Monday, January 6, 2025

 *రాతిపులుసు (విదేశీ జానపద కథ)* 
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
**************************
ఒక సైనికుడు కొద్ది రోజులు సెలవు తీసుకొని వాళ్ల సొంత ఊరికి బయలుదేరాడు. అప్పట్లో ఇప్పట్లా రైళ్లు బస్సులు ఏమీ లేవు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎంత దూరమైనా నడిచి వెళ్లాల్సిందే. వాళ్లది చిన్న గ్రామం. రాజధానికి చాలా దూరం. నడుస్తూ నడుస్తూ మధ్యలో దారి తప్పిపోయాడు.
ఉదయం నుంచీ ఏమీ తినకపోవడంతో బాగా ఆకలవుతావుంది. దాహం చంపేస్తా ఉంది. కానీ దారిలో ఎక్కడా చిన్న చెట్టు గానీ, నీటి చలమ గానీ కనబడడం లేదు. నీరసంగా ఎండకు కాళ్ళు ఈడ్చుకుంటూ పోతావుంటే కాసేపటికి దూరంగా ఒక ఊరు కనపడింది.  దాన్ని చూడగానే సైనికునికి ప్రాణం లేచి వచ్చింది. "హమ్మయ్య... ఊరు అన్నాక మనుషులు ఉంటారు. మనుషులన్నాక జాలీ దయా ఉంటాయి. అదీగాక దేశాన్ని కాపాడే సైనికులు అంటే అందరూ గౌరవిస్తారు. ఎవరో ఒక పుణ్యాత్ముడు కమ్మని విందు భోజనం కడుపునిండా పెడతాడు" అనుకున్నాడు సంబరంగా.
కానీ ఆ ఊరు అన్ని ఊర్లలో మామూలు ఊరు కాదు. పెద్ద పీనాసిపురం. ఎదుటివాడు చస్తావున్నా సరే ఎంగిలి మెతుకు విదిలించరు. లాభం ఉంటే తప్ప ఎదుటివారిని పలకరించరు. పైసల కోసం ప్రాణాలు వదిలేసే రకం. వాళ్ళు సైనికున్ని చూడగానే ఎందుకైనా మంచిదని కొందరు తలుపులు మూసుకున్నారు. మరికొందరు తలలు పక్కకు తిప్పుకున్నారు.
"ఆకలైతా ఉంది తల్లీ... తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి" అన్నాడు ఒక ఇంటి ముందు నిలబడి.
"మాకే బతకడానికి చానా కష్టంగా ఉంది. ఒక పూట తింటే రెండు పూటలు పస్తు పడుకుంటున్నాం. ఇంక నీకు ఎక్కడ పెడతాం" అనిందామె.
ఇంకో ఇంటి తలుపు కొట్టాడు.
"ఈసారి పంటలు సరిగా పడలేదు నాయనా... ఊరంతా కరువే. మేమే ఎవరన్నా సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నాం. ఇంక నీకేమి పెడతాం" అన్నారు ఆ ఇంటివాళ్ళు. 
ఏ ఇంటి తలుపు కొట్టినా ఉత్త చేయి చూపించేటోళ్లే తప్ప మనసారా రమ్మని పిలిచేటోళ్లు ఎక్కడా కనపడలేదు. దాంతో సైనికునికి ఆ ఊరిలో తనకు అన్నం దొరకదని అర్థమైంది. కానీ అప్పటికే నడిచీ నడిచీ శక్తి మొత్తం తగ్గిపోయింది. ఇంకో ఊరు ఎంత దూరం ఉందో ఏమో... అంతవరకు తాను నడవగలడో లేదో తెలీదు. ఎలాగబ్బా... అని ఆలోచిస్తా వుంటే తాను చిన్నప్పుడు చదువుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి. "ఉపాయం ఉన్న మనిషి ఎడారిలో కూడా నీళ్లు పుట్టించగలడు. తుఫానులో సైతం దీపం వెలిగించగలడు. పచ్చి పిసినారి దగ్గర కూడా అప్పు సంపాదించగలడు. కత్తి కంఠం మీద పెట్టినా తెగేలోపల తప్పించుకోవడానికి మార్గం ఆలోచించగలదు" అని.
ఆ మాటలు గుర్తుకు వచ్చేసరికి అతనిలో శక్తి కదం తొక్కింది. బుర్ర పాదరసంలా పరుగెత్తడం మొదలుపెట్టింది. చుట్టూ చూస్తావుంటే ఒక బావి దగ్గర ఒక పెద్ద నీళ్లబాన కనపడింది. దానిని చూడగానే అతని మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఆ సైనికుడు తెలివైనవాడే గాక మంచి వంటగాడు కూడా. అతని చేయిపడితే పప్పన్నం కూడా పరమాన్నంలా మధురంగా మారిపోతుంది. ఉత్తన్నం కూడా బిరియానీలా గుమగుమలాడుతుంది. ఒకేసారి వందమందికైనా సరే ఏమాత్రం అలసట లేకుండా చిరునవ్వుతో చిటికెలో చేయగల నేర్పరి.
నెమ్మదిగా భుజాన ఉన్న సంచీ ఒక చెట్టు కింద దించాడు. మూడు రాళ్లు పెట్టి పొయ్యి తయారు చేశాడు. బావి దగ్గర ఉన్న పెద్ద బాన తీసుకొని వచ్చి దాని మీద పెట్టాడు. కట్టెముక్కలు ఏరుకొచ్చి పొయ్యిలో పెట్టాడు. పక్కనే ఉన్న బావిలోనుంచి నీళ్లు తోడుకొని వచ్చి బానలో సగం వరకు పోశాడు. అక్కడున్న ఒక లావు గులకరాయిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాడు. అదంతా చుట్టుపక్కల ఉన్న జనాలు ఆశ్చర్యంగా, కళ్ళు ఆర్పకుండా, నోళ్ళు తెరిచి చూస్తా ఉన్నారు.
సైనికుడు ఒక ముసలామె ఇంటి దగ్గరికి పోయి "అవ్వా... కొంచెం అగ్గిపెట్టె ఇస్తావా. పులుసు చేసుకోవాలి" అన్నాడు.
దానికి ఆమె ఆశ్చర్యంగా "ఏం పులుసు చేస్తా ఉన్నావు నాయనా... ఏమున్నాయి నీ దగ్గర" అంది.
"రాతి పులుసు అవ్వా" అన్నాడు సైనికుడు చిరునవ్వుతో.
"రాతి పులుసా... నేనెప్పుడూ వినలేదే. ఎలా చేస్తారు దానిని" అంది ఆశ్చర్యంగా. సైనికుడు చిరునవ్వు నవ్వి "అవ్వా... మేము సైనికులం కదా. యుద్ధాల కోసం ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్నిచోట్ల తినడానికి తిండి కూడా దొరకదు. అటువంటి సమయాల్లో మా ప్రాణాలు కాపాడుకోవడానికి రాళ్లతో రాతి పులుసు చేసుకోవడం ఎలాగో మాకు ప్రత్యేకంగా నేర్పుతారు. ఇది కేవలం సైనికులకు మాత్రమే తెలిసిన రహస్యం. ఎవరికీ చెప్పొద్దు" అన్నాడు నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినపడేలా గుసగుసగా.
రహస్యమని ఎప్పుడైతే చెప్పాడో ఆ మరుక్షణమే అది ఒకరినుంచి మరొకరికి పాకుతూ నిమిషాల్లో చుట్టూ ఉన్న అందరికీ చేరిపోయింది. అందరూ ఆసక్తిగా రాళ్ల పులుసు ఎలా చేస్తాడా అని కళ్ళు తిప్పకుండా అటువైపే చూడసాగారు.
సైనికుడు మంట వెలిగించాడు. నీళ్లు బాగా మరిగినాక గులకరాయి తీసి బాగా తుడిచి అందులో వేశాడు. గాల్లో ఏవో మంత్రాలు చదువుతూ, మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ, కొంచెం నీళ్లు తీసి చేతిలో వేసుకుని రుచి చూడసాగాడు. వేడినీళ్లు కాగుతున్న వాసన అక్కడంతా అలముకుంది. ఇదంతా చూస్తావున్న ఎదురింటి ఆయన ఇక తట్టుకోలేక దగ్గరికి వచ్చి "ఎలా ఉంది రుచి. బాగుందా" అన్నాడు.
"బాగుంది కానీ... కొన్ని ఉల్లిపాయలు. నూనె వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏం చేద్దాం... నా వద్ద అవి లేవు" అన్నాడు.
వెంటనే అతను "నాకు కూడా కొంచెం పులుసు ఇస్తానంటే నేను తెచ్చిస్తా "అన్నాడు.
"దానికేం భాగ్యం. తప్పకుండా ఇస్తాను" అన్నాడు. వెంటనే అతను ఉరుక్కుంటా పోయి కొన్ని ఉల్లిపాయలు, నూనె తీసుకొని వచ్చి పక్కన కూర్చున్నాడు. సైనికుడు ఆ వేడి వేడి నీళ్లలోకి ఉల్లిపాయలు, నూనె వేశాడు. దాంతో కమ్మని వాసన చుట్టూ రాసాగింది.
అగ్గిపెట్టె ఇచ్చిన ముసలామెకు నోట్లో నీళ్లూరి "నాయనా... ఈ రాతి పులుసు ఎట్లా ఉంటుందో నా జన్మలో ఎప్పుడు చూడలేదు. నాకు కూడా కొంచెం ఇస్తావా" అంది దగ్గరికి వచ్చి.
దానికా సైనికుడు కాసేపు ఆలోచించి "అవ్వా... ముగ్గురికి అంటే సరిపోదు. సరే ఒక పని చెయ్. నీ దగ్గర ఏవైనా కూరగాయలు ఉంటే తీసుకురా. వాటిని కూడా కలుపుదాం. అప్పుడు మనందరికీ సరిపోతుంది. కమ్మగా తాగుదాం" అన్నాడు. వెంటనే ఆమె "మా ఇంట్లో బంగాళదుంపలు, క్యారెట్లు ఉన్నాయి. తెస్తా ఉండు" అంది.
సైనికుడు ఆమె తెచ్చిన బంగాళదుంపలు, క్యారెట్లు శుభ్రంగా కడిగి ముక్కలు కోసి అందులో వేశాడు. దాంతో అది చిక్కగా మారసాగింది. వాసన మరింత కమ్మగా రాసాగింది. ఇదంతా చూస్తావున్న ఒక యువకుడు నెమ్మదిగా దగ్గరికి వచ్చి "నాక్కూడా ఏమైనా మిగులుతుందా పులుసు. వాసనకి నూరూరిపోతావుంది" అన్నాడు.
దానికి ఆ సైనికుడు "దానిదేముంది... కాకపోతే చారు ఇంకా రంగు రాలేదు. మీ ఇంట్లో ఏమన్నా పసుపు, కారం, ఉప్పు, మసాలా దినుసులు లాంటివి ఉంటే పట్టుకురా. నీకు కూడా వాటా ఇస్తా" అన్నాడు. అలా ఒకరిని చూసి మరొకరు "మాకు కూడా కావాలి" అంటూ ఒక వస్తువు తీసుకురాసాగారు.
చింతపండు, గరం మసాలా, మునక్కాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కూరగాయలు... అలా అందులో చేరుతున్న కొద్దీ వాసన గుమగుమలాడసాగింది. ఆ వాసనకు అందరి నోట్లో నీళ్లు ఊరసాగాయి. లొట్టలు వేసుకుంటా చుట్టూ చేరి "ఎప్పుడెప్పుడు పులుసు పూర్తవుతుందా... ఎప్పుడెప్పుడు తాగుదామా" అని ఎదురు చూడసాగారు.
చారు చిక్కగా అద్భుతంగా తయారు కాసాగింది. సైనికుడు గరిటతో బాగా కలియతిప్పి, కొంచెం అరచేతి మీద వేసుకొని రుచి చూసి "ఆహా అద్భుతంగా ఉంది. తాగడానికి పాత్రలు తెచ్చుకోండి" అన్నాడు. అంతే అందరూ పరుగు పరుగున పోయి పాత్రలు తెచ్చుకుని వరుసలో నిలబడ్డారు.
సైనికుడు అందరికీ తలా ఇంత పోసి తాను కూడా కడుపునిండా త్రాగాడు. బానలో అడుగున ఉన్న రాయి తీసుకొని కడిగి జోబిలో వేసుకున్నాడు. చారు తాగిన వాళ్లందరూ దాని రుచికి మైమరిచిపోయారు. "మా జీవితంలో ఇంత రుచికరమైన చారు ఎప్పుడూ తాగలేదు. నీవు ఇక్కడికి రావడం వల్లనే మాకు ఈ అదృష్టం పట్టింది" అని మెచ్చుకున్నారు.
కడుపు నిండిన సైనికుడు 'రాతి పులుసుకు' మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ ఊరి వాళ్లకు వీడ్కోలు పలికి, తన ఊరికి దారి కనుక్కొని ఉత్సాహంగా బయలుదేరాడు.
**************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment