*📖 మన ఇతిహాసాలు 📓*
*ఫాంచాలీ పరిణయం వెనుక..*
ధరించేది ధర్మం అన్నారు. ధర్మాన్ని రక్షిస్తేచాలు ధర్మమే మనలను రక్షిస్తుంది. స్వధర్మాన్ని ఆచరిస్తూ అందులో ప్రాణాలు కోల్పోయినా ఫర్వాలేదు కాని పరధర్మాన్ని ఆశ్రయించరాదని శ్రీకృష్ణ్భగవానుడు అన్నారు. రూపుకట్టిన ధర్మమే రాముడన్నారు. ధర్మాన్ని ఆచరించనివారు నరకలోక ప్రయాణికులేకాని మరే దారి వారికి లేదన్నారు. ఇలా ధర్మాన్ని గురించి ఎందరో ఎన్నో చెప్పారు. ధర్మం అంటే అంతా తెలిసినట్టే ఉంటుంది. కాని ఆచరించటానికి పోతే ఏన్నో సందేహాలు కలుగుతుంటాయి. ధర్మం తెలిసిన వారు ధర్మం చాలా సూక్ష్మమైనది. ధర్మసూక్ష్మం తెలుసుకొన్నవారు జ్ఞానస్వరూపులే. వారు భగవంతునికి అనురూపులే అంటారు. అలాంటి ధర్మాన్ని గురించి సామాన్యులు కూడా తెలుసుకోవటానికి మహాభారత గ్రంథం ఉపయుక్తమైంది. వేదవ్యాసమహర్షి ఏ సమయంలో ఏవిధమైన ధర్మాన్ని ఆచరించాలో ధర్మం ఆచరిస్తే కలిగే ప్రయోజనమేమిటో ఉపాఖ్యానాలతో చిన్న చిన్న కథలతో మనసుకు హత్తుకునే విధంగా మహాభారతంలో చెప్పారు. కాని మహాభారతం ఉద్గ్రంథం. ఈ పరిగెత్తి పాలుతాగే ఈ కంప్యూటర్‌యుగంలో మహాభారత గ్రంథాన్ని చదివే ఓపికగాని, ఆసక్తిగాని లేకుండానే తరాలు ముందుకు సాగుతూ కొత్త తరాలకు వాకిళ్లు తెరుస్తున్నాయి.
దానివల్లే నేడు మానవుల్లో అభద్రతాభావం, అనిశ్చిత, అయోమయం బంధువుల మధ్య స్నేహితుల మధ్య చివరకు తల్లితండ్రులు, అక్కచెళ్లెళ్లు, అన్నదమ్ముల మధ్యా కూడా సఖ్యత కరువు అవుతోంది. అటువంటి వారు కనీసం భారతం అంతా చదవకపోయినా కొన్ని కొన్ని ఘట్టాలు కొన్ని ధర్మసూక్ష్మాలు తెలుసుకొంటే వారి జీవనపథంలో వికాసం కలుగుతుందని అనిపిస్తుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అనిపించే మన వాఙ్మయసంపదలో భాగమైన మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పిన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలిసినంత వివరిస్తున్నాను. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోకుండానే ఇతరులు ముఖ్యంగా విదేశీయులుకాని, పరమతం వారు ఆ ఏముంది? మీ సంస్కృతీ సంప్రదాయాలు చెట్టుపుట్టను మొక్కుతారు కాని మా మతంలో ఇది చాలా ప్రముఖమైంది అనగానే దాన్ని వెంట పోయేవారు ఎక్కువ అవుతున్నారు. అసలు మనది సనాతన ధర్మం. మనకు ఉన్న రామాయణాది కావ్యాలు మహాభారతం లాంటి ఇతిహాసాలు పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇలా ఎన్నో మన ధర్మాన్ని కాదు కాదు అసలు మానవులంతా ఆచరించదగ్గ ధర్మాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఉద్ఘోషించి ఉన్నారు. అలా ఋషులు దర్శించి చెప్పిన వాటిని మనం మరొక్కసారి స్మరించుకుంటే నేటి తరమూ ధర్మానికి మారుపేరుగా మారుతారని ఈ ప్రయత్నం. మహాభారతంలో ఒక స్ర్తికి ఐదుగురు భర్తలా అంటూ హేళన చేసే వర్గమూ మనలో ఉంది. అటువంటి వారికి అసలు ఐదుగురు భర్తలు కలిగి ఉండడంలో ఔచిత్యమూ, ధర్మము ఇలా వివరిస్తోంది మహాభారతం.
అది పాంచాల రాజైన ద్రుపదుని రాజ్యసభ. అక్కడ కొద్ది సేపట్లో ద్రుపదుని కుమార్తె రాజకుమారి ద్రౌపదీ స్వయంవరం జరుగనున్నది. అక్కడికి దేశ దేశాల నుండి అనేక రాజులు, రాజకుమారులు వచ్చారు. దుర్యోధనుడు, అతని తమ్ములు, కర్ణుడు, జయద్రధుడు, శల్వశకునులాంటి వారే కాకుండా కృష్ణబలరాములు కూడా ఉన్నారు.
రాజకుమార్తె సర్వాలంకార భూషితయైన ద్రౌపది తన అన్న దృష్ట్ధ్యుమ్నునితో సభకు విచ్చేసింది. అందరి చూపులూ అద్వితీయ సౌందర్యవతియైన ద్రౌపది మీదే నిలిచాయి. అప్పుడే బ్రాహ్మణ రూపంలో ఉన్న పాండవులు కూడ సభకు వచ్చారు ఆ స్వయవరంలో బ్రాహ్మణ వేషధారులై వచ్చిన పాండవులలో పాండవ మధ్యముడు చివరకు మత్స్యయంత్ర భేదనం చేసి ద్రౌపది చేతిలోని వరమాలను పొందగలిగాడు. శ్రీకృష్ణుని ఆదేశంతో ద్రుపదరాజ పరివార ఆదరంతో పాండవులు ద్రౌపదీతో కూడ తమ తల్లి అయిన కుంతీదేవి దగ్గరకు బయలుదేరారు. అర్జునుడు భీముడితో ‘‘అన్నయ్యా మనం సరదాగా, నీకు మంచి భిక్ష తీసుకుని వచ్చాము తల్లీ’ అని ద్రౌపదిని ముందు నిలబెడితే ఎలా ఉంటుంది?’’ అని అడిగాడు. ‘‘రాజకుమార్తెను భిక్ష అని చెపుతావా, వద్దు’’ అని మందలించాడు భీముడు. ‘‘పరిహాసానికి అలా అనటంలో నష్టమేముందన్నయ్యా! ఏమంటావు పాంచాలీ? అని అడిగాడు. ‘‘మీ ఇష్టప్రకారమే కానివ్వండి’’ అన్నది ద్రౌపది. ఇంటి ద్వారం వద్ద ముగ్గురూ నిలబడి, ‘‘నీకోసం ఈ మంచి భిక్ష తెచ్చామమ్మా’’ అని ముక్తకంఠంతో అన్నారు భీమార్జునులు. పనిలో నిమగ్నమై ఉన్న కుంతి ద్వారం వంక తిరిగి చూడకుండానే ‘‘మీ ఐదుగురన్నదమ్ములు సమంగా పంచుకోండని’’ ఆదేశించింది. భీమార్జునులు ద్రౌపదీ సమేతంగా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నోటమాట రాకుండా నిల్చుండిపోయారు. తిరిగి చూచిన కుంతికి ఎదురుగా ద్రౌపది దర్శనం!
అపుడు భీముడు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్న వైనాన్ని వివరించాడు. వెంటనే ద్రౌపది వంగి కుంతికి పాదాభివందనం చేసింది. అఖండ సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించింది కుంతి. అప్పుడు అర్జునుడు తల్లీ మీరు ఈమెను మమ్మల్నందర్ని సమానంగా పంచుకోమని ఆదేశించారు... ఇపుడెలా?’’ అని అన్నాడు. ఇంతలో యుధిష్టురుడు నకుల సహదేవులతో సహా అక్కడికి వచ్చాడు. సమస్య తెలుసుకున్నాడు. తన వివరణ ఇలా చెప్పాడు.
‘‘తల్లీ స్ర్తి శక్తి స్వరూపిణి. స్ర్తిలేనిదే పురుషుడు అసంపూర్ణుడు. నారి తల్లీ రూపంలో గానీ, భార్యరూపంలో గానీ ఎల్లప్పుడు ఆదరణీయురాలు. భీమార్జునులు ద్రౌపదిని భిక్షగా ప్రకటించి నారిని అవమానించారు. ఇక తల్లి పరమ గురువు. తల్లి నోట్లోంచి ఎపుడూ అస్వీకరణీయమైన ఆదేశం రాదు.’’ మ్రాన్పడి చూస్తున్న భీమాదులతో ధర్మరాజు- అమ్మ చెప్తున్న ఆదేశంలో ఏదో ఒక రహస్యం అవశ్యం దాగి ఉండవచ్చు.
ఇలా ఎక్కడైనా జరిగిన సంఘటనలున్నాయా అని వెదికితే - గౌతమ కులకన్య ‘జటిల’ యొక్క వివాహం ఏడుగురు ఋషులతో జరిగుంది. అట్లే హిరణ్యాక్షుడి కుమార్తె ‘ప్రత్తిచ్ఛి’ యొక్క వివాహం పది మంది సోదరులతో అయింది. కనుక మనకు అమ్మ ఆదేశాన్ని పాటించటమే మార్గమంటున్న తరుణంలో శ్రీకృష్ణుడూ వచ్చాడు. పాండవులంతా విషయం వివరించారాయనకు. తమ సందేహాన్ని నివృత్తి చేయమని కోరారు. దీనికి జవాబు ద్రౌపదే ఇవ్వగలదు అన్నాడా కృష్ణుడు.
పూర్వజన్మలో ద్రౌపది శివుడి గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం అయాక ఐదు వరాలడిగింది. తనకు ధర్మానికి ప్రతీకయైన మరియు సత్యానికి సంకేతాక్షరమైనవాడు హనుమంతుని వలె బలవంతుడు, పరశురాముడి వంటి ధనుర్ధనుడు, అందరికంటె అందగాడు, అందరికన్న సహనశీలియైన భర్తను ఇవ్వమని అడిగింది. మహాదేవుడు అన్ని శ్రేష్టమైన గుణాలు ఒక్కరిలో ఉండవని అంటున్నా, ఆమె తన పట్టు విడువలేదు. అందుకే ఆ మహాదేవుడే ఈ రోజు అత్తనోట్లోంచి ఇలా అందరూ పంచుకోండని పలికించాడు. ఆధునిక యుగంలో యుధిష్టురుడు ధర్మానికి చిహ్నము. ఇది ఆమె అడిగిన మొదటి వరం, భీముడు అందరికన్నా బలశాలి. ఇది ఆమె అడిగిన రెండవ వరం. అర్జునుడు సర్వశ్రేష్ట ధనుర్ధరుడు. ఇది ఆమె కోరిన మూడవ వరం. అందరిలోకి అందగాడు నకులుడు. ఇది ఆమె నాల్గో వరము. సహదేవుని మించిన సహనశీలి ఈ యుగంలో లేడు. ఇదామె ఐదవ వరం. ఇవన్నీ ఈ జన్మలో పరమేశ్వరుడు పంచపాండవుల రూపంలో ద్రౌపదికి ప్రసాదించాడు. ఇక ఈ వరాలను తిరస్కరించి ఆమె మహేశ్వరుణ్ణి అవమానించదలుచుకుంటే అది ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంది.
అనంతరం అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ‘‘అర్జునా నీవు స్వయంవరం అవశ్యం గెలిచావు. కానీ అంతమాత్రం చేత జీవించి ఉన్న ద్రౌపది భిక్ష అయినట్లు కాదు కదా! నీవు పరమగురువైన నీ తల్లితో అసత్యం చెప్పావు’’ అని కుంతివైపు తిరిగి అత్తా ‘‘అమ్మ అయినందుకు అర్థం ఏదీ చూడకుండా, ఆలోచించకుండా, అర్థంచేసుకోకుండా ఆదేశించడం కాదుకదా! నీవు నీ మాతృత్వం యొక్క మర్యాదను ఉల్లంఘించావు. అందుకే ఇకనుంచి మీ జీవితం ఒక తపస్సే కాదు, ప్రాయశ్చిత్తం కూడా’’ అని పాండవులకు కుంతికి బోధించాడు శ్రీకృష్ణుడు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
No comments:
Post a Comment