Vedantha panchadasi:
కియన్తం కాలమితి చేత్ఖేదోఽ యం ద్వైత ఇష్యతామ్ ౹
అద్వైతే తు న యుక్తోయం సర్వానర్థనివారణాత్ ౹౹248౹౹
248. ఇట్టి అభ్యాసము ఎంతకాలము చేయవలయుననినచో ఇట్టి అసహనము ద్వైత విషయములు సాధించుటయందు సరియే కాని సకల దుఃఖములను నివారించే అద్వైతమున తగదు.అద్వైతము సిద్ధించే వరకు విసుగు లేక అభ్యాసము చేయవలెనని భావము.
వ్యాఖ్య:- ముముక్షువైన వాడు వివేక విమర్శనాభ్యాసాదుల్తో వాసనా సంస్కారాల్ని ఎంతకాలం అణచే అభ్యాసం చేయాలి ?
ఈ విచార విమర్శనం ఎంతకాలం పాటు సాగాలి?
అంటే,
ఎంత కాలంపాటు చేసినా ద్వైతంలో కష్టంగా ఉంటుంది గాని అద్వైతంలో కష్టమనేది ఉండదు.ఏ విధమైన దుఃఖమూ కలగదు. కాబట్టి,అద్వైత విషయంలో ఈ విధమైన ఆలోచన సముచితం కాదు.
ఎందుచేత ?
అద్వైత తత్త్వంవల్ల సమస్తమైన అనర్థాల నివృత్తీ జరుగుతుంది కాబట్టి ! అపరోక్ష జ్ఞానం లభించటంతోనే ఈ విచార విమర్శనం అనేది దానంతట అదే ఆగిపోతుందని లోగడ చెప్పబడ్డది.
సాధకుడైనవాడు - ముముక్షువు -జగత్తు,జీవుడు,పరమాత్మ,వీటిని గూర్చి ఎల్లప్పుడు విచారణ చేస్తూ ఉండాలి.
ఇట్లా వివేచన చేసిన పిమ్మట జీవుని గూర్ఛినట్టి జగత్తును గూర్చినట్టి భావాలు బాధితమైపోతాయి.
అంటే వాటి స్వరూపం తెలిసినందున సాధకుడు వాటిని ప్రతిషేధిస్తాడు.
ఇట్లా జగత్తు జీవుడు ప్రతిషేధింపబడగా ఇక మిగిలేది బ్రహ్మస్వరూపమైన ఆత్మమాత్రమే ఈ విమర్శకు ఫల స్వరూపంగా మోక్షకాలంలో మిగిలి ఉంటుంది.
జగత్తు,జీవుడు ఈ రెండూ బాధితమైనందువల్ల,జగత్తు ప్రతీతం కాదుగదా ! అందువల్ల పఠన పాఠనాది వ్యవహారాలు ఉండవుగదా ! అనవచ్చు కానీ,
బాధితమవటం అంటే కనపడకుండాపోవటం,ప్రతీతి లేకుండాపోవటం అని అనుకోరాదు.
జీవుడు,జగత్తు అనేవి మిథ్యారూపం కలవి అనే నిశ్చయాత్మకజ్ఞానం కలగటమే బాధితమవటం అంటే అర్థం.
అట్లాకాకుండా ప్రతీతి లేకుండా పోవటం అంటే సుషుప్తి,మూర్ఛ,మృత్యువు మొదలైన స్థితుల్లో జగత్ జీవప్రతీతి ఉండదు.కాబట్టి మానవుడికి తత్త్వజ్ఞానం లేకుండానే మోక్షం వస్తుందని అనుకోవాల్సివస్తుంది.
సత్య స్వరూపత్వ నిశ్చయం అంటే,జగత్తు విస్మృతమవటమే కాదు, పరమాత్మ శేషరూపంలో మిగిలిపోవటం అన్నమాట.అట్లా కాకుండి ,జగత్తు యొక్క విస్మృతినే శేషరూపంలో ఉండటం అని అనుకుంటే ,ఇక జీవన్ముక్తి అనేది అసంభవమే అవుతుంది.
ఇలా విచారణచేయగా కలిగే జ్ఞానం 1)పరోక్షజ్ఞానము,
2)అపరోక్ష జ్ఞానము అని రెండు విధాలుగా ఉంటుంది.
అపరోక్షజ్ఞానం లభించటంతోనే ఈ విచారణమనేది వినష్టమైపోతుంది -ఆగిపోతుంది.
అంటే అపరోక్షజ్ఞానం కలగటంతోడనే జీవుడు జగత్తు పరమాత్మ విషయకమైన విచారణ సమాప్తమై పోతుందని భావం.
క్షుత్పిపాసాదయో దృష్టా యథాపూర్వం మయీతి చేత్ ౹
మచ్చబ్దవాచ్యేఽ హంకారే దృశ్యతాం నేతి కో వదేత్ ౹౹249౹౹
249. అద్వైతజ్ఞానము కలిగినను పూర్వము వలె నాయందు ఆకలి దప్పులు కన్పించుచున్నవే అనిన కన్పించును.కాదనునదెవరు ?కాని
' నా యందు 'అనే పదముచే మాయాకార్యమగు అహంకారమునందు కన్పించునని తెలియుము. సకల దుఃఖములును మాయానిర్మితములగు స్థూలాది శరీరములకేగాని అసంగమగు ఆత్మకు కావు.
చిద్రూపేఽ పి ప్రసజ్యేరంస్తాదాత్మయధ్యాసతో యది ౹
మాధ్యాసం కురు కిన్తు త్వం వివేకం కురు సర్వదా ౹౹250౹౹
250. చిద్రూపమునకూడా తాదాత్యాధ్యాస వలన ,దేహముతో ఆత్మ తాదాత్మ్యమును భావించుట వలన,దుఃఖములన్నీ కలుగును కదా అనినచో అట్టి అధ్యాసను చేయకుము. కాగా ఎల్లప్పుడూ వివేచనము చేయుచుండుము.
(అధ్యాసను తొలగించుటకు).
ఝటిత్యధ్యాస ఆయాతి దౄఢవాసనయేతి చేత్ ౹
ఆవర్తయేద్వివేకం చ దృఢం వాసయితుం సదా ౹౹251౹౹
251. వాసనా ప్రాబల్యము చేత హఠాత్తుగా అధ్యాస వచ్చిపడుననచో వివేకవాసనలు కూడా దానికంటే ప్రబలమగునట్లు ఆవర్తింపుము(అభ్యాసము చేయుము).
వ్యాఖ్య :-అద్వైతజ్ఞానం కలిగినప్పటికీ ఆకలిదప్పికలు ఎందుకు కలుగుతున్నాయి ?
అంటే -
ఆత్మజ్ఞానం కలిగిన పిమ్మట కూడా ఆకలి దప్పికలు మునుపటిలాగేనే కలుగుతూ వున్నాయి,
అటువంటప్పుడు ఆత్మజ్ఞానం వల్ల అనర్థ నివారణం కలుగుతుందని ఎట్లా అనుకోగలం? అంటే -
ఈ క్షుత్పిపాస లనేవి అహంకారంలో అహం శబ్దవాచ్యమైన అనాత్మ వస్తువునందు కలుగుతున్నాయి.
అహంకారములో అట్లా కనిపించవని ఎవరన్నారు ?
" నేను" అనే శబ్దంలో(మచ్ఛబ్ధంలో)
అహంకారం,చిద్భావం,ఈ రెంటి ప్రతీతి కలుగుతుంది.
"నాయందు" అనే పదము మాయాకార్యమగు అహంకారమునందు కన్పించునని తెలియవలెను.
చిదాత్మ అసంగమైనందున,అది క్షుత్పిపాసలకు విషయంకాదు. కాబట్టి ఆకలిదప్పికలనేవి బయట ఉండే అహంకారానివి అని గ్రహించాలి.
యదార్థానికి చిదాత్మకు క్షుత్పిపాస ప్రతీతి లేకపోయినా భ్రాతివల్ల అనిపించవచ్చు గదా ! అంటే -
సరే! చిదాత్మ యందు క్షుత్పిపాసాదులు లేవని అంగీకరించిం.కానీ తాదాత్మాధ్యాసం వల్ల క్షుత్పిపాసాదులు కలిగితే ఏమిచేయాలి ? అంటే,
సమాధానం -
అటువంటప్పుడు నీవు అధ్యాసానికి తావు ఇవ్వకూడదు.
అధ్యాసం కలుగకుండా ఉండటానికి నిరంతరం విచార విమర్శనం చేస్తూ ఉండాలి.
సకల దుఃఖములును మాయా నిర్మితమములగు స్థూలాది శరీరములకే గాని అసంగమగు ఆత్మకు కావు.
భ్రాంతి నివారణకు వివేకం ఒక్కటే సరియైన ఉపాయం -
అనాది వాసనావశంవల్ల మాటిమాటికీ అధ్యాసం(భ్రాంతి) కలుగుతున్నప్పుడు వివేకావృత్తి-
మాటిమాటికీ వివేచన చేయటం ఒక్కటే ఉపాయం.
భ్రాంతి నివారణకు వివేకావర్తనం కంటే వేరొక ఉపాయంలేదు.
జైమిన్యాచార్యులు జఠరాగ్నిని పరమేశ్వరుని యొక్క ప్రతీకగా తలచి ఉపాసన చేసుకొన్నా,ప్రత్యేక కల్పన లేకుండా,పరమేశ్వర స్థానంగా గ్రహించినా ఎటువంటి దోషము లేదని అభిప్రాయపడ్డారు.
జఠరాగ్ని"అంతస్థః" అంటే ఉదర భాగంలోనే కాకుండా శరీరమంతటా వ్యాపించి వుండే అగ్ని అని, శారీరుడి యొక్క కర్మలన్నింటికి సాక్షి అయిన ప్రత్యగాత్మగా కాని అన్వయించుకోవచ్చు.
వైశ్వానర పదానికి
"విశ్వస్య అయం నరః"
(సఖల జీవుల స్వరూపము) లేదా "విశ్వేనరాక"- సమస్త మానవులు తన ఆత్మగా కలది అని వుత్పత్యర్థం చెప్పుకున్నా అది పరమాత్మకే వర్తిస్తుంది.
No comments:
Post a Comment