Wednesday, February 17, 2021

నేటి చిట్టికథ... ప్రశ్న విలువ

✍️...నేటి చిట్టికథ

ప్రశ్న విలువ


- ఆచార్య రాణి సదాశివ మూర్తి


పూర్వం రైవతక పర్వత ప్రాంతంలో మహాసాత్వతమనే నగరంలో విద్యాపతి అనే పండితుడు ఉండేవాడు.

అతనికి తెలియని విద్య లేదని అందరి నమ్మకం.

అతని కుమారుడు కుతూహలుడు. పేరుకు తగినట్లు ఆ పిల్లవాడికి అన్నీ సందేహాలే.

కనబడినవారినందరినీ.. ‘అదేమిటి? ఇదేమిటి?’ అని అడుగుతూ ఉండేవాడు.

అతని స్వభావం అందరికీ నచ్చేది. తండ్రికీ ముద్దుగా ఉండేది. కానీ కాలం గడిచేకొద్దీ అతని ప్రశ్నలను తట్టుకోగలిగిన స్థితి ఎవరికీ లేకపోయింది. కుతూహలుణ్ణి చూసి అందరూ దూరం నుంచే తప్పుకోవడం మొదలు పెట్టారు. గురుకులంలో చేరిన కొద్దిరోజులకే ఆ బాలుడి ప్రశ్నల ధాటికి గురువులు ఆశ్చర్యపోయారు.

అతనిలో ఎంత వెతికినా ఏ లోపం లేదు.. ఒక్క ప్రశ్నలడగడం తప్ప.

దీంతో వారు ఈ విషయాన్ని ఆశ్రమ కులపతి యుక్తినాథ మహర్షికి నివేదించారు.

మహర్షి కుతూహలుణ్ని తన పర్ణశాలకు పిలిచి ఇలా చెప్పాడు. ‘నాయనా! నీవడిగే ప్రశ్నలకు అన్నింటికీ సమాధానాలు వస్తున్నాయా?’ అని అడిగాడు. ‘లేదు గురువర్యా’ అని అతడు నిరుత్సాహంగా చెప్పాడు.

‘సరే మన ఆశ్రమానికి తూర్పు దిక్కున ఒక గుహ లో ఒక మందిరం ఉన్నది. ఆ మందిరంలో సరస్వతీ దేవి ఉన్నది. ఆమెను చప్పట్లు కొట్టి ప్రశ్నించు. నీకు సమాధానం వస్తుంది’ అని చెప్పాడు గురువు. బాలుడు సరేనని అక్కడికి వెళ్లాడు.

ఆలయంలోకి వెళ్లాక గట్టిగా చప్పట్లు కొట్టాడు. అటు నుంచి కూడా ఎవరో చప్పట్లు కొట్టారు. ‘ఎవరు చప్పట్లు కొట్టారు?’ అని అడిగాడు. అటు నుంచి కూడా అదే ప్రశ్న వినిపించింది.

‘నాపేరు కుతూహలుడు. నేనే చప్పట్లు కొట్టాను’ అన్నాడు.

అటు నుంచి కూడా అదే సమాధానం వచ్చింది.

‘ఓహో నాలాగే మరొక కుతూహలుడున్నాడు’ అనుకున్నాడతడు. తరువాత ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అటు నుంచి కూడా అవే ప్రశ్నలు. జీవితంలో మొదటిసారి ప్రశ్నలడగడం ఆపి సమాధానాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆలోచించి సమాధానమివ్వడం ప్రారంభించాడు. అటు నుంచి కూడా అవే సమాధానాలు.

కాసేపటికి ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చి మహర్షికి జరిగిందంతా వివరించాడు.

ఇలా నెల రోజులు గడిచాయి. ఈ నెల రోజులలో ఆ కనబడని కుతూహలుడు అడిగే ప్రశ్నలకు సమాధానాలను చెప్పేందుకు.. తాను ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి కష్టపడ్డాడా బాలుడు.

ఆ తరువాత మహర్షి కుతూహలుణ్ని మందిరానికి వెళ్లమని చెప్పడం తగ్గించాడు. ఆ బాలుడూ ఆశ్రమంలో పనులకు అలవాటు పడ్డాడు. గురువుల దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు.

అతడికి ప్రశ్న విలువ తెలిసింది. ఇతరులను ప్రశ్నలడిగే ముందు తానుగా సమాధానాలను అన్వేషించాలని అర్థమైంది.

లక్ష్య శుద్ధి ఏర్పడింది. తాను చిన్నతనంలో వెళ్లిన మందిరం కొండగుహలో ఉందని, తాను మాట్లాడిన మాటలే ప్రతిధ్వనించి ఎవరో మాట్లాడినట్టు తోచాయన్న విషయం తెలిసింది.

యుక్తవయస్సు వచ్చేసరికి ఎన్నో విద్యలలో పండితుడయ్యాడు. ప్రయోజకుడయ్యాడు


. ఇలా మనం కూడా ప్రశ్న విలువ తెలిసి మరీ ప్రశ్నిస్తే నిత్యజీవితంలోనూ, ఆధ్యాత్మికంగానూ విజయాన్ని సాధించగలుగుతాం.

🍁🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment