Vedantha panchadasi:
వివేకే ద్వచత మిథ్యాత్వం యుక్త్యచవేతి న భణ్యతామ్ ౹
అచింత్యరచనాత్వస్యానుభూతిర్హి స్వసాక్షికీ ౹౹252౹౹
252. కేవలము తర్కము చేత కలిగిన వివేకమునందు మాత్రమే ద్వైతము మిథ్యయని సిద్ధించుచున్నది,అనుభవమున అట్లు సిద్ధింపదు అని అనవలదు. ఈ ప్రపంచము యొక్క ఊహాతీతము అద్భుతము అయిన స్వరూపమును నిత్యము అనుభవించుచునే ఉన్నాము.
వ్యాఖ్య:-
"అంచిత్యరచనా రూపమైన మిథ్యత్వానుభవానికి తనకు తానే సాక్షి"
ఈ జగత్తునకు జగత్తునందలి వ్యవహారములకు తర్కబద్ధమైన ఆధారమేమీ లేదనుట అనుభవైకవేద్యమే.
వివేక విచారణ చేసిచూస్తే ద్వైతమిథ్యాత్వం అనేది యుక్తిద్వారా మాత్రమే రుజువు అవుతుంది,అనుభవపూర్వకంగా రుజువుకాదు అని అనవచ్చు.కానీ,
అట్లా. అనవద్దు.
ఈ మాయాకార్యము అద్భుతమే. తార్కికమైన ఆధారము లేకపోవుటచే ఊహకును అతీతమే.అయినను అనుభవమున ఉన్నదే.
చైతన్యరూపమగు ఆత్మయు ఈ జగత్తును చూస్తున్న సాక్షిగ అనుభవమున ఉన్నదే.అంచిత్య రచనారూపం కల ఈమిథ్యత్వానికి (అసత్యానికి)సంబంధించిన అనుభవంలో ప్రతివానికీ తన ఆత్మయే సాక్షి !
ఇతర విషయములు అనుభవమునకు వచ్చునట్లు ఆత్మ అనుభవమునకు రానిమాట సత్యమే.అయిపను "నేను" లోని ఆత్మ అనుభవమున లేదనుట ఎట్లు ?
ద్వైతరచనను గూర్చిన ఆలోచన అసంభవమనే విషయంలో ఎవని అనుభవం వానికే సాక్షిగా ఉంటుంది.
ఆత్మ ఆకాశములో శూన్యత్వము.
చలించు వస్తువులన్నింటిలోనం చలనము.ఇది భూమియందు ఘనత్వము.ఇది అగ్నిలో వేడిమి.
ఇది చంద్రునిలో చల్లదనము, లోకముల అస్తిత్వమే ఇది.
ఈ విశిష్టగుణములన్నియు తదనురూపములగు పదార్థములలో ఉన్నట్లే,ఇది గూడ ప్రభువుగా దేహమునందుండును.
సర్వత్ర సత్త (అస్తిత్వము) ఉన్నట్లే, సర్వకాలములలో కాలము ఉన్నట్లే ఈ ఆత్మకూడ సమస్తమగు భౌతిక మానసికశక్తులతో గూడ సర్వ శరీరములయందుండును.
చిదప్యచింత్య రచనా యది తర్హ్యస్తు నో వయమ్ ౹
చితిం సుచింత్యరచనాం బ్రమోనిత్యత్వకారణాత్ ౹౹253౹౹
253. చైతన్యము కూడా ఊహాతీతమైనదే కదా,
(కనుక అది కూడా మిథ్య కదా) అనినచో నిజమే ఊహాతీతమైనదే. కాని అది శాశ్వతమగుటచే ఊహింపదగినదే అందుము.
ప్రాగభావో నానుభూతశ్చితేర్నిత్యా తతశ్చితిః ౹
ద్వైతస్య ప్రాగభావస్తు చైతన్యే నానుభూయతే ౹౹254౹౹
254. చైతన్యము ఒకప్పుడు లేకుండెననుట,లేకపోవుట అనుభవమునకే రాదు కనుక అది శాశ్వతము నిత్యము.ద్వైతము లేకుండుటను చైతన్యము
(సుషుప్తి యందు)అనుభవించును.
నృసింహ ఉత్తర తాపినీయ ఉప.2.
ప్రాగభావయుతం ద్వైతం రచ్యతే హి ఘటాదివత్ ౹
తథాపి రచనాఽ చింత్యా మిథ్యా తేనేంద్రజాలవత్ ౹౹255౹౹
255. ద్వైతజగత్తు ఒకప్పుడు లేక పిదప సృష్టింపబడుచున్నది, ఒకప్పుడు లేని కుండలు మొదలగునవి చేయబడినట్లే. అయినను అది ఎట్లు రచించ బడినదో సృష్టింపబడినదో ఆ విషయము ఇంద్రజాలము వంటిది. కనుకనే అది ఊహాతీతము మిథ్య.
వ్యాఖ్య:-మిథ్యా జగత్తులాగానే చిద్రూపంకూడా అచింత్యరచన కలదే (ఆలోచించటానికి శక్యంకాని నిర్మాణం కలదే)కాబట్టి,ఆ చిద్రూపం మాత్రం మిధ్య ఎందుకు కాకూడదు ? అంటే , సమాధానం -
ఆత్మయే గనుక అచింత్య రచనారూపం కలదైతే నిత్యమైన పదార్థాల రచన జరగదు గదా!
ప్రాగభావంతో కూడినట్టి (ముందుగా లేనిదైనట్టి) ఆచింత్య రచనారూపం కలదే మిథ్య.
పరిణామశీలత మిథ్యకు లక్షణము.వికారము లేకపోవుట
ఆత్మకు , సత్యమునకు లక్షణము. కనుక ఆత్మ కూడా ఊహాతీతమైనను అవికారి అగుటచే మిథ్య అనుటకు వీలులేదు.
తర్కము కొరకు ఆత్మను అవికారియగు ఊహాతీతమైన రచన అనవచ్చును.
నిజముగ దానిని గ్రహించుటకు వాక్కు మనస్సు అసమర్థములు కదా !
చిత్ కి నిత్యత్వం ఎట్లా ఉంది ?అంటే,అద్వైతంలో అంతకంటె ఇతరమైన చేతనమేదీ లేదు కాబట్టి
చిత్(స్వయం ప్రకాశమైన చైతన్యం) యొక్క ప్రాగభావం(ముందుగా లేకపోవటం)అనేది ఎవరికీ అనుభవంలో లేదు.కాబట్టి,చిత్ అనేది నిత్యమే !
ఒకవేళ చిత్ కి ప్రాగభావం ఉన్నదని ఎవరైనా అంటే,ఆ ప్రాగభావాన్ని అనుభవించే వాడెవడు?
చేతనుడా?జడమా?
చిద్రూపానికి తప్ప జడానికి అనుభవం లేదు గదా!
అద్వైతంలో రెండవ చిద్రూపమనేది లేదు.అన్యచేతనమనేది అనుభవించటమంటూ ఉంటే,ఆ అనుభవింపబడేది జడమై ఉండాల్సిందే!
"అనుభవానికి విషయం ఎప్పుడూ జడమే"!
ఒకవేళ తన ప్రాగభావాన్నే అనుభవిస్తున్నాడని అంటే,తన "అభావాన్ని" తాను అనుభవించటం అనేది ఎన్నడూ ఉండదు.ద్వైతానికే ప్రాగభావ మనేది ఉంటుంది.
ఆ ద్వైత ప్రాగభావాన్ని చేతనుడు అనుభవిస్తున్నాడు.సుషుప్తిలోని ద్వైతభావం సాక్షిద్వారా తెలుసుకోబడుతోంది.
" తమసః సాక్షీ సర్వస్య సాక్షీ"
--నృ.ఉ.తా--2
అనే శ్రుతివాక్యం ఈ విషయానికి ప్రమాణం.
ఈ ద్వైత మిథ్యత్వానికి రుజువు--
ప్రాగభావంతో కూడిన ద్వైత నిర్మాణం ఘటాదుల్లాగా జరుగుతుంది.
ముందుగా లేనట్టి ఘటం తయారైనట్లు!ఒకప్పుడు లేని కుండలు మొదలగునవి చేయబడినట్లే.ద్వైతరచన ఎట్లు రచించ బడినదో, సృష్టింపబడినదో ఆ విషయము ఇంద్రజాలమువంటిదే కనుక ఊహాతీతము,మిథ్యే.
అయినప్పటికి ద్వైతరచన అనేది అచిత్త్యమైనదే!
ఆలోచించి తేలుసుకోవటానికి శక్యంకానిదే !
అందుచేతనే ఇంద్రజాల ప్రాసాదంలాగా ద్వైతం అనేది మిథ్యావస్తువే !
ఏ రచింపబడే వస్తువుయొక్క రచన అచింత్యంగా ఉంటుందో అది మిథ్య అనిపించుకొంటుంది.
No comments:
Post a Comment