❗పుస్తకాలకు ఇక నిజంగా పండుగే!❗
✍️వెంకట్ శిద్దారెడ్డి,రచయిత, ప్రచురణకర్త
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంఖ్య దాదాపు పదికోట్లు. తెలుగులో ఒక మంచి పుస్తకం వస్తే అది కొనేవారి సంఖ్య మాత్రం వెయ్యికి అటూఇటూ. కాకపోతే ఇది అయిదేళ్ల నాటి సంగతి. మరిప్పుడో..? దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైన ఘనత ఒక తెలుగు (అమ్మ డైరీలో కొన్ని పేజీలు) పుస్తకానిదే! ఇంతలో అంత మార్పు ఎలా సాధ్యమైందంటే...
అయిదేళ్ల క్రితం వరకూ పుస్తక ప్రచురణ అంటే- రచయితలు తమ సొంత డబ్బుతో రచనలను ప్రచురించుకుని, బంధుమిత్రులకు పంచుకునేవారు. పుస్తకాల షాపుల్లో ఇవ్వగా మిగిలినవి అటకమీద దుమ్ము కొట్టుకుపోయేవి. కొద్దిమంది పేరున్న రచయితలను మినహాయిస్తే మిగిలిన వారందరిదీ ఇదే పరిస్థితి.పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో పరిస్థితి ఇంత దారుణంగా లేదు. తెలుగులోనే ఈ దుస్థితి ఎందుకొచ్చిందంటే- గత పాతికేళ్లలో ప్రధాన ప్రచురణ సంస్థలు, వాటితో పాటే పుస్తకాల షాపుల్లో అనేకం తెరమరుగయ్యాయి. ఈ పరిణామానికి కారణం- తెలుగులో పుస్తకాలు చదివేవాళ్లు తగ్గిపోవడం. 2000 కి పూర్వం,తెలుగు వారిలో పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువే. టీవీ, ఓటీటీలు వచ్చాక పుస్తకాలు చదవడం మానేశారనుకుంటే, ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామమే తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన సమస్య కాదు. ఎందుకో మరి, తెలుగువాళ్లు మాత్రం పుస్తకాలు చదవడం దాదాపుగా మానేశారు. ఫలితంగా తెలుగు ప్రచురణరంగం కుదేలైంది.
➡️" అలవాటు అక్కడి నుంచే!"
అచ్చులో పుస్తకాలు చదవడం ప్రపంచ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టిందన్నది నిజమే మొబైల్ ఫోన్,టాబ్లెట్లలో చదువు కునేలా ఈ బుక్స్, వినగలిగేలా ఆడియో బుక్స్ రావడం ఒక కారణం. అలాగని తెలుగు పాఠకులు కూడా అచ్చు పుస్తకాలు వదిలేసి ఈ-బుక్స్ వైపు వెళ్లారా అని చూస్తే, వాటిని అమ్మే అమెజాన్, కిండిల్ లాంటి సంస్థలు తెలుగు పుస్తకాలు తాము అమ్మబోమనీ, తెలుగులో చదివేవాళ్లే లేరనీ తేల్చి చెప్పేశాయి. ఏమైపోయారు మరి తెలుగు పాఠకులు? ఒక మంచి కదో, కవితో, నవలో చదవాలనే కనీస ఆసక్తి లేకుండా బండబారి పోయిందా తెలుగు వారి మనసు... అని సాహిత్యాభిమానులకు అనిపించిన మాట వాస్తవమే. కాకపోతే తెలుగువాళ్లు మరీ అంతగా తెలుగు సాహిత్యాన్ని వదిలెయ్యలేదు.వాళ్లకు కావాల్సిన దానికోసం వెతుక్కుంటూనే ఉన్నారు. ఉదాహరణకు పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రతిలిపి' అనే ఆన్లైన్ ప్లాట్ పామ్లో ఎవరైనా కదలు రాయొచ్చు.చదువు కోవచ్చు. ఇక్కడ ఎందరో తెలుగువాళ్లు తమ కథలు, కవితలు,నవలలు ప్రచురించారు. వాటిని లక్షలాది పాఠకులు చదివారు అంటే,తెలుగువాళ్లు చదువు తున్నారు. కానీ వాళ్లకి కావాల్సిందేదో ప్రచురణకర్తలు, రచయితలు అందించడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ- తెలుగు పుస్తకాలను పీడీఎఫ్ గా పంచే టెలిగ్రాం గ్రూపులు, ఇక్కడ కూడా వేలాది సాహిత్యాభిమానులు పాత తెలుగు పుస్తకాలను ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నారు.
ఇంట్లో అమ్మోనాన్నో పుస్తకం చదువుతుంటే చూసిన పిల్లలు అనుకరిస్తారు. ఆ ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు పిల్లలకు పనికొచ్చే కథల పుస్తకాలు కొనిపెడతారు. అలా మొదలుపెట్టి క్రమంగా తన కంటూ ఒక అభిరుచిని ఏర్పరచుకుని తయారయ్యే పాఠకుడు తనకు కావాల్సిన సాహిత్యాన్ని తాను వెతుక్కుంటాడు. పాతికేళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లోనూ ఒక యండమూరో, యద్దనపూడో పుస్తకంగా ఉండే వారు. లేదా ఒక చందమామో, బాలమిత్రో ఉండేది. కనీసం నానమ్మో, తాతయ్యో చెప్పే కథలైనా వినపడేవి. ఈ పాతికేళ్లలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ, కొత్తగా చదవాలనుకునేవాళ్లు మొదటి పుస్తకంగా ఏం చదవాలీ అనడిగితే చివరికి మిగిలేది'. 'అసమర్ధుడి జీవయాత్ర, మైదానం', 'మహాప్రస్థానం' లాంటి క్లాసిక్సే చదవాలనే వారు, అలాగే రాసేవాళ్ల మీదా రచయితగా గుర్తింపు పొందాలంటే సమాజాన్ని మార్చే, సమాజాన్ని ప్రశ్నించే కథలే రాయాలనే ఒత్తిడి కనిపించేది. ఫలితంగా యువ పాఠకులు క్లాసిక్స్ ని చదివి అర్ధం చేసుకోలేకో, ఇప్పటి జీవనశైలికి చెందని విషయాలను జీర్ణించుకోలేకో, ఇది మనకు సరిపోయేది కాదులే అని మొత్తంగా పుస్తకానికి దూరమయ్యారు. ప్రపంచం, సమాజం సంగతి తరవాత... ముందు నేనంటూ ఒకణ్ని ఉన్నాను. నాకంటూ ఒక బాధుంది. నా ప్రేమ విఫలమైంది. ఆ బాధను చెప్పుకోడానికి ఒక కథ రాయకూడదా? అని ఒక ఔత్సాహిక రచయిత అనుకుంటే చుట్టూ పరిస్థితేమో అందుకు భిన్నంగా ఉంది. రచయితలంతా ప్రపంచ బాధలను తమ బాధలుగా చేసుకుని రచనలు చేస్తున్నారు. దాంతో ఇలానే రాయాలేమో అనుకుని ఔత్సాహికులు మొత్తానికి రాయాలనే ఆసక్తినే చంపేసుకున్నారు.
➡️మలుపు తిప్పిన కొత్తనీరు
అలాంటి నేపథ్యం నుంచి గత అయిదారేళ్లలో తెలుగు ప్రచురణరంగం కొత్త మలుపు తిరిగింది. ఇవాళ ఒక మంచి పుస్తకం ఒక్కరోజులోనే వెయ్యి కాపీలు అమ్ముడవడం చూస్తున్నాం.ఈ మధ్యకాలంలో దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైంది ఒక తెలుగు పుస్తకం కావడం... మార్పులో భాగమే పుస్తక ప్రదర్శన జరుగుతున్న ఈ నెలలోనే దాదాపు మూడొందల దాకా కొత్త పుస్తకాలు ప్రచురితం ఆయ్యుంటాయని అంచనా.ఈ సంవత్సరం పదివేలకు పైగా అమ్ముడైన తెలుగు పుస్తకాలు కనీసం ఏడైనా ఉంటాయి.
ఒకరిద్దరి వల్ల వచ్చిన మార్పు కాదిది. పాతికేళ్లుగా తగ్గుతూ వస్తున్న పాఠకుల సంఖ్యను పెంచాలన్న, తెలుగు వారిలో సాహిత్యాభిమానాన్ని తట్టిలేపాలన్న సదుద్దేశంతో పలువురు కృషి చేశారు. వారి శ్రమ ఫలితాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.
➡️మంచి రచనలను వెతికి...
కలం పక్కన పెట్టేసిన రచయితలు కూడా ఇప్పుడు మళ్లీ ఉత్సాహంగా రచనలు చేస్తున్నారంటే దానికి కారణం- కొత్తగా వచ్చిన ప్రచురణ సంస్థలే. ఆస్వీక్షికి, అజు, అనల్ప, ఛాయ, కథాప్రపంచం, ఎలమి, రేగిల చ్చులు, జేవీ, ఝాన్సీ, ప్రభవ పబ్లికేషన్స్ లాంటి పాతికకు పైగా ప్రచురణ సంస్థలు సాహసోపేతమైన ప్రాజెక్టులు చేపట్టి తెలుగు సాహిత్య రంగం కాస్త కోలుకునేలా చేశాయి.సరికొత్త తెలుగు రచనలనే కాక వివిధ భాషల్లో వచ్చిన మంచి రచనలను వెతికి అనువాదం చేయించి తెలుగు పాఠకులకు అందిస్తున్నాయి.అలాగే కథకు, కవితకు పరిమితమై పోయిన తెలుగు సాహిత్యాన్ని నవలవైపు మళ్లించాయి. ఒక్క ఆస్వీక్షికి సంస్థే ఏడాదిలో దాదాపు నలభై నవలలు ప్రచురించింది.ఈ అయిదేళ్లలో కనీసం లక్షమంది కొత్త తెలుగు పాఠకులు తయారవడానికి కారణం కొత్త ప్రచురణ సంస్థలేనంటే అతిశయోక్తి కాదు, సోషల్ మీడియా కూడా తెలుగు సాహిత్య ప్రచారానికి తనవంతు తోడ్పాటు నందిస్తోంది. మొత్తా నికి తెలుగు ప్రచురణ రంగంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నా యన్నదీ తెలుగు సాహిత్యానికి అభిమానం దక్కుతోందన్నదీ నిర్వివాదాంశం. ఇది ఎవరూ ఊహించని, చరిత్రాత్మకమైన మలుపు
➡️యువ రచయితలదే హవా!
ఒకప్పుడు ఏటా ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి 35 ఏళ్ల లోపు రాసేవాళ్లు తెలుగులో ఎవరున్నారని వెతుక్కునే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఇంతమందిలో ఎవరికివ్వాలి! అని ప్రశ్నించుకునే పరిస్థితి గత అయిదేళ్లలోనే చాలామంది యువ రచయితలు కలంపట్టారు. వారు రాసిన పుస్తకాలు రెండో సారి, మూడోసారి ముద్రణలకు వెళ్తున్నాయి. వచ్చే సంవత్సరంలో వందమంది దాకా కొత్త రచయితలు నవలలు రాయడానికి సిద్ధ మవుతున్నారన్నది ప్రచురణ రంగంలోని వారి మాట.
@ఈనాడు దినపత్రిక నుండి సేకరణ
No comments:
Post a Comment