☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
71. సహోసి సహోమయి దేహి
నువ్వు సహస్సువు. నా యందు సహశ్శక్తిని ఉంచు-ప్రసాదించు(ఋగ్వేదం)
సహించే శక్తి భగవత్స్వరూపం. ఈ శక్తితో విశ్వమంతా వ్యాపించినవాడతడు.
అందుకే ఆ శక్తిని మన యందు ప్రతిష్ఠింపచేయమని ప్రార్థించాలి.
విశ్వంలో గ్రహనక్షత్రాదులన్నీ ఆయా స్థానాల్లో పదిలంగా ఉండడానికి కారణం పరమాత్ముని సహశ్శక్తియే.
సూర్యభగవానుడు ఆయా గ్రహాలను వాటి వాటి స్థానాలలో తన ఆకర్షణశక్తితో సహిస్తున్నాడు. పృథ్విలో ఈ సహశ్శక్తి మహాపర్వతాలను, నదీనదాలను, అపారమైన ప్రాణకోటిని ధరిస్తోంది. తట్టుకోగలిగే శక్తియే పట్టుకోగలదు.
ఈ సహనశక్తి చేతనే 'క్షమా' అని భూమికి పేరు. వాల్మీకి శ్రీరాముని వర్ణిస్తూ 'క్షమయా పృథివీ సమః' అని పేర్కొన్నాడు (సహనంలో భూమితో సమానుడు).ఇంక సీతమ్మ భూపుత్రిగా ఆ ఓరిమినే ప్రదర్శించింది.
కష్టకాలం వచ్చినప్పుడు ఓరిమి చాలా ఉపకరిస్తుంది. ధర్మ గుణాలలో ఓరిమి
ఒకటి. 'తేజః క్షమా ధృతిః శౌచం' (తేజస్సు, సహనం, ధైర్యం, శుచి) దైవీ గుణాలుగా గీతాచార్యుడు వివరించాడు. ఎదురు తిరిగి విజృంభించే శక్తి కలిగి ఉన్నప్పటికీ, ధర్మ మెరిగి ఓరిమి వహించడం ఉత్తముల లక్షణం. దేవ సమాన విక్రమం కలిగినప్పటికీధర్మరాజాదులు ఓరిమిని వదల లేదు. అరణ్యాలలో తపశ్శక్తిని పెంచుకున్నారు.
కలిసి రాని కాలాన్ని తపస్సుగా వినియోగించుకున్నారు. నిశితమైన ప్రజ్ఞ కలవారి ప్రవర్తన అలా ఉంటుంది. ఎవరూ పలకరించని "ఏకాకితనం" అనే దైన్యస్థితిగా కాకుండా, “ఏకాంతం” అనే యోగంగా మలచుకోగలరు. దానిని తపస్సుగా
వినియోగించుకోగలరు. ఈ కారణం చేతనే పాండవులు అరణ్యవాసాన్ని దివ్యశక్తులు సమకూర్చుకొనే తపఃకాలంగా మార్చుకున్నారు.
కైకేయి మాటని గ్రహించి, పితృసత్యాన్ని నిలబెట్టడానికి వనవాసాన్ని సహించాడు
శ్రీరాముడు. తద్వారా ఋషుల రక్షణ వంటి ఘనకార్యాలు సాధించాడు. శబరి వంటి భక్తులు ఓరిమితోనే యోగాన్ని కొనసాగించి ఫలాన్ని పొందారు.
మనస్సు ఉద్రేకాల నిలయం. ఉద్వేగాల వలయం. బైట పరిస్థితులకి స్పందించి వెంటనే ఉద్రేకపడేవాడు, ఆ ఉద్రేకంలో జరిగే చిన్న పొరపాటుకి బహుకాలం దుష్ఫలాల ననుభవించక తప్పదు. నిత్యజీవితంలో సైతం ఇందుకు తార్కాణాలు కనిపిస్తాయి. కామం, క్రోధం, శోకం... ఈ మూడు ఉద్రేక హేతువులు. ఇవి
చెలరేగినప్పుడు ఓరిమి వహించడం, ఓరిమితో వీటిని చెలరేగకుండా నిగ్రహించగలడం విజ్ఞత.
ఓరిమి వదిలి క్రోధంతో అంబరీషుని మట్టుపెట్టదలచుకున్న దుర్వాసుడు, ఆ ఫలితంగా విష్ణుచక్రం బారినుండి తప్పించుకోడానికి ముప్పుతిప్పలు పడ్డాడు.కామాదులను సహించలేక విశ్వామిత్రాదుల తపస్సులే చెదరిపోయాయి. అందుకే
కార్యసిద్ధికి సహనం ప్రధానం. 'ఓర్చినమ్మకి తేటనీరు' అని సామెత. సీతమ్మ స్వయంగా రావణుని దగ్ధం చేయగలిగి కూడా, మొత్తం రాక్షస వంశ నిర్మూలన ద్వారా లోక క్షేమం కలిగించాలని సహనాన్ని వహించింది. రామ సంకల్పమెరిగి హనుమంతుని సైతం సహనంతో ఉండమని బోధించింది.
పరాత్పరుని దివ్యమైన సహనాన్ని తనకు ప్రసాదించమని పై మంత్రం ద్వారా ప్రార్థించడంలో ఆంతర్యమిదే.
అయితే ఈ దివ్యగుణం యొక్క మరియొక కోణాన్ని కూడా పరిశీలిద్దాం. 'సహశ్శక్తి' అంటే తట్టుకొనే శక్తిమాత్రమే కాదు. "ఎదుర్కొనే శక్తి" అని కూడా అర్థం. ఎంతటి శత్రువునైనా ఎదుర్కొని పోరాడగలిగే పటిమను 'సహశ్శక్తి' అని గ్రహించవచ్చు. ఈ అర్థంలో స్వీకరిస్తే...“పోరాట పటిమను ప్రసాదించమ'ని పై మంత్రాన్ని
అన్వయించవచ్చు.
'ఓరిమి'కి కూడా ఒక హద్దు ఉంటుంది. 'ధర్మం' అనే పరిధితో దానిని నిర్వచించాలి.హద్దు దాటిన ఓరిమి అధర్మం. రావణుడు సీతను అపహరిస్తే రాముడు 'ఓరిమి'ని
చూపలేదు. అంతటి 'క్షమయా పృథివీ సమః' అయిన రాముడు, 'కాలాగ్ని సదృశఃక్రోధే' (క్రోధం వస్తే కాలాగ్నిసముడు) అని నిరూపించాడు. అరణ్యాజ్ఞాతవాసాల
తరువాత పాండవులు ప్రతాపాన్ని ప్రదర్శించారు. ప్రతి గుణాన్ని ఔచిత్యమెరిగి ప్రకటించడమే ధర్మం. అప్పుడే అది దివ్యగుణమౌతుంది. ఆధ్యాత్మిక సాధనలో ప్రతికూల
పరిస్థితుల్ని ప్రతిఘటించగలగే పటిమ ఉండాలి. తన సాధనకు అడ్డు తగిలే
కామక్రోధాది దుర్గుణాలని ఎదుర్కొనగలగడం పెద్ద పోరాటం.
ప్రతికూలాలని గమనించి, ఎదుర్కొని అనుకూలంగా మలచుకోగలిగే సహశ్శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థిద్దాం.
No comments:
Post a Comment