యదువంశ చరిత్ర-శ్రీ విష్ణు పురాణము
Part 22
యయాతి చరిత్ర
ఇతి శ్రీవిష్ణుపురాణే చతుథాంశే దశమోధ్యాయః
నహుషునికి ఆరుగురు కొడుకులు. యతి, యయాతి, సంయాతి, కృతి, ఆయాతి, వియాతి. పెద్దవాడైన 'యతి' రాజ్యాన్ని కోరలేదు. యయాతినే రాజును చేశాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. శర్మిష్ఠ, దేవయాని.
దేవయాని యదువును, తుర్వసుని కనగా - వృషపర్వతనయ శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అనేవారు జన్మించారు.
శుక్రుని శాపంవల్ల యయాతికి కొంతకాలం ముసలితనాన్ని అన్యాయంగా కాలంకాని కాలంలో అనుభవించవలసివచ్చింది. ఒక్క వెయ్యేండ్లపాటుమాత్రమే విషయ(సంభోగ) వాంఛలనుభవించిన ఆ యయాతికి మళ్లీ జవజీవాలు వుంజుకుని, విషయాసక్తత రగుల్కొనడం ఎలా? అనే చింత పట్టుకుంది. తన ఐదుగురు కొడుకుల్నీ పిలిచి కొంతకాలం వారి యవ్వనంలో కొంతత్యాగం చేసి తనకు ఇమ్మన్నాడు. యదువు పెద్దవాడు కనుక ముందుగా అతడ్ని అడిగాడు. దానికి యదువు అంగీకరించలేదు. అందరిలోనికీ చిన్నవాడైనా పూరువు అందుకు అంగీకరించాడు.
యవ్వనాన్ని పొందిన యయాతి యధేచ్ఛగా సుఖాలనుభవించి, ఎంతకూ తనివితీరని ఈ సుఖభోగాలకు అంతూ - దరీ లేదని గ్రహించి, ఎప్పటికైనా ముసలితనం తప్పదనుకుని, కొడుకు యవ్వనం కొడిక్కే ఇచ్చివేసి, రాజ్యంకూడా అతనికే అధికభాగం ఇచ్చి అడవులకు వెళ్లిపోయాడు.
యదువంశ చరిత్ర
ఈ వంశంలోనే కృష్ణుడు అవతరించాడు.
అట్లే అత్రివంశీయుడైన దత్తాత్రేయుని సేవించి, వేయిచేతులను పొందిన కార్తవీర్యార్జునుడూ ఈ వంశంలోనివాడే! ఇతని రాజ్యం పరిపాలన బహుశ్రేష్ఠమని కీర్తించబడింది. ఈ మహానుభావుడు 85 వేల ఏళ్ల పరిపాలన తర్వాత నారాయణాంశ పరశురామునిచేత సంహరించబడ్డాడు.
కార్తవీర్యుని పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులలో అనేకులు ప్రసిద్ధులు. కాని వీరి మూలపురుషుడు యదువుగనుక యాదవులని పిలవబడినా; తదుపరి కాలంలో వృష్ణి, మధుడు మొదలగువారి పేరిట ఆయా వంశాలు విస్తరిల్లాయి.
(వంశానికి మూలపురుషుడైన వానిపేరిట యాదవులు ఒక కులంగా రూపాంతరం చెందినారనడం వాస్తవం. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ యదువంశ వృక్షంలో ప్రధాన శాఖలు వృష్ణి, మధు, కుకుర, అంధకాది శాఖలు. యాదవ వంశంలో ముసలం జనించి, సకలయాదవులు ఒకర్నొకరు చావబాదుకుని శ్రీకృష్ణావతార పరిసమాప్తి ఘట్టంలో ఏవిధంగా మడిసినదీ మున్ముందు చెప్పబడుతుంది.)
యదువంశం
పరాశరుడు చెప్తున్నాడు..
యదువు కొడుకు క్రోష్ఠువు. వానికి ధ్వజనీవంతుడు - స్వాతి - రుశంకువు, చిత్రరధుడు, శశిబిందువు.
శశిబిందుచక్రవర్తి వద్ద 14 మహారత్నాలుండేవని ప్రతీతి. ఇతనికే ఒక నూరు వేలమంది భార్యలు, పదిలక్షలమంది పుత్రులు. వీరిలో ఆరుగురే ప్రధానులు.
ఇందు - పృథుశ్రవసుడనేవానికి - పృథుత్తముడు - ఉశనుడు జన్మించారు. ఇతనికి నూరు అశ్వమేధాలు జరిపిన ఘనకీర్తి ఉంది. ఉశనునికి - శితపువు ఇతనికి రుక్మకవచుడు, పరావృత్ - రుక్మేష - పృథ, జ్యామఘు - పలిత హరిత నామధేయాలుగల ఐదుగురు పుత్రులు కలిగారు.
ఈ జ్యామఘుని గాథ ఒకటి ఇక్కడ ప్రస్తుతము చెప్పదగినది.
ఇతని భార్య శైబ్య. గొప్ప అందగత్తె. జ్యామఘుడికి ఆమె అంటే అమితమైన అనురాగం. అంతకుమించి ఆమె అంటే భయం కూడా! ఆమెకు సంతతిలేదు. అయినా ఆమె నోటికి జడిసి ఇంకొకరి నెవ్వర్నీ చేసుకోలేదు.
ఒకప్పుడు అతనికి కొందరు రాజులతో యుద్ధం సంఘటిల్లింది. ఆ పోరులో జ్యామఘునికే విజయం ప్రాప్తించింది. ఒక రాజు రాజధానిని వదలి పారిపోయాడు. అప్పుడొక కన్యారత్నం తన వాళ్లకోసం ఏడుస్తూ రక్షించమని ఆక్రోశించగా, 'ఆహా! సంతానంలేని నాకు ఈ కన్యారత్నం చాలా సునాయాసంగా లభించిందే! ఈమెను తీసుకెళ్లాలి' అనుకుని ఆ కన్యను తన రథంపై నెక్కించుకుని తన పట్టణానికి చేరుకోగా శైబ్య ఉరిమి చూసి, తనపతిని చపలచిత్తుడని దూషించి 'ఎవరామె' అని అడిగింది. తత్తరపాటుతో నా కోడలు అన్నాడా రాజు. "కొడుకూలేడు. మరో పెళ్ళాం అయినా లేని నీకు కోడలెక్కడ?" ఏం చుట్టరికం" అని ఎద్దేవాచేయగా, నీకు పుట్టబోయేవాడికిది పెళ్లాం అని తప్పించుకున్నాడు జ్యామఘుడు. తర్వాత అదే నిజమైంది.
అతని పుత్రుడు విదర్భుడు ఆమెనే పెళ్లాడాడు. వారికి జన్మించినవాడే రోమపాదమహర్షి. నారదునివల్ల జ్ఞానసంపన్నుడయ్యాడీతడు.
తర్వాత ఈ రోమపాదుని వంశం అఖండంగా విస్తరిల్లింది. వీరి వంశంలోనే సత్వతుడనేవాడు జన్మించాడు. అక్కడ్నుంచి విస్తరించిన ఈ వంశీకులను సాత్త్వతులన్నారు. యదువంశంలోని ఏడు ప్రధాన శాఖలు ఇవే!
సత్త్వతునికి ఏడుగురు కుమారులు. భజన, భజమాన, దివ్యాంధక, దేహ, పృథ, వృష్ణి, భోజ పేర్లు గలిగినవారు. భజమానునికి నిమి, కృకణ, వృష్ణి అనువారు పుత్రులు. వీరి సవతి తల్లి పుత్రులు శతజిత్, సహస్రజిత్ అయినజిత్ అనువారు ముగ్గురు. దేవాపృథునికి బభ్రువు జన్మించాడు. అతడు మానవోత్తముడు. దేవసమానుడు. ఇతని పరంపరలో భోజులనుపేర కొందరు - మార్తికులనేపేర కొందరు ప్రఖ్యాతులు.
వృష్ణికి జన్మించిన సంతానం...సుమిత్రుడు, యుథాజిత్, సుమిత్రుడు, అనమిత్రుడు, నిఘ్నుడు, సత్రాజిత్, ప్రసేనజిత్లు. వీరిలో సత్రాజిత్కు సూర్యభగవానుడు మిత్రుడు.
No comments:
Post a Comment