Sunday, December 22, 2024

 *బ్రహ్మము... జగత్తు.....*

ఈ జగత్తులో అనేక వస్తువులు కనబడుచున్నవి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా , భిన్నముగా కనపడు చున్నది. ఉన్నది అంతా బ్రహ్మమే అయిన ఈ భిన్నత్వమును అర్థము చేసికొనుట ఎట్లు ?

వేదాంతము అనేక వస్తువులు లేవు అని అనదు, కాని ఉన్నది ఒకే ఒక పదార్థము అని తెలియ జేస్తుంది.
బల్ల, కుర్చీ, సోఫా వేరు వేరు వస్తువులే. వ్యవహారమున ఆయా పేర్లు ఉపయోగించ వలసినదే, ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క పనికి వినియోగించ వలసినదే. దీనినే వ్యావహారిక సత్యము అంటాము.

కాని వాటికి ఆధారమైన లేక మూలమైన పదార్థము దృష్ట్యా చూచిన అంతా చెక్కయే. ఈ దృష్టినే పారమార్థిక సత్యము అంటాము. వ్యవహారమున ద్వైతము, ద్రుష్టి యందు అద్వైతము కలిగి ఉండవలెను.

నీ కలయందు వస్తువులు నీవే,
వ్యవహారము నీవే,
అనుభవము నీవే,
కర్తవు నీవే,
భోక్తవు నీవే,
సమస్తము నీవే...

అలాగే ఉన్నది అంతా బ్రహ్మమే. వ్యవహారమున అదే విభిన్న నామరూపములతో జగత్తుగా గోచరిస్తున్నది. జగత్తుతో వ్యవహరించు, కాని అంతరంగమున ఇదంతయు బ్రహ్మమే అనే దృష్టిని కలిగియుండు.
జగత్తులోని వస్తువులు అన్ని వేరువేరు అని బోధించుటకు ఒక శాస్త్రవేత్త అవసరము లేదు. కాని ఇదంతా కదలికలో శక్తి లేదా కదలికలోని కణాలు అని గుర్తించ వలెననిన లేక అర్థము చేసికొన వలెననిన శాస్త్రవేత్త యొక్క సహాయ సహకారములు తప్పనిసరి.

అలానే జగత్తులోని భిన్నత్వమును గుర్తించుటకు వేదాంతము అవసరము లేదు. కాని ఆ భిన్నత్వములోని ఏకత్వమును గుర్తించుటకు వేదాంతము, ఆ వేదాంతమును జీర్ణింపచేసికొని అనుభవమును పొందిన గురువు యొక్క నడిపింపు తప్పనిసరి.
   

No comments:

Post a Comment