Saturday, October 19, 2024

 *విష్ణు సహస్ర నామం…*

              *ధృవాయ నమః*
                 
         
*ఒక ఊరిలో ఒక గొప్ప వేదపండితుడు వుండేవాడు. ఆయనికి  సకల సద్గుణ సంపన్నుడైన ఒక కుమారుడు. అతను మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. అలాగే తల్లితండ్రులకు  కూడా శ్రద్ధగా సేవలు చేసేవాడు.*

*అతనికి  ఒక రాజకుమారునితో స్నేహం ఏర్పడింది.    ఆ రాజకుమారుడు  సౌందర్యవంతుడు.  రాజభోగాలన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ వచ్చాడు.  ఆ రాజకుమారునికి సన్నిహితంగా వుండే పండితుని కొడుకు కూడా యువరాజులాగే రాబోయే జన్మలోనైనా ఒక రాజకుమారునిగా జన్మించి సకల వైభోగాలు పొందాలని మహావిష్ణువుని ప్రార్ధించేవాడు.* 

*ఆ పండిత పుత్రుడే   మరు జన్మలో ఉత్తానపాదమహారాజుకు కుమారుడైన  ధృవునిగా జన్మించాడు.*

*ఈ వృత్తాంతం విష్ణుపురాణం ప్రధమాంశంలో  12 వ అధ్యాయం లో వివరించబడినది.*

*అందువలననే ధృవుడు    మహా విష్ణువుని గురించి కఠోర తపస్సు చేసినప్పుడు ఏకంగా  ఒకేసారి అతనికి ధృవస్థానాన్నో  ముక్తినో  అనుగ్రహించ కుండా ముందుగా రాజ్యానికి తిరిగి వెళ్ళి రాజ్యపాలన చేయమని మహావిష్ణువు ఆదేశించాడు.      అతను పండిత పుత్రునిగా వున్నప్పుడు       అతను కోరుకున్న  రాజభోగాలను ముందుగా ప్రసాదించాడు మహావిష్ణువు.*

*36 వేల సంవత్సరాలు భూలోకంలో ధర్మపాలన చేసిన ధృవుడు    పిదప ధృవస్థానాన్ని చేరి తర్వాత  వైకుంఠానికి వెళ్ళేడని భాగవత పురాణం వివరిస్తున్నది.*

*భూలోకంలో   రాజ్యపాలన   చేసి, ధృవస్థానానికి వెళ్ళే సమయంలో, తన పుత్రునికి రాజ్యం అప్పగించి బద్రీనాథ్ కి వెళ్ళేడు ధృవుడు. అక్కడ పవిత్ర స్నానం చేసి ధ్యానంలో ఆశీనుడైనాడు ధృవుడు. అప్పుడు ఆకాశం నుండి ఒక విమానం దిగి వచ్చినది. అందులో నుండి ‘నందన‌, సునందన’ అనే ఇద్దరు దేవదూతలు ధృవుని వద్దకు వచ్చారు.    వారు "ధృవస్థానానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చామని" వినయంగా చెప్పారు.* 

*ధృవుడు విమానం ఎక్కే సమయంలో యమధర్మరాజు వచ్చి తన తలమీద కాళ్ళు పెట్టి ఎక్కమని  కోరాడు. ఆ విధంగానే ధృవుడు విమానం ఎక్కేడు. ధృవుడు ప్రయాణిస్తున్న విమానానికి ముందుగా మరియొక విమానం పైకి వెడుతూ వుండడాన్ని ‘నందన సునందులు’ ధృవునికి చూపారు… "అదుగో, చూడండి, మీ తల్లి  సునీతి కూడా ధృవస్థానానికి వెడుతున్నది.” అన్నారు.          తల్లికి ఉన్నత స్థితి ఏర్పడేందుకు కూడా ధృవుడే కారణం. అతనే తల్లిని మహావిష్ణువు గురించి తపమాచరించమని ఉపదేశించాడు. భక్తులకంటే    భక్తుల  ప్రేరణతో సత్ చింతనతో భగవధ్యానం చేసేవారు కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అందుకు సాక్ష్యంగా  ఘోర తపస్సు చేసిన ధృవుని కంటె ముందుగా అతని తల్లి   ధృవస్థానానికి   చేరుకున్నదని భాగవత పురాణంలో శుక మహర్షి తెలిపారు.*

*"ధృవః" అంటే..   ‘స్థిరమైనది‘ అని అర్ధం.  స్థిరమైన పదవిని   ధృవునికి అనుగ్రహి.    చిన నారాయణుడు, సదా స్థిరంగా  ప్రపంచంలోని  మార్పులకి అతీతునిగా వున్నాడు. విశ్వవ్యాప్తంగా సర్వ జగత్తు   స్థిరంగా   నిలిచేలా పాలిస్తున్నాడు.* 

*అందువలననే నారాయణునికి "ధృవః"  అనే పేరు వచ్చింది. ఆవిధంగా స్ధిరంగా వున్నందువలననే  ఉన్నతమైన ధృవ స్థానాన్ని ప్రసాదించ గలిగాడు.*

*"ధృవః" అనే నామమే అనంతుని వేయి ఆనందనామాలలో 390 వ నామము.*

*'ధృవాయ నమః '  అని నిత్యం జపించే భక్తులను ఉన్నత పదవిలో వుండేలా అనుగ్రహం ప్రసాదిస్తాడు.*  

No comments:

Post a Comment