Sunday, October 20, 2024

 Vedantha panchadasi:
నా ప్రతీతిస్త యోర్బాధః కింతు మిథ్యాత్వ నిశ్చయః ౹
నో చే త్సుషుప్తి మూర్చాదౌ ముచ్యేతాయత్నతో  జనః ౹౹13౹౹

13. అవి బాధ చెందుట అనగా ఇంద్రియ గోచరములు కాకుండుట కాదు.కాగా,అవి మిథ్య అనే దృఢనిశ్చయమే బాధ.అట్లు కానిచో సుషుప్తి మూర్చ మొదలగు అవస్థలయందు ఏ ప్రయత్నము లేకయే మానవుడు ముక్తి నొందవచ్చును గదా !

పరమాత్మావశేషోఽ పి తత్సత్వ వినిశ్చయః ౹
స జగద్విస్మృతిర్నో చే జ్జీవన్ముక్తిర్న సంభవేత్ ౹౹14౹౹

14. "పరమాత్మయే మిగులును" అనగా పరమాత్మయే సత్యము అనే దృఢ నిశ్చయము అని అర్థము.
ఆ జీవజగత్తులు విస్మరింపబడునని కాదు.అట్లు కానిచో జీవన్ముక్తియే సంభవింపదు.

మనకు చలనచిత్ర దృశ్యములు కన్పించునట్లే జీవన్ముక్తునకు జగన్నాటకము కన్పించుచుండును.వెండి తెర ఒక్కటే సత్యము,దాని మీది సినిమా దృశ్యములన్నీ చలనచిత్రములే అనే జ్ఞానము మనకున్నట్లే జీవన్ముక్తునకు జగన్నాటకము బూటకమే అనీ పరబ్రహ్మమే సత్యమనీ
 తెలియును.
జగత్తును మరచుటయే జ్ఞానమైనచో ఇట్టి జీవన్ముక్తి సంభవింపనె సంభవింపదు గదా!

జీవజగత్తులు ఇంద్రియగోచరములు కాకుండటయే బాధ(సత్యమనే భావము నశించుట)యైనచో గాఢనిద్రయందు ఏమీ గోచరింపదు.అపుడు తత్త్వజ్ఞానము లేకయే ముక్తి కలుగవలెను.కాని అట్లు జరుగుట లేదు.కనుక బాధ అనగా మిథ్యాత్వ నిశ్చయమని నిర్ధారణము.

అసలు జగత్తనగా నామరూపములే. 
ఈ నామరూపములు ఊరక అగుపడడమేగానీ ఒక వస్తువుగా ఉండలేదు.

కుండ పుట్టకమునుపు కుండ అను పేరును, దాని రూపమును లేవు. కుండ పగిలిన తర్వాత గూడా లేవు.ఉన్నవస్తువు మట్టి ఒక్కటే సత్యము.
ఈ మధ్య కాలంలో ఊరక గోచరించేవిగాన ఉన్నట్లు తోచేవాటిని మిధ్య అంటారు.

 నామరూపములు వ్యవహారార్థమై వాక్కు ద్వారా ఇది కుండ అని వాడుకోవడం తప్ప అనగా కేవలం వాక్కు ద్వారా తెలియబడడమే గానీ పరమార్థముగా నామరూపములు లేనేలేవు.

ఏది మొదట లేనిదై చివరలేకుండా పోవునో అది మిధ్య.

అట్లే బ్రహ్మముందు గోచరించు జగత్తు యొక్క నామరూపములు మిధ్యయై యున్నవి.వాటి పరమార్థము బ్రహ్మమే.

అవిద్యా జీవునికి బ్రహ్మము ప్రపంచముగా అగుపడుచున్నదే గానీ,ప్రపంచరూపముగా మారనూలేదు.ప్రపంచమును పుట్టించనూలేదు.దీనికి శంకరులు
"వివర్త" మని పేరు పెట్టారు.అనగా తన స్వరూపంలో మార్పు లేకుండా అన్యరూపంగా అగుపడడాన్ని వివర్తమందురు.

కల్పిత సర్పమునకు త్రాడు కారణమైనట్లు కల్పిత లేక మిధ్యయైన ఈ జగత్తుకు బ్రహ్మము వివర్తోపాదాన కారణమై యున్నది.

వివర్తవాదము ననుసరించి నామరూపములతో గూడిన ఈ జగత్తంతయూ బ్రహ్మమేనని చెప్పుచున్నాము.అయితే నామరూపములనబడు వికారములతో యున్న జగత్తును నిర్వికారమైన బ్రహ్మముగా చెప్పుట ఎట్లనగా,త్రాడుయందు దోచు సర్పమును బట్టుకొని ఈ కనిపించు పామే త్రాడు అని చెప్పుట పొసగదు.మరేమనగా ఆకనిపించు పాము అసత్యమై మిథ్యయై యున్నది.దాని పరమార్థము బ్రహ్మమే.ఈ ప్రకారము జగత్తు బ్రహ్మమేనని చెప్పబడినది.

"సర్వం హ్యేత ద్ర్బహ్మ"-ఈ సర్వము బ్రహ్మమే,అనుట యందు "ఈ సర్వము అనునది అసత్యము,మిథ్య దీని పరమార్థము 
"బ్రహ్మమే" అని శ్రుతుల అభిప్రాయము.   

No comments:

Post a Comment