Sunday, October 20, 2024

 Vedantha panchadasi:
కూటస్థో బ్రహ్మ జీవేశావిత్యేవం చిచ్చతుర్విధా ౹
ఘటాకాశమహాకాశౌ జలాకాశభ్రఖే యథా ౹౹18౹౹

18.  ఘటము నందలి ఆకాశము, అనంతమగు మహాకాశము, జలము నందలి ఆకాశము, మేఘమునందలి ఆకాశము అని ఆకాశము నాలుగు విధములుగ తోచునట్లే, పరమార్థమున ఒకటియేయైన చిదాత్మ వ్యవహార దశయందు కూటస్థము,బ్రహ్మము, జీవుడు,ఈశ్వరుడు అనే నాలుగు విధములుగ భాసించును.

ఘటావచ్ఛిన్నఖే నీరం యత్తత్ర ప్రతిబింబితః ౹
సాభ్ర నక్షత్ర ఆకాశో జలాకాశ ఉదీర్యతే ౹౹19౹౹

19. ఘటముచే సీమితమైన ఆకాశము నందలి నీటి యందు మేఘములు నక్షత్రములతో సహా ప్రతిఫలించిన ఆకాశమే జలాకాశమనబడుచున్నది.

మహాకాశస్య మధ్యే యన్మేఘమండల మీక్ష్యతే ౹
ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః ౹౹20౹౹

20.  ఆకాశము నందలి మేఘములందు గల నీటి కణముల యందు ప్రతిఫలించిన ఆకాశము మేఘాకాశము.

మేఘాంశరూపముదకం తుషారాకార సంస్థితమ్ ౹
తత్ర ఖప్రతిబింబోఽ యం నీరత్వాదనుమీయతే ౹౹21౹౹

21.మేఘమనగా ఒకానొక అవస్థ యందున్న జలమే.మంచు ఆకారమున ఉండును.జలము నందు ప్రతిఫలించినట్లే మేఘావస్థ యందున్న జలమునందు కూడా ఆకాశము ప్రతిఫలించునని అనుమానముచే తెలియుచున్నాము.

కార్యకారణరూప ఉపాధులే జీవత్వ ఈశ్వరత్వ వ్యవహార ప్రయోజకములు.ఉపాధులు దొలగిన జీవుడు,ఈశ్వరుడు ఇద్దఱు లేరు.ఉన్నది పరబ్రహ్మ చైతన్యమొక్కటే.

ఈశ్వరుడనగా నియంత,పాలకుడు,సృష్టికర్త.
ఇలాంటి పదములు మాయను నియమించువాడు జగత్తును పాలించువాడు సృష్టించువాడు అనునప్పుడే సంభవించుచున్నవి.
అప్పుడే ఈశ్వరుని నామములు సార్థకము లగుచున్నవి.

కనుక మాయా మహదాదికారణోపాధులున్నప్పుడే ఈశ్వరాది వ్యవహారము సిద్ధించును.అందుచేతనే కారణమగు మాయోపాధిగలవాడు ఈశ్వరుడని శాస్త్రములు వచించుచున్నవి.

జీవుడనగా
 కించిత్ జ్ఞుడు,సుఖి,దుఃఖి ఇలాంటి పదములు మాయాకార్యమగు అవిద్యయున్నప్పుడు ప్రయుక్తములగుచున్నవి.కావున కార్యమగు అవిద్యోపాధికుడు జీవుడనీ వ్యవహారము సిద్ధించుచున్నది.

కనుక ఈ రెండు ఉపాధులును తొలగించిన ఈశ్వరుడు,జీవుడును లేరు.అదెటులన్న రాజ్యమను ఉపాధియున్నప్పుడు రాజు అని పిలవబడుచుండెను.కుగ్రామములో నున్నందువలన భటుడని వ్యవహరింపబడెను.రాజునకు రాజత్వము,భటునకు కుగ్రామత్వము పోయిన రాజభట వ్యవహారమే లేదు గదా!ఇద్దఱు సమానులే గదా.

ఈ జీవత్వ ఈశ్వరత్వములు రాజత్వభటత్వములవలె ఆగస్తుకములే.యథార్థముగా విచారించిన ఒకే పరబ్రహ్మ చైతన్యమే ద్వివిధముగా 
భ్రాన్తిచే నున్నది.

ఒకే సూర్యుడు మేఘాకాశ జలములో ప్రతిబింబించినప్పుడు మేఘాకాశ సూర్యుడుగాను, ఘటాకాశములలో ప్రతిబింబించినప్పుడు ఘటాకాశసూర్యుడు గాను నున్నాడు.

మేఘముగా మంచుగా నీరుగా ఒకే జలము వివిధ అవస్థలలో వేరవేరు రూపాలు ధరించు విధముగా ఒకే పరబ్రహ్మచైతన్యము అంతటా ప్రతిబింబించును.

అదేవిధముగా ఒకే సద్వస్తువు కల్పిత ఉపాధులచే జీవేశులుగానున్నది.ఉన్నది ఒకటియే అందుచేతనే
(జీవశ్శివశ్శివో జీవః స జీవః కేవలశ్శివః)జీవుడే శివుడు,శివుడే జీవుడు.ఆ జీవుడు కేవల శివుడు అనగా ఒకే చైతన్యమని అర్థము.
భేదమేమియు లేదు.అని శ్రుతి చెప్పుచున్నది.

జీవేశులిద్దరు లేరు.ఒకే పరబ్రహ్మైచైతన్యము అనేదే అఖండార్థము.      

No comments:

Post a Comment