Wednesday, February 24, 2021

ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.

సహజంగా మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే చిక్కులు పడిన తాడులా ఉంటుంది. అర్థం కాని సమస్యలా ప్రతీసారి మన ముందుకు వచ్చి నిలబడుతుంది.

ఎందుకిలా జరుగుతుంది? మనసుతో ఈ ఇబ్బంది ఏమిటి? చాలా సార్లు, చాలా మందికి అనిపిస్తుంది. మనసుతో ఇలాంటి గొడవ ఏదో ఒక రోజు రావాలి. అదే నాంది- మనసును శోధించడానికి. మనసును సాధించడానికి. దాని సంగతి తేల్చుకోవడానికి.

మనిషికి చాలా సంతోషకరమైన, మేధాపరమైన ఆట ఏది అంటే, మనసుతో నిత్యం ఆడేదేే! మనసుతో ఆడాలి. మనసును పరుగెత్తించాలి. మనల్ని మనసు పరుగెత్తిస్తుంటే ఆపాలి. మనసుకు ఎదురుతిరగాలి అంటారు స్వామి వివేకానంద.

మనసు భయపెడుతుంది. బాధ పెడుతుంది. విసిగిస్తుంది. చివరకు కాళ్లబేరానికి వచ్చి బుజ్జగించి, లాలిస్తుంది. రాయిలా మనం కదలక మెదలక ఉంటే, చివరకు దండం పెడుతుంది- రమణ మహర్షికి వశమైన మనసులా.

మనసు లేని మనిషి గడ్డకట్టిన సరస్సులాగా ఉంటాడు. శీతోష్ణ, సుఖ, దుఃఖాలను సమంగా చూస్తాడు.

ఇలాంటి ప్రశాంతమైన మనసు కలిగిన మనిషే శక్తికి పుట్టినిల్లు అవుతాడు. శక్తి కావాలంటే నిరంతరం ఆలోచనలతో సతమతమయ్యే మనసును భారంగా మొయ్యడం కాదు. ఆలోచనలను నియంత్రించుకుని, సృజనాత్మక భావాల మీద ఏకాగ్రత నిలిపితే అసలైన శక్తి పుడుతుంది.

ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.

ప్రశాంతమైన మనసే అద్భుతాలు సృష్టించగలదు. ఆలోచనలు తగ్గుతున్న కొలదీ సృజనాత్మకత పెరుగుతుంది. వందలు, వేల కొద్దీ క్రమం లేని ఆలోచనలు మనసులోని శక్తిని తగ్గించేస్తాయి. ఒక మంచి, గొప్ప ఆలోచన దివ్య మార్గంలో నడిపిస్తుంది.

హృదయం మనసుకు అనుసంధానమైనప్పుడు పుట్టే ప్రతి ఆలోచనా గొప్పది అవుతుంది. హృదయం కలగజేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్రమబద్ధమైన, శక్తిమంతమైన ఉపయోగకరమైన ఆలోచనలు చెయ్యాలి.

ఆలోచనలకు ముందు ధ్యానం చెయ్యాలి. ఆలోచించిన తరవాత ధ్యానం చెయ్యాలి. మరిన్ని మంచి ఆలోచనల కోసం ఆలోచనల తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆలోచనలకు స్థావరమైన మనసును ముఖాముఖీ ఎదుర్కోవాలి. అవసరమైతే పక్కకు తప్పుకొని మనసుకు సాక్షిగా నిలబడి ఉండాలి. ఇదంతా సాధన వల్లనే సాధ్యపడుతుంది.

మనసుతో వ్యాయామం చెయ్యని మనిషి సాధనలో పరిణతి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్లని మనిషి ఆధ్యాత్మిక రహస్యాలు అందిపుచ్చుకోలేడు.

మనసు మనకు మంచి మిత్రుడు. దారుణమైన శత్రువు కూడా. ఉపయోగించుకోవడంలో అంతా ఉంది.

మనసు గాలిలో దీపంలా ఉంది. దీన్నెలా వశం చేసుకోవాలని దీనంగా ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు పరమాత్మ చెప్పాడు-

‘నిస్సందేహంగా మనసు చంచలమైనది. దాన్ని వశపరచుకోవడం చాలా కష్టం. అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని నియంత్రించడం సాధ్యమే. మనసు వశం చేసుకున్న ప్రయత్నపరుడైన మనిషికి సాధనద్వారా సహజంగా యోగ సిద్ధి పొందడం సాధ్యమే
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment