Saturday, October 19, 2024

 *ఆసురీ సంపన్నుల గుణాలు.....*
 
శ్లో॥ ప్రవృత్తించ నివృత్తించ  
జనాన విదురా సురాః।  
నశౌచం నాపి చాచారః  
న సత్యం తేషు విద్యతే॥

తా॥ అసుర స్వభావం గల మానవులు ధర్మప్రవృత్తిని గాని, అధర్మ నివృత్తిని గాని తెలుసుకోలేరు. వారికి శుచిత్వం ఉండదు. ఆచారం కూడా సరిగా ఉండదు. వారిలో సత్యం కూడా కానరాదు.  

లోకంలో సాధారణంగా ౩ రకాల మానవులుంటారు. వారు...

౧. ఉత్తములు...

వీరు అసలు ఎప్పుడూ తప్పులే చేయనివారు. ఒకరిచేత చెప్పించుకోవలసిన పనిలేని వారు.

౨. మధ్యములు...

వీరు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. అయితే ఇతరులు చెప్పినప్పుడు విని, వారి ప్రవర్తనను మార్చుకుంటారు. ఇక ఆ తరువాత ఎప్పుడూ తప్పులు చేయరు.  

౩. అధములు...

వీరు ఎప్పుడూ తప్పులే చేస్తుంటారు. వీరికి మంచి ఏమిటో తెలియదు. తెలిసినా ఆ మార్గాన నడవరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా వినిపించుకోరు, తమ ప్రవర్తనను మార్చుకోరు. ముఖ్యంగా ఈ శ్లోకంలో ఇలాంటి వారిని గూర్చే తెలియజేస్తున్నారు. 

వీరికి ప్రవృత్తి - నివృత్తులంటే ఏమిటో తెలియదు. వాటిని పట్టించుకోరు. ప్రవృత్తి అంటే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, సత్కర్యాలు చేయుటయందు ఆసక్తి. నివృత్తి అంటే అధర్మకార్యాలు, పాపకార్యాలు, దుష్కార్యాలు.. మొదలైన వాటి వైపుకు మనస్సు పోకుండుట, వీరికి ఆ రెండూ తెలియవు. 

చేయవలసిన పనులు ఏమిటో తెలియనందున చేయవలసిన పనులు చేయరు. చేయకూడని పనులు ఏవో తెలియనందున వాటిని చేస్తారు. వారికి విధినిషేధాలు తెలియదు. వారి స్వభావం అంతా అకటావికటం. వారి పద్ధతులన్నీ అస్తవ్యస్తం - అయోమయం.  

౧. తమకు తెలియదు. తెలిసిన వాళ్ళను ఎగతాళి చేస్తారు.  

౨. తాము చేయరు. చేసేవాళ్ళను ఎగతాళి చేస్తారు.  

౩. తమకు తోచదు. ఎవరన్నా చెబితే వినరు.  

ఇదీ ఆసురీ స్వభావం గల వారి ప్రవర్తన. వారిలో ఏకోశానా శుచిత్వం ఉండదు. రూపులోకాని, చూపులో కాని, పలుకులో గాని, భావంలో గాని, కాగడాపట్టి వెతికినా శౌచం లేదు. పైగా శుచిగా ఉన్నవారిని చూసి ఎగతాళి చేస్తారు.  

ప్రతిరోజు కళ్ళు తెరవకముందే - పళ్ళు తోమక ముందే బెడ్ కాఫీ కావాలి. 'ఆచారః ప్రథమో ధర్మః' - ధర్మాలలో మొదటిది ఆచారం అన్నారు. ఆచార హీనుని వేదాలు కూడా కాపాడలేవు. అందరూ అంగీకరించే ఆచారాలను, అందరూ పాటించే ఆచారాలను, సర్వసాధారణమైన వాటిని అందరూ పాటించాలి. కాని ఆసురీ స్వభావం గలవారికి ఆచారాలను పాటించటం చిన్నతనం - నామోషీ. ఆచారహీనులు సత్యాన్ని పలకరు. సత్యము - శౌచము మోక్షార్థికి చాలా ముఖ్యం. అందుకే యమ నియమాలలో ఈ రెండింటిని చెప్పారు. యమ అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. నియమ అంటే శౌచం, తపస్సు, స్వాధ్యాయం, సంతోషం, ఈశ్వర ప్రణిధానం.  

'దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం నవిద్యతే' - రాక్షసులకు దయ, సత్యం, శౌచం అనేవి తెలియదు - అని లంక నుండి తిరిగివచ్చిన హనుమంతుడు శ్రీరామునితో అన్నాడు. కనుక ఇవి లేనివారు అసురులే. కనుక వీటిని తెలుసుకొని వాటి కొరకు ప్రయత్నించాలి. సాధన చేయాలి.

No comments:

Post a Comment