నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడా జయింస్తుంది. కాని బయట కుక్కను కూడా ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.
నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరుడైన బారలేదు
స్ధానబల్మిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: నీటిలో స్వేచ్ఛగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!
నీళ్ళమీదనోడ తిన్నగఁబ్రాకు
బైట మూరుడై బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: నీటిమీద ఏ ఆటంకము లేకుండ తిరిగి ఓడ భూమి పై ఒక మూరెడు కూడా వెళ్ళలేదు. ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానము మారిన పనికి రాని వాడవుతాడు.
No comments:
Post a Comment