Friday, December 20, 2024

 *వెన్నదొంగకు నేతిదీపం !*

*ఒక లీటరు గడ్డపెరుగు గిలక్కొడితే కేవలం నలభై లేదా ఏభై మిల్లీలీటర్ల వెన్న వొస్తున్నప్పుడు మనకు లీటరు వెన్న కావాలంటే ఎన్ని లీటర్ల పెరుగు కావాల్సొస్తుందో ఊహించండి !*

*అంత పెరుగును ఎన్నాళ్ళబట్టో గిలక్కొడుతూ కూడబెట్టిన ఆ లీటరు వెన్నను మరిగిస్తే అరలీటరుకన్నా తక్కువే నెయ్యి అవుతూ మిగతా ద్రవ్యపదార్ధమంతా ఆవిరైపోయి ఎగిరిపోతోందికదా !*

*మోక్షాన్ని ప్రసాధించేందుకై కోట్లకొలది ప్రాణులనుండి తనకు అత్యంత ప్రియమైన భక్తులను ఎంచుకొంటున్న రీతిని - తన పరమతత్త్వానికి సంకేతాన్ని - ఉపమానముగా (figuratively) మనకు తెలియపరుస్తున్నాడు శ్రీకృష్ణపరమాత్మ మనలను భక్తితో పరవశింపజేసే వెన్నను దొంగలించుతున్న తన లీలలో !!*

*ఎలా అంటే,*

*ఎన్నో లీటర్ల పెరుగునుండి అతి తక్కువ పరిమాణంలో వెన్న - అటుపిమ్మట ఆ అల్ప వెన్న నుండీ మరింత అల్ప పరిమాణంలో లభ్యమౌతున్న నెయ్యిలా కోట్ల సంఖ్యలోనున్న మనుష్యులనుండి అత్యంత అల్ప సంఖ్యాకులే పరిపక్వతను పొందేందుకై ప్రయత్నిస్తుంటే -*

*పెరుగునుండి వెన్నగా మారగల్గుతుంటే -*  

*అట్లు పరిపక్వతపొందిన మనుష్యులనుండి మరింత అల్ప సంఖ్యలో -*

*అంటే వెన్న మరింత తక్కువ పరిమాణంలో నెయ్యిగా రూపాంతరమొందినట్లు -*

*శ్రీకృష్ణపరమాత్మను యదార్ధంగా - సర్వవిశ్వవ్యాప్తమేకాక సర్వజీవుల ఆత్మగా (భగవద్గీత 10:20) యెరుగగల్గుతున్నవారుకూడా -*

*మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః*

*వేలవేలల్లో ఒక్కరు చొప్పున అంతే అల్ప సంఖ్యాకులని*

*వెన్నను దొంగలించుతూ తింటున్న లీలలో పరోక్షంగా మనకు బోధపరుస్తున్న ఆత్మజ్ఞానమునే*

*భగవద్గీత (7:3) శ్లోకములో ఇలా వర్ణించాడని స్పష్టమౌతోందికదా!*

*(2) పరమాత్ముడను విగ్రహ మాధ్యమమున ఆరాధిస్తూ నెయ్యి శ్రేష్టమన్న భావనతో నేతిదీపాన్ని అర్పిస్తున్నామంటే :* 

*ప్రమిదలో ఉన్న నెయ్యే దీపపు వొత్తి మాధ్యమాన్న ఆహుతి చెయ్యబడుతూ సర్వవ్యాప్త అవ్యక్త అక్షర పరమాత్మకేకదా అర్పింపబడుతోంది.  ఎందుకంటె, మనం పూజిస్తున్న భగవత్ప్రతిమ నేతి దీపాన్నిగానీ, ఆ దీపమందు ఆహుతి అవుతున్న నెయ్యినిగాని స్వీకరించలేదుకదా !*

*ఇందులో గూడార్ధమేమిటంటే :* 

*పాలనిండా గుప్తంగా వ్యాప్తమై ఉన్న నెయ్యేకదా పాలయొక్క సారం – అదే, బలమైన ఆహారం.  అదేవిధంగా మనఃశరీరేంద్రియముల నిలయమైన ఈ దేహాన్ని చైతన్యవంతంగా జీవింపజేస్తున్నది అజనిత శాశ్వత నిర్వికల్ప సత్యం, సత్ - నాభావో విద్యతే సతః (2:16) అని అనబడే పరమాత్ముని అంశయే మనయొక్క సారంకదా (15:7) !*

*మనలను చైతన్యముజేస్తున్న పరమాత్ముని ఆ అంశాన్నే పరమాత్ముని సేవార్థమై ఆహుతి చేస్తున్నామని నేతి దీపాన్ని సమర్పించుకొంటూ ఆ పరమాత్మునకు విన్నవించుకొంటున్నామని అర్థమొస్తోందికదా.*  

*అందుకే, మనం నిత్యం చేస్తున్న పూజ, సంధ్యా వందనము, యోగధ్యాన ప్రక్రియ అన్నీనూ మన ఈ జీవితాన్నే అర్చనలా / పూజలా సమర్పించుకొంటున్నామని విన్నవించుకొంటున్న భౌతిక ప్రక్రియలు మాత్రమేనని గ్రహిస్తూ,*

*కర్తవ్యధర్మ ఆచరణను సిద్ధిని పొందేందుకై యథార్థ పూజలా స్వీకరిస్తూ (18:46) భగవత్ప్రతిమ పూజాయొక్క విధివిధానమంత శ్రద్ధగా నిస్వార్థంతో నిజమైన యోగిలా కర్తవ్యధర్మ ఆచరణను ఆచరించమంటున్నాడు శ్రీకృష్ణపరమాత్మ పలు శ్లోకాలలో !*

*ఇదే ఈ శ్లోకములో ఇలా చెప్పబడింది చూడండి :*

*దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే*
*బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్యతి. (4:25)*

*ఈ బోధనలో ఉన్న భావాలు :* 

*కొందరు యోగులు దేవతారాధన రూపమైన (దైవ)యజ్ఞమును చక్కగా అనుష్టించుచున్నప్పుడు, అంటే, నిత్యం చేస్తున్న విగ్రహ పూజ, సంధ్యా వందనము, యోగధ్యాన ప్రక్రియలో కొంతసేపు నిమగ్నమైతే చాలని అల్పంతో కొందరు సరిపెట్టుకొంటున్నప్పుడు,*

*మరికొందరు యోగులు జీవమును బ్రహ్మముతో ఐక్యము చేయ సంకల్పముతో - జీవబ్రహ్మైక్య భావముతో - తమనుతాము (కర్తవ్యకర్మ అనే) యజ్ఞములో హోమము చేసుకొనుచున్నారు.*

*అంటే తాము భౌతిక దేహమందున్న ఆ అవ్యక్త పరమాత్ముని అంశాలమేనన్న ఆత్మజ్ఞాన ఎరుకతో తమ కర్తవ్యధర్మాన్ని, ప్రవర్తనను యజ్ఞమంత పవిత్రమైనవిగా బాధ్యతతో స్వీకరిస్తూ తమనుతామే ప్రాణులయందు ఆత్మరూపాన్న ఉన్న ఆ పరమాత్ముని సేవలో సమర్పించుకొంటున్నారు !*

*ఇట్లు తమకు తాము సమర్పించుకొంటున్నవారు అత్యంత అరుదైనవారని, పాలలో నెయ్యిలా వేల వేలల్లో ఎవరో ఒక్కరే అని 7:3  శ్లోకములో పేర్కోంటున్నాడు శ్రీకృష్ణపరమాత్ముఁడు.*

*మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే*
*యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment