Tuesday, May 24, 2022

వేసంకాలం శలవలు

వేసంకాలం శలవలు
💐💐💐💐💐💐💐

వేసంకాలం శలవలు ("సమ్మర్ వెకేషన్" అనడం రాదు మాకు...
"తెలుగు మీడియం") వస్తున్నాయంటే రెణ్ణెల్ల ముందు నుంచే పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసుకునే వాళ్ళం.

దిక్కుమాలిన "సంవత్సరీక" పరీక్షలు అయిపోగానే, మూణ్ణెల్ల పాటు ఆ పుస్తకాలని తియ్యఖ్ఖర్లేదు.

ఎక్కడ పడేశామో కూడా గుర్తుంటే ఒట్టు ! బీద విద్యార్ధులకి "విద్యాదానం' ఎక్కౌంటు కింద ఇచ్చేసే వాళ్ళం. పరీక్ష ఫలితాల గురించి మనకెందుకు?
అది మేష్టర్ల తలనెప్పి కదా?

💐💐

ఈలోగా నోట్సులన్నీ పాత కాగితాల వాళ్ళకి అమ్మేసి, ఆ డబ్బుల్ని పుల్ల ఐస్ ల బడ్జెట్ కి కేటాయించే వాళ్ళం.

ఎండలు మండుననీ, బయట ఎండలో ఆడితే వీపులు సామూహికంగా పగులుననీ కాల జ్ఞానం ఉన్న వాళ్ళం కాబట్టి, ముందు చూపుతో ఇండోర్ ఆటలు తయారు చేసుకునే వాళ్ళం.

'ఇండోర్" అంటే... మధ్య ప్రదేశ్ వెడతామని కాదు, నీడబట్టున కూచుని, చొక్కాలు విప్పేసి, పాత నిక్కర్లు వేసుకుని, చల్లటి, నున్నటి సిమెంటు గచ్చు మీద పుచ్చకాయ మాదిరి దొల్లుతూ, ఆడుకునే మనోరంజకమైన, ప్రతిభాపాటవ ప్రదర్శనానుకూలమైన, గ్రామీణ క్రీడలన్నమాట!

అందులో ముఖ్యమైనవి, అష్టా - చెమ్మా, చింత గింజలు, పులి - మేక, వైకుంఠపాళి, చదరంగం, కేరమ్స్ లాంటివి.

అసలు ఆట కంటే, అరుపులు, కేకలు, జోకులు, మిమిక్రీలు, ఆడపడుచుల్ని ఆట పట్టించడాలు, ప్రముఖంగా చెప్పుకోవాలి.

(మన ఆడపడుచులు పెద్దయ్యాక, చిన్నప్పుడు తమని ఏడిపించిన, ఆట పట్టించిన అపూర్వ సహోదరుల చిలిపి పనులు, మాటలు, గుర్తు తెచ్చుకుని, "ఆ రోజులు మళ్ళీ రావు కదా?"
అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని, ఫేస్ బుక్కుల్లో రాసుకుంటారట!)
అందుకే, అలా ఏడిపిస్తామన్న మాట !

అన్నట్టు, సందర్భవశాత్తు, ఇంకో మాట చెప్పుకోవాలి.....
ప్రతి దీపావళికి మా ఆడపడుచుల కోటాలోంచి ఎన్నో మతాబులు, కాకర పువ్వొత్తులు వాళ్ళకి తెలియకుండా కొట్టేసినప్పుడు వచ్చిన ఆనందం 'ఇంత' అని చెప్పలేము !

తర్వాత, మేము పెద్దయ్యాక, మేనల్లుళ్ళకి, మేనకోడళ్ళకి వడ్డీతో సహా టపాసులు కొని ఇచ్చేశామనుకోండి !

పరీక్షలయిపోయాక, వేసంకాలం శలవలు మొదలవుతుంటే, ఇంటి చుట్టూ పరుగెడుతూ, ఈలలతో గోల చెయ్యక పోతే తోచేది కాదు.

అదే రోజు సినిమాకి వెళ్ళకపోతే,
పెద్దయ్యాక మీసాలు రావని, మా రెండో అన్నయ్య పెద్ద సెంటిమెంటుతో కొట్టాడు.

ఏంచేస్తాం ? మీసాల కోసం సినిమా హాలులో నేల టిక్కెట్టులో కూచుని, తెర మీద ఆడుతున్నది సావిత్రో, సూర్యకాంతమో తెలిసేలోపు, "ఔటు బెల్లు" కొట్టేవారు. పరుగెత్తుకెళ్ళి, మసాలా వడ, చిన్న చేగోడీలు కొనుక్కుని, ఆ నూని అంతా చొక్కా జేబుకి పాముకుని, కసితీరా, ఛడామడా తింటూ, మిగిలిన సినిమా చూసి, కొంపకి చేరే సరికి, కళ్ళు అరంగుళం ముందుకి పొడుచుకుని వచ్చినట్టు, మా డ్రిల్లు మేష్టారు గంట సేపు ఎండలో నిలబెట్టి, బస్కీలు తీయించినట్టు, అనిపించినా.... పావలాకి మూడు గంటల సినిమా చూసినందుకు వచ్చిన తృప్తి మిగిలేది.

సినిమాలో అసలు కధ అర్ధం కాకపోయినా, వచ్చిన తలనెప్పికి మాత్రం అమృతాంజనం అరగంట
మద్దనా చెయ్యడం మా తోబుట్టువుల తక్షణ కర్తవ్యం.

తలంతా చుట్ట కంపు కొడుతుంటే, మర్నాడు తలంటడం అమ్మ కనీస కర్తవ్యం.

చూసిన సినిమా "హేంగోవరు" రెండ్రోజులుండేది.
కాస్త తేరుకోగానే, వేసవి తిళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోడం ఒక సామూహిక, స్వయంసేవా కార్యక్రమం. అనగా..... తరవాణికి దబ్బాకులు, గంజి లాంటివి రెడీ చేసుకోడం అన్నమాట !

సరే, కొత్తావకాయలు గట్రా 'బెద్దవాళ్ళు' ఎలాగూ పెడతారుగా!

మన కర్తవ్యం అల్లా.... ఆ కొత్త కొత్త, రంగురంగుల, రకరకాల ఊరగాయలకి, అనగా...ఆవకాయ, మాగాయ, పులిహారావకాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి, నూని మాగాయ, పచ్చ ఆవకాయ,
బెల్లపావకాయ్, ఇంకా పేర్లు తెలియని వాటి కజిన్స్ అన్నిటికీ 'సమన్యాయం' చెయ్యడమే !

మన శ్రేష్టమైన చద్దన్నం లో ఏది కలిపినా .... దేని రుచి దానిదే....

వాటిని క్రమ బద్ధంగా తినడానికి మా పెద్దక్క ఒక టైం టేబుల్ పెట్టేది. ఒక్కో పూట ఒక్కోటి తినాలన్నమాట !

💐💐

ఇంకో ముఖ్యమైన ఎజెండా ఉండేది. మా పాలేరు సూరి గాడు తువ్వాలుని కాలికి చుట్టుకుని, తాటిచెట్టు ఎక్కి, ముంజలు దింపుతుంటే, వాటి తలలు చెక్కి, తల ఒక్కింటికి 'ఇన్ని' అని పంచే బాధ్యత మా రెండో అన్నయ్యది. "బెద్దవాడు"కదా? వాడు చెప్పినట్టే నాలాంటి కుర్రకారు వినాలిట !

అలా పాటించని వాళ్ళు "మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు" ఉల్లంఘించినట్టే...
అని మా సుప్రీం కోర్టు, అదే...మా నాన్న శాసించారు,మేము పాటించాము.

విశ్వనాధ్ గారి సినిమా "స్వర్ణ కమలం" లో వెంకటేష్ లాగ , ఒక చిన్న టైట్ నిక్కరు వేసుకుని, సెక్స్ అప్పీల్ చేస్తూ, నూతిలోకి దిగి, మట్టి తియ్యడం నా డ్యూటీ !

తీరా దిగాక, ఎప్పటినుంచో కనపడకుండా పోయిన పురావస్తు శాఖ వాళ్ళ సామాన్లు,చెంచాలు,
నేతి గిన్నెలు, ఉగ్గు గిన్నెలు, పళ్ళాలు, అద్దెకున్న వాళ్ళవి, మావి, బయటికి తీస్తుంటే, పైనున్న వాళ్ళంతా లంకె బిందెలు దొరికినంత సంబరపడిపోతుంటే, మట్టి తీసి బయటికి వచ్చాక ఎలాంటి కటింగ్ ఇవ్వాలో తెలిసేది కాదు....నాకు !

వెంకటేష్ అయితే భానుప్రియ గజ్జెలు తెచ్చి ఇచ్చాడు కానీ, నేను మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళ అమ్మాయి, హైమవతి వాళ్ళ వెండిగిన్ని తీసి ఇచ్చినపుడు
తన అందమైన కళ్ళతోనే కృతజ్ఞతా పూర్వకంగా ఒక నవ్వులాంటిది చిలకరించకపోవడం....
ఏ భావమూ లేని చూపు చూడ్డం...నాకు ఇప్పటికీ నచ్చలేదూ..నచ్చలేదూ..నచ్చలేదు !

13 ఏళ్ల అమ్మాయిలు అలా పరాయి అబ్బాయిలకేసి చూసి నవ్వకూడదని, వాళ్ళ అమ్మమ్మే చెప్పి ఉంటుందని నా గట్టి నమ్మకం. అందుకే ఆవిడంటే నాకు కోపం.

పొద్దున్నే లేచాక, నూతి దగ్గిర చేరి, మా అన్నయ్య, నేను రెండు వరల మేర నీళ్ళు నెత్తి మీద స్నానం చేసి, అందరం కబుర్లూ, జోకులూ చెప్పుకుంటూ...చద్దన్నం మీద, తరవాణి మీదా పడితే ..ఉండేదీ.... కొత్తావకాయ, గడ్డ పెరుగూ.... అడ్డెడ్డెడ్డెడ్డే....

"మధ్యాన్నభోజన పధకం' లోపు ఇండోర్ గేమ్స్ !
మాది అల్లరికి ఎక్కువ.... ఆగడాలకి తక్కువ, గడుగ్గాయిలకి ఎక్కువ, కోతులకి తక్కువ !

నాన్న బయటికి వెడితే, వీధి గది తూములో గుడ్డలు కుక్కి, పాతిక బకెట్లతో గదంతా నీళ్ళు నింపి, ఈతలు కొడుతుంటే... ఉండేదీ.....

💐💐

మా నాన్న మా కోసమే అన్నట్టుగా..
దొడ్డి వైపు పెద్ద తాటాకు పందిరి ఒకటి వేయించి, "అక్కడే పడి ఏడవండి" అనేవారు.

రాజ్యాంగం మాకు ప్రసాదించిన బాలల హక్కులకు, బెద్దవాళ్ళకి ప్రసాదించిన ప్రశాంత జీవనానికి,
ఆ దొడ్డి వైపు పందిరి మధ్యే మార్గం అన్నమాట !

ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ లు లేకపోయినా ఇల్లంతా 'ఛల్హగా' ఉండేది ! తాటాకు విసన కర్రల మీద కుండలో నీళ్ళు చల్లుకుని,
ఓ చేత్తో విసుకుంటూ పడుకునే వాళ్ళు...బెద్దవాళ్ళు !

దొడ్డివైపు మా పిల్లకాయలందరికీ "ప్రత్యేక పేకేజీ" గా పెద్ద కుండతో చెరువు నీళ్ళు, రెండు పరకల మామిడిపళ్ళు, ఆరారగా తినడానికి ఓ డజను కొబ్బరి చెక్కలు, దాంట్లో నంజుకుందుకు ఒక వీశెడు బెల్లం మంజూరు చేసేవారు, వాళ్ళ జోలికి రాకుండా!

సదరు సరుకులకు న్యాయం చెయ్యడానికి, బెద్దవాళ్ళ ఆజ్ఞలు పాటించడానికి, ఆటలకి మధ్యలో కమర్షియల్ బ్రేకులు ఇచ్చేవాళ్ళం. ఆటల్లో మాలో మాకు రాజకీయాలు, గ్రూపిజాలు వచ్చేవి.

మా అన్నయ్యకి కోపం వచ్చినప్పుడల్లా...కేసీయార్ లెవెల్లో తిట్టేవాడు.
అప్పుడు నేను చంద్రబాబు చాణక్యం ప్రదర్శించి, మా ఆడపడుచులకి 'పసుపు- కుంకం' కింద రెండు ముక్కలు బెల్లం ఎక్కువ పెట్టి, వాళ్ళని నా వైపు తిప్పుకునే వాణ్ణి.

సాయంత్రం అయ్యేసరికి, 'ఎలెక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్' ఎత్తేసినట్టు ఉండేది.

ఇంక వీర లెవెల్లో 'ఔడ్డోర్' గేములు మొదలన్నమాట !
ఉప్పాట, ఏడు పెంకులాట, కబడ్డీ, దూద్ బాల్, లాంటి బండాటలతో మా హైస్కూల్ గ్రౌండ్ అంతా మాదే !

మనకి ఒక ప్రత్యేక 'గేంగ్ స్టర్' బ్యాచ్ ఒకటి ఉండేది. ఒంట్లో ఉన్న ద్రవాలన్నీ చెమట రూపం లో బయటకి పోయి, జుట్టు దానికి తోచిన ఆకారం లో నిలబడి, బట్టలు మొత్తం రంగులు మారి, "రాజు వెడలె రవి తేజములలరగ" లెవెల్లో కొంపకి చేరితే, మనని గుర్తు పట్టిన వాళ్ళే మన వాళ్ళు, పట్టలేని వాళ్ళు... తసమదీయులే !

మళ్ళీ నూతి దగ్గర చల్లటి నీళ్ళు స్నానం చేసి, అమ్మ, అమ్మమ్మ చేసిన ప్రత్యేక వంటకాల మీద పడేవాళ్ళం.

కంచాలు, మంచినీళ్లు పెట్టడం, భోజనాలయ్యాక కంచాలూ గట్రా తీయడం ఆడపిల్లలు మాత్రమే చెయ్యవలసిన పనులుట !

కొబ్బరిముక్కలు గానుగ ఆడించడానికి వందలకొద్దీ దిగిన కొబ్బరికాయలు ఒలవడం, ముక్కలు చేసి, ఎండబెట్టి, గానుగకి వెళ్ళి ఆడించడం, కొబ్బరి నూని డబ్బాల్లో పోసి,అటకెక్కించడం, నూతిలో మట్టి తీయడం, ముంజికాయలు కొట్టడం, దొడ్లో కాసిన సపోటాలు, బంగినపల్లి మామిడి కాయలు కోసి, పండబెట్టడం, మగ సంతానమైన మా విధి ట! సరే....
అలాక్కానిచ్చామనుకోండి !

మా దొడ్లో ఉన్న 'సామాజిక వనం' లో ఉన్న వేప, మామిడి, సపోటా, ఉసిరి, కొబ్బరి, తాటి చెట్ల మీదే బాల్యం గడిచిపోయింది.

ఇంటి ప్రహారీ గోడ మీద పరుగులాంటి నడకతో మూడు, నాలుగు రౌండ్లు కొట్టడం అద్దెకున్న వాళ్ళ అమ్మాయి హైమవతి చూడ్డం కోసమని, ఇప్పుడనిపిస్తోంది !
(ఒక సారి పడిపోవడం కూడా చూసే ఉంటుందా ఏమిటి, ఖర్మ !)

అప్పటికే ఉజ్జోగం చేస్తున్న మా పెద్దన్నయ్య విజయనగరం నుంచి శలవలకి వచ్చేవాడు. వాడితో పాటు హోటల్ కి వెళ్ళి, కోమల విలాస్ లో కారప్పొడి, నెయ్యితో ఇడ్లీ తినడం, ఆ రుచి నోట్లో ఇగిరిపోక ముందే హోటల్ కాఫీ తాగడం మేము అనుభవించిన లగ్జరీలు. (ఇంట్లో కాఫీ నిషిద్ధం).

తర్వాత రాయల్ టాకీస్ లో రూపాయి బాల్కనీ టిక్కెట్టుతో వాడి ఖర్చు మీద సినిమా చూడడం మస్టు.

మా పెద్దన్నయ్యతో పాటు మా ఊరి గోస్తనీ నదికి వెళ్ళి, కాలవలో గంటల తరబడి వచ్చీరాని ఈతలాంటిది కొట్టి, పడవలో అవతలి ఒడ్డుకి వెళ్ళి, రాచ ఉసిరికాయలు బేవార్సుగా కోసుకుని తినడం, మరచిపోలేము.

💐💐

మన ప్రియమైన వేసంకాలం శలవలు రెండున్నర నెలలూ యిట్టే గడిచిపోయి, మళ్ళీ దిక్కుమాలిన స్కూళ్ళు మొదలు !

కొత్త పుస్తకాలు, సిల..బస్సులు, రైళ్ళు, హోం వర్కులు, కొత్త కొత్త కోపిష్టి, కఠినాత్మ టీచర్లు,
(దుష్ట సమాసం కాబోలు !) సిద్ధం నమః!

ప్రతి రోజూ హోం వర్కు ఇవ్వక పోతే వాళ్ళ భార్యలకు కోపం వస్తుందన్నట్టు, హోం వర్కు ఇచ్చే లెక్కల మేష్టర్లు,

కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు, చేతిలో బెత్తం తోనే పుట్టాడా అన్నట్టు... ఎప్పుడు ఎవరిని కొడదామా అన్నట్టు బెత్తం పట్టుకుని, ఊపుతూ, స్కూలంతా కలియ తిరిగే డ్రిల్లు మేష్టారు,

హెడ్ మేష్టారంటే... ఎప్పుడూ నవ్వకూడదు, నవ్వితే పిల్లలు చెడిపోతారు అన్నట్టు, ఎప్పుడూ ముచ్చుమొహం పెట్టుకునే హెడ్ మేష్టారు,

'టకప్పు' చేసుకుని, మళ్ళీ బెల్టు కొనడం ఎందుకు, దండగ, అనవసరపు ఖర్చు అనుకుని,
మొలతాడునే బెల్టుగా మలిచిన గడసరి ఇంగ్లీష్ మేష్టారు, వీళ్ళందర్నీ తలుచుకుంటే... ఎక్కడికో వెళ్ళిపోతాం...వెనక్కి రాబుద్దెయ్యదు !

"దేవుడా, ఓ మంచి దేవుడా, వేసంకాలం ఇచ్చావ్, శలవలు ఇచ్చావ్, రెండు నెలలే ఎందుకు ఇచ్చావ్ ? ఈ వేసంకాలం ఓ పది నెలలు ఇవ్వడం ఎందుకు మరిచావ్ ?" అని వాపోయిన రోజులు ఇప్పుడు తలుచుకుంటే ?
హ్హుమ్....!!!

💐💐

స్కూల్ కి వెళ్ళనని మా 'కేజీ' మనవడు కీచులాడుతున్నాడు !
వాడిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్ళి...
స్కూల్లో వదిలి రావాలి !

కార్లో దింపేలోగా వాడికి చదువు విలువ చెప్పి, మేము ఎంత "కష్టపడి" చదువుకున్నామో చెప్పి,
స్ఫూర్తి నింపాలి !

రాత్రి పడుకునేటప్పుడు మా చిన్నతనం లో జరిగిన యదార్ధ గాధలు వాడికి చెప్పాలిట !

అంటే... వారానికి ఒక సారి చుట్టం చూపుగా వచ్చే కోతులతో మేము పడ్డ అవస్థలు,
శునక, వరాహ, మర్కట, మేష, వృషభ, మహిష, అశ్వ రాజాది జంతువుల తోను,
గొంగళి, పిపీలిక, మశకాది క్రిమి కీటకముల తోను,
నల్లి, బల్లి, తొండ, తేలు, జెర్రి, పాము వంటి విషపు జీవులతోను,
కాకి, పిచుక, చిలుక, గోరింకా, కోడి, పాల పిట్ట వంటి పక్షుల తోను మేము చేసిన సహజీవనం గురించి కధలుగా చెబుతుంటే...

అవే వాళ్ళకి 'సింద్ బాద్' సాహస యాత్ర లెవెల్లో థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది,

హాస్య కథల్ని మరిపిస్తోంది!

తాతలే వాళ్ళ దృష్టిలో హీరోలు !

అలాగే ఉండనిస్తే పోలా ?

😊😊😊
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐

సేకరణ

No comments:

Post a Comment