది రొట్టెలు తింటాడు. ఓ రెండు కూరల్తోటి. రెండు పలుచని రొట్టెలు. అంటే నేను రాననుకొని వీడు తినేశాడు అనుకుని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది. ఇవాళ రెండో స్థాయికి మారి చూద్దామని, ‘‘ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్?’’ అని అడిగాడు. అతనన్నాడు. ‘‘మీ అటెండర్‌ని పంపించి కదా! సరుకు తెప్పించుకుంటాం. అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నాకోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో, రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి’’ అన్నాడు. నిజంగా ఆ రేంజర్ వలవలా ఏడ్చేశాడు. నేను ఇలా తొందరపడి కొట్టేసి ఉంటే..? ఇలా ఎందరిని నా కోపం చేత కొట్టానో. నేను ఇలా అడిగితే వీడు నా కోసం పడ్డ కష్టం తెలిసిందే. ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు ఈ మూడు తరగతులలో దేనికి చెందినవాడవని ప్రశ్నించి ఒకటి నుంచి రెండవ స్థితికి మారమని చెప్పి వెళ్లిపోయాడు. నేను రెండోస్థాయికి వస్తే నా దోషాలు కనపడ్డాయి. నేను ఎంతమందిని కొట్టానో అని ఏడ్చి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

Source - Whatsapp Message

No comments:

Post a Comment