Saturday, October 19, 2024

*ఆత్రేయగీత* రెండవ భాగం "పరావిద్య అపరావిద్య" - 1వ భాగము

 *ఆత్రేయగీత*

రెండవ భాగం

"పరావిద్య అపరావిద్య" - 1వ భాగము

శ్రీ శాస్త్రి ఆత్రేయ 

ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా, పరావిద్య మరియు అపరావిద్య అనే రెండు విద్యలను అవగతం చేసుకోవాలని బ్రహ్మవిదులు పేర్కొన్నారు.

అపరావిద్యలో నాలుగు వేదాలుతో పాటు వేదాంగములైన శిక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషము వస్తాయి. ఈ నాలుగు వేదముల సంవిధానమును బట్టీ అనేకానేక కర్మల ఆచరణ జరుగుతుంది. ఈ నాలుగు వేదములు, దేవతలను స్తుతించు ఋక్కులను (ఋగ్వేదము), యజ్ఞయాగాది కర్మలను (యజుర్వేదము), ఋగ్వేదంలోని ఋక్కులను సుస్వరంతో గానం చేయడం (సామవేదము), యజ్ఞ పద్దతులు, ఆయురారోగ్య పద్ధతులు, అస్త్రశస్త్ర విషయములు (అధర్వవేదము) పేర్కొంటాయి. ఇవన్నీ కూడా అపరావిద్యను భోదిస్తాయి.

శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించేదే పరావిద్య. ఇది సనాతనమైన ఆత్మను గురించి తెలియజేస్తుంది. వేదాంతములైన (వేదముల చివరి భాగములు) అన్ని ఉపనిషత్తులు పరావిద్యను బోధిస్తాయి. దీనినే “ఉపనిషద్విద్య” అని కూడా అంటారు.

కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలకు అందనిది, చేతులూ మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిది, రంగు లేనిది, అవయములు లేనిది, చావుపుట్టుకలు లేనిది, శాశ్వతమైనదీ, అంతటా వున్నది, అత్యంత సూక్ష్మమైనది, అయినటువంటి “అక్షరపరబహ్మము” ఈ విశ్వమంతటికి మూలంగా భావించి, జ్ఞానులైన మహర్షులు దీనిని అంతటా దర్శిస్తారు.

స్వప్న, జాగ్రదావస్థలలో కూడా ఏదీ విశ్వంతో ముడిపడివుంటుందో అదే బ్రహ్మము. అదే పరమాత్మ. సకల
జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవభావాన్ని పొందినవాడు, దానిని కలిగించువాడు కూడా పరమాత్మే.

అదితిగా ఆరాధింపబడుతున్నది, ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములయందు నెలకొనియున్నది ఆ పరమాత్మే. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఆకాశమున ఒక నిర్ణీత కక్షలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. నిజానికి ఈ జగత్తు యొక్క తత్వమే పరమాత్మ. కాబట్టీ ఈ ప్రపంచానికి పరమాత్మకి వాస్తవమైన
బేధంలేదు.

అటువంటి పరమాత్మను మనస్సుతో గ్రహించవచ్చు. ఆత్మానుభూతికి మనస్సే ప్రధానము. ప్రతిజీవి హృదయంలో పరమాత్మ సూక్ష్మరూపంలో వున్నాడు. ఉపాధులు వేరైనప్పటికీ ఆత్మ వస్తువు ఒకటే. నదులు వేరైనప్పటికీ నీరు ఒక్కటే కదా! అనేక నదులు సముద్రంలో కలిసినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతున్నాయి కదా!.

ఎలాగైతే నీరు, వాయువు ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతములలో ప్రవేశించి ఆయా రూపములను ధరిస్తుంది. ఎలాగైతే సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది.

ఆ ఆత్మ వస్తువును ఇదియని వరించుట దుర్లభము ఎందుకంటే అంతా అదే, అన్నీ అదే కాబట్టీ. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మవస్తువును అనుభూతిపొంది
బ్రహ్మానందాన్ని పొందుతాడు.    

No comments:

Post a Comment