Sunday, May 22, 2022

భగవద్గీత యొక్క పరమార్థం!

🪴🌹 జ్ఞాన మండలి 🌹🪴

🌺అద్వితీయ సందేశం🌺

🌾 మానవాళికి కలిగే అనేక సంశయాలకు సమాధానం ఇచ్చే ఆధ్యాత్మిక గ్రంథం- "భగవద్గీత."
🌾 భగవంతుడైన కృష్ణుడి ముఖారవిందం నుంచి వెలువడిన జ్ఞానామృతమైన భగవద్గీత మనుషులకు జీవనగీతగా మారి, కర్తవ్యాన్ని ఉపదేశిస్తోంది.

🌾 మనిషికి జీవితంలో అడుగడుగునా భయాలే ఎదురవుతుంటాయి. అడుగుతీసి అడుగువేస్తే ఏమవుతుందోనని మనిషి భయపడుతుంటాడు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు భయం వెంటాడుతుంది. ప్రారంభించిన తరవాత తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదోనన్న భయం పీడిస్తుంది. గమ్యాన్ని చేరుకున్న తరవాత పరిణామఫలం ఎలా ఉంటుందోనన్న వెరపు వెంటాడుతుంది. ఇలా అనుక్షణం భయాల మధ్య బతుకు గడిపే మనిషికి మృత్యువు అంటే పెను భయం! ఏ ఆపదా రాకుండా ఉండాలని అనుక్షణం మనిషి కోరుకుంటాడు.

🌾 మరణం తొందరగా రాకూడదని ప్రార్థిస్తాడు. చిరకాలం జీవించాలని ఆశపడతాడు. ఇలా మనిషి ఆశపడటంలో తప్పులేదు. మరణం విషయంలో మనిషికి ధైర్యాన్ని కలిగించేందుకు భగవద్గీత ఎన్నో విషయాలను బోధించింది. వాటిలో రెండు శ్లోకాలు మాత్రం మనిషికి భయాన్ని పోగొట్టేతారకమంత్రాలుగా కని పిస్తాయీ.

🌾 వాటిలో మొదటి శ్లోకంలో కృష్ణుడు- ‘అర్జునా! నీవు చేయ బోతున్న యుద్ధంలో నీవు చంపేవాడివని, శత్రుపక్షం వారు చావుకు గురయ్యేవాళ్లు అని నీవు అనుకుంటున్నావు. అది నిజం కాదు... నీవు నిమిత్తమాత్రుడివే. మరణం వారికి ఇంతకు ముందే నిశ్చితమై ఉన్నది. పుట్టిన ప్రతి ప్రాణికీ చావు తథ్యం. చచ్చిన ప్రతి ప్రాణికీ మళ్ళీ పుట్టుక అనివార్యం. కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. యుద్ధం చేయడమే నీ ధర్మం’ అంటాడు.

🌾 ఈ మాటల్లో లోకంలోని ప్రాణుల మరణాలకు ఎవరూ కారణం కాదని, అది సహజంగా జరిగే పరిణామమేనని తెలిసినప్పుడు మనిషికి చింత, దుఃఖం దూరమవుతాయి. ఇక రెండో శ్లోకంలో- ‘మనిషి దేహం జీవన కాలంలో అనేక దశలను చవిచూస్తుంది. కౌమారావస్థ, యౌవనావస్థ, వృద్ధాప్యావస్థ అనేవి ముఖ్యమైనవి. పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు. క్రమంగా పోషణతో శరీరం పెద్దదిగా మారుతుంది. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలలో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది. ఇన్ని దశలుగా మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలా జీర్ణమైపోతూ ఉంటుంది. వస్త్రం చిరిగిపోయినట్లే, అతుకులు పడినట్లే మానవదేహం కూడా శిథిలమై అతుకులబొంతలా తయారవుతుంది. చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసిన స్థితికి చేరుకుంటుంది. చిరిగిపోయిన పాతబట్టలా ఈ దేహం మరణిస్తుంది. మళ్ళీ ఆత్మ మరో జన్మరూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అప్పుడు ‘పునరపి జననం’ సంభవిస్తుంది. ఇలా ఆత్మను కప్పి ఉంచే వస్త్రం లాంటిదే దేహం. కనుక దేహం శాశ్వతం కాదు. ఆత్మ శాశ్వతం. ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహమనే వస్త్రాన్ని తొడుక్కుని నూతన జన్మను పొందుతుంది’ అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తేటతెల్లం చేశాడు.

🌾 సృష్టిలో పరిణామం అనేది అనివార్యం. ఏది అయినా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా? మార్పునకు లోనవుతూనే ఉంటుంది. అదే జీవన సత్యం. మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదని, తన ఉనికి పరిమిత కాలమేనని తృప్తిపడతాడు. మరణ భయానికి దూరమవుతాడు.

🌾 తాను జీవించిన పరిమిత కాలంలో అపరిమితంగా మంచి పనులు చేసి, తన జన్మను సార్థకం చేసుకుంటాడు.
🌾 ఇదే భగవద్గీత యొక్క పరమార్థం!✍️... మీ మధు గురూజీ జ్ఞాన మండలి సేవా బృందం
🪴🌹🪴🌹🪴🌹🪴🌹🪴🌹

సేకరణ

No comments:

Post a Comment