Friday, December 20, 2024

 కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ
 గానివానిగానె కాంతు రవని
 తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.

 తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
 వేగిరింప నదియు విషమెయగును
 పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!

 కోపమునను ఘనత కొంచమైపోవును
 కోపమును మిగులఁగోడు గలుగుఁ
 గోపమడచెనేని గోర్కెలునీడేరు
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.    

No comments:

Post a Comment