Tuesday, September 6, 2022

సత్పురుషుల సాంగత్యం

 *సత్పురుషుల సాంగత్యం*

*”సత్పురుషుడు ఎక్కడ ఉంటాడో   ఆ ప్రదేశం ఇతర విషయాల్లో ఎలాంటిదైనా స్వర్గం కంటే అధికమైనదవుతుంది. అది జ్ఞానవంతులకు నివాసయోగ్యం.

*"సత్పురుషుడు, వృక్షము లేని చోటు.. సర్వవస్తు సమృద్ధమైనా అది మరుభూమి (శ్మశానం)తో సమానం!” అని జ్ఞానవాసిష్ఠ బోధ.

*జీవితంపై సందేహ, సంకటాలు కలిగినవారు మహాత్ములైన సజ్జనుల చెంత చేరాలి.

*దుఃఖితులైన వారికి సత్పురుషులు.. ధైర్యాన్ని, దైవాలంబనోపాయాన్ని బోధిస్తారు. ధర్మ, తత్వ రహస్యాలను తెలియపరచి శాంతహృదయులు చేస్తారు.

*ఇంతకీ సజ్జనులంటే, సత్పురుషులంటే ఎవరు? అంతర్యామియైన భగవంతుని కనుగొనడానికి ప్రయత్నించే     సాధనా- పరులే సజ్జనులు, సత్పురుషులు.

*సజ్జనులైన మానవులు మానవ ధర్మ సారాన్ని ఎరిగి ఉంటారు. వారికి చిత్త చలనం ఉండదు. తాపత్రయాలను పొందరు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పర్వతం వలె  చలించక స్థిరచిత్తులై ఉంటారు.
 
*మనస్సునందున్న మాలిన్యాన్ని దైవనియమ సాధనలచే పోగొట్టుకొని స్థిరమతితో యత్నించిన మానవులు పరమేశ్వరుని కనుగొనగలుగుతారు. ఆత్మవేత్తలైనవారు దేని మీదా ఇచ్ఛ లేనివారై ఉంటారు. ఆత్మదర్శనం చేతనే తృప్తి చెంది ఉంటారు. అటువంటి వారి దర్శనం లభించినవారే ధన్యులు.

*పద్మాకరం దినకరో వికచం కరోతి.                           చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్‌                   నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి                   సంతః స్వయం పరహితే విహితాభియోగాః* 

*తామరలు ప్రార్థించకుండానే సూర్యుడు పద్మాలను వికసింపజేస్తున్నాడు. *కలువలు అడగకుండానే చంద్రుడు వాటిని వికసింపజేస్తున్నాడు.* *అడగకుండానే మేఘుడు వర్షోదకధారలు కురిపించి జీవనదానం చేస్తున్నాడు.

*ఇలా సత్పురుషులు తమంత తామే పరహితాసక్తులై ఉంటారని.. ఎవరూ అడగకుండానే సాయం చేస్తారని భర్తృహరి చెప్పాడు.

*ఆత్మోద్ధరణకు ధనం, స్నేహితులు, శాస్త్రాలు, బంధువులు చేయగలిగిన ఉపకారమేదీ లేదు. ఆ విషయంలో సహాయం చేయగలిగినది సత్పురుషులే !

*సత్పురుష సమాగమమనే చక్కని నావలో సంసారం నుంచి ముక్తిని పొందడమే ఉత్తమ మార్గం.

*సత్పురుషుల తోడి సాంగత్యం పూర్వపుణ్య వశానే లభిస్తుంది. అది గంగలా పాపాలను పోగొడుతుంది. వెన్నెలలా అందరి మనస్సులకూ ఆనందం కలిగిస్తుంది. సూర్యుని ప్రభలవలె అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తుంది. చల్లని చెట్టు నీడవలె తాపమును పోగొడుతుంది.

*బహుదుర్లభమైన సజ్జన సాంగత్యం వల్లనే పాప, తాప, దైన్యాలు నశిస్తాయి.

           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.

No comments:

Post a Comment