*అమాయకపు మొగుడు - అతి తెలివి పెళ్ళాం* (జర్మన్ జానపద హాస్య కథ)
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
*****************************
ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు. వాడు అమాయకుడే కానీ చాలా నిజాయితీపరుడు. నోరు తెరిస్తే నిజాలే తప్ప చచ్చినా అబద్ధాలు చెప్పేటోడు కాదు. ఆ అమాయకునికి పక్కింట్లో ఒక అవ్వ ఉండేది. ఆమెకు నా అనేటోళ్లు ఎవరూ లేరు. మొగుడు ఒక సంవత్సరం కిందటే చచ్చిపోయాడు. కొడుకు చిన్నప్పుడే చెరువులో నీళ్లు తాగుతా... తాగుతా... పొరపాటున కాలుజారి అందులో పడిపోయాడు. ఆమెకు ఈ అమాయకున్ని చూస్తే అచ్చం చనిపోయిన తన కొడుకుని చూసినట్లే అనిపించేది. తన కొడుకు కూడా బ్రతికుంటే ఇంత వయసొచ్చి హాయిగా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో కళ్ళముందే తిరుగుతా ఉండేవాడు కదా అనుకునేది.
ఆ అమాయకునికి కొంత కాలానికి పెళ్లయింది. కానీ పెళ్ళాం వీని లెక్క అమాయకురాలు కాదు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. చానా తెలివైంది. ఎంత చిక్కు సమస్యనైనా సరే చిటికెలో విడదీసేది.
ఆ అవ్వకు కొంత కాలానికి జీవితం మీద విరక్తి వచ్చేసింది. దాంతో ఇంట్లో ఉన్నవన్నీ అందరికీ తలా ఒకటి ఇచ్చేసి, కాశీకి పోయి, దేవునికి సేవ చేసుకుంటూ అక్కడే బతకాలి అనుకుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీస్తూ ఉంటే బీరువా లోపల ఒక మూలకు జాగ్రత్తగా దాచిపెట్టిన చిన్న పెట్టె కనబడింది. ఏముందబ్బా దీంట్లో అని చూస్తే ఒక చిన్న చీటీ దొరికింది. అందులో "పెరటిలో చింత చెట్టు దగ్గర తవ్వి చూడు... నాలుగు తరాలు తిన్నా తరగని సంపద అక్కడ ఉంది" అని ఉంది. పోయి తవ్వి చూస్తే ఇంకేముంది ధగధగా మెరిసిపోతా వజ్రాల హారాలు, బంగారు గొలుసులు తళుక్కుమన్నాయి. కానీ అంత విలువైనవి దొరికినా అవ్వకు కొంచెం కూడా ఆశ పుట్టలేదు. వాటిని సంబరంగా వేసుకొని తిరగాలి అనిపించలేదు.
ఆ అవ్వకు అమాయకుడు గుర్తుకు వచ్చినాడు. వానిని పిలిచి "చూడు నాయనా నీవు అచ్చం నా కొడుకు లెక్కనే ఉంటావు. అందుకే ఈ బంగారు నగలున్న పెట్టె నీకు ఇస్తున్నా. కానీ ఇవి నీ వద్ద ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు. ఈ ఊరి అధికారి అసలే మంచోడు కాదు. ఎవరి దగ్గరన్నా విలువైనవేమన్నా ఉన్నాయి అని తెలిస్తే చాలు అన్నీ నున్నగా నొక్కేసే దాకా నిద్రపోడు. ఈ రహస్యాన్ని నోరు జారకుండా నీలోనే దాచి పెట్టుకోగలవా" అని అడిగింది.
"ఓ దానికేముంది. నేనేమన్నా వసపిట్టనా... మాటల పుట్టానా... ఒక్క అక్షరం కూడా నా కడుపులోనుంచి సచ్చినా బయటికి రాదు" అన్నాడు. ఆ మాటలకు ముసలామె 'సరే' అని ఆ బంగారు నగల పెట్టె ఆ అమాయకునికి ఇచ్చింది.
వాడు దాన్ని ఇంటికి తీసుకుపోయి పెళ్ళానికి ఇచ్చాడు. ఆమె వాటిని చూసి అదిరిపడి "ఎక్కడివి నీకు ఇవి... దొరికాయా లేక కొంపదీసి ఎక్కడైనా ఎత్తుకొచ్చావా" అని అడిగింది. దానికి వాడు "ఎత్తుకురావలసిన కర్మ నాకేమి పట్టింది. మన ఎదురింటి ముసలామె కాశీకి పోతూ పోతూ ఇవన్నీ నాకు ఇచ్చింది" అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విన్న వాని పెళ్ళాము "సరే పొరపాటున కూడా ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తగా అంతా కడుపులోనే పెట్టుకో. మన గ్రామాధికారి అసలే మంచోడు కాదు. భూమిలో ఎక్కడ ఏమి దొరికినా అంతా మాదే అనే రకం" అని చెప్పింది.
దానికి వాడు చిరునవ్వు నవ్వి "ఎందుకనవసరంగా భయపడతావు. నేనేమైనా వసపిట్టనా, మాటల పుట్టనా... ఒక్క అక్షరం కూడా నా నోటివెంట సచ్చినా బయటికి రాదు" అన్నాడు. ఆమె సంబరంగా అందులోనుంచి ఒక నగ తీసుకొని పోయి అమ్మి దాంతో ఇంటికి కావలసిన సరుకులన్నీ ఆరు నెలలకు సరిపోయేవి కొనుక్కొచ్చింది. వస్తా వస్తా మధ్యాహ్నం చెరువు దగ్గర నుంచి మంచి చేపలు తీసుకువచ్చింది. కూర వండుతా ఉంటే ఆ కమ్మని వాసన వీధి వీధంతా గుమ్మని ఆవరించింది.
ఆ అమాయకుడు పోతావుంటే ఎదురింటిలోని స్నేహితుడు "ఏరా... ఈరోజు మీ ఇంటి నుంచి కమ్మని వాసన గుమ్మని కొడతావుంది. అదీగాక బండినిండా సరుకులు దిగినాయి. ఏంది సంగతి" అని అడిగాడు. అబద్దాలు చెప్పడం తెలియని ఆ అమాయకుడు జరిగిందంతా చెప్పి "ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. నీ కడుపులోనే దాచుకో. నమ్మకమైనవాడివి, మంచి స్నేహితుడివి కాబట్టి చెబుతా ఉన్నా" అన్నాడు.
దానికి ఎదురింటి స్నేహితుడు చిరునవ్వు నవ్వుతూ "నువ్వు భలే ఉన్నావే. నేనేమైనా వసపిట్టనా లేక మాటల పుట్టనా. ఇవతలి చెవితో విన్నది అవతలి చెవికి కూడా తెలియనివ్వను. మాటంటే మాటే" అన్నాడు.
అమాయకుడు వెళ్ళిపోగానే ఎదురింటి ఆయన పెళ్ళాం "ఏంది... ఎప్పుడూ లేనిది ఇద్దరూ ఒక మూలన కూర్చొని గుసగుసలాడుకుంటా ఉన్నారు. నాకు కూడా చెప్పకూడని రహస్యమా అది" అంది కోపంగా. దానికాయన జరిగిందంతా చెప్పి "ఆడవాళ్ళ నోట్లో ఏ విషయమూ దాగదు అంటారు పెద్దలు. జాగ్రత్త... అనవసరంగా నోరు విప్పకు, ఎవరికీ ఏమీ చెప్పకు" అన్నాడు.
దానికామె కోపంగా "ఎలా కనపడుతున్నా నీ కళ్ళకి. నేనేమైనా వసపిట్టనా లేక మాటల పుట్టనా... చచ్చినా ఒక్క అక్షరం కూడా గడప దాటి అవతలికి వెళ్ళదు. అంతే... మాటంటే మాటే" అంది.
ఆ తర్వాత ఆమె ఆ రహస్యం ఎవరికీ చెప్పొద్దు అంటూనే వాళ్ళ కోడలికి చెప్పింది. ఆ కోడలు పనిమనిషికి చెప్పింది. పనిమనిషి చుట్టుపక్కల తాను పనిచేసే ఇళ్ళవాళ్ళకు చెప్పింది. వాళ్లు వాళ్ళ స్నేహితురాళ్లకు చెప్పారు... అలా తర్వాత రోజుకంతా ఊరు ఊరంతా రహస్యం తెలిసిపోయి గ్రామాధికారిని చేరింది. గ్రామాధికారి ఆ అమాయకున్ని పిలుచుకొని రమ్మని సైనికులను పంపించాడు. వాళ్లని చూడగానే అమాయకుని పెళ్ళానికి విషయం అర్థమైంది. దాంతో "మా ఆయన లేడు. నేను వస్తా పద" అంటూ గ్రామాధికారి వద్దకు పోయింది.
గ్రామాధికారి ఆమెను చూస్తా "చూడమ్మా ఈ రాజ్యం మొత్తం రాజుది. ఇక్కడి భూమిలో ఎక్కడ ఏమి దొరికినా ఆ సంపదంతా రాజుకే చెందుతుంది. నీ మొగునికి బంగారు నగలున్న ఇనప్పెట్టె దొరికిందని ఊరు ఊరంతా సందు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు. పో... పోయి... మీ ఆయన దాచిపెట్టిన పెట్టె తీసుకొని వచ్చి వెంటనే మా అధీనం చెయ్. లేకుంటే నీ మొగుణ్ణి లోపలేసి మెత్తగా ఉతకాల్సి వస్తాది చూడు" అన్నాడు బెదపడిస్తూ.
దానికామె చిరునవ్వు నవ్వి "ఇనప్పెట్టే లేదు... మట్టిగడ్డా లేదు. నా మొగుడు పెద్ద కోతలరాయుడు. నోరు తెరిస్తే సుల్లకూతలే తప్ప నిజాలు అస్సలు రావు. చీమను చంపి ఏనుగును చంపినానని మీసం మొలేసి తొడగొట్టి అల్లరల్లరి చేసే రకం. అట్లాంటి వదరుబోతు మాటలు పట్టుకొని నిజమనుకుంటే ఎట్లా... కొంచమైనా ముందూ వెనక ఆలోచించొద్దా" అనింది. దానికి ఆ గ్రామాధికారి తల గోక్కోని "సరే... వచ్చే ఆదివారం అందరి ముందు పంచాయతీ పెడతా. నువ్వు నీ మొగునితో రా. ఎవరు అబద్ధమాడతా ఉన్నారో చిటికెలో తెలిసిపోతుంది" అన్నాడు.
ఆమె సరేనని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో అమాయకుడు లేడు. బయట పొలంలో ఉన్నాడు. వెంటనే ఆమె అంగడికి పోయి రెండు గంపల లడ్లు కొనుక్కొచ్చింది. వాటిని ఇంటి మీద, పెరట్లో అక్కడక్కడ చల్లింది.
మొగుడు పొలం నుంచి ఇంటికి వస్తా ఉంటే అతనికి కనపడేటట్లు గంప తీసుకొని లడ్లు ఏరడం మొదలుపెట్టింది. అది చూసి వాడు "ఇదేందే... ఇన్ని లడ్లున్నాయి ఇంటినిండా" అన్నాడు. దానికామె "ఇందాక మన వీధి వీధంతా లడ్ల వాన కురిసింది. జనాలు పన్నవి పన్నట్టు కడుపునిండా తిని గంపలకు ఎత్తుకొని దాచిపెట్టుకున్నారు. నేనుండేది ఒక్కదాన్నే కదా. ఇప్పటి వరకూ ఒక గంప ఏరినా... ఇంగ నా వల్ల కాదు. మిగతావి నువ్వు ఏరు" అంది.
వాడు సంబరంగా గబగబా అన్నీ ఏరాడు. గంప నిండిపోయింది. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు.
ఆమె మధ్యాహ్నం కడుపునిండా 'చాలు చాలంటున్నా వినకుండా 'ఇంకొకటి ఇంకొకటి' అంటూ కడుపు నిండిపోయేలా ఒకదాని మీద ఒకటి పెట్టింది. దాంతో వాడు బాగా తిని అలాగే హాయిగా నిద్రపోయాడు.
సాయంత్రం కాగానే ఆమె వాడిని గబగబా లేపి "పక్క రాజ్యం నుండి కొందరు సైనికులు మన ఊరి మీదకి దండెత్తి వచ్చినారంట. మొహానికి పెద్ద పెద్ద ఇనుప ముక్కులు తగిలించుకొని కనబడిన వాళ్లందర్నీ పొడిచి పొడిచి చంపుతున్నారంట. వాళ్లు వెళ్లిపోయేదాకా ఇద్దరమూ ఎక్కడన్నా దాచిపెట్టుకుందాం" అంటూ అటూ ఇటూ చూసింది. ఇంటి బయట పెద్ద గంగాళం ఒకటి కనపడింది. "నువ్వు పోయి దాంట్లో కూర్చో. ఏది ఏమైనా మళ్లీ నేను పిలిచే వరకు బయటకు రాకు. నేను అటక మీద ఎక్కి దాచి పెట్టుకుంటా" అంటూ ఆమె వానిని దాంట్లో కూర్చోబెట్టి పైన మూత మూసింది. కాసేపు ఉండి కొన్ని గింజలు తీసుకువచ్చి ఆ గంగాళం చుట్టూరా... దానిమీద చల్లి ఇంట్లో ఉన్న కోళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలింది.
ఆ కోళ్ళు గంగాళం మీద ఉన్న గింజలను ముక్కుతో పొడుచుకొని తింటా ఉంటే లోపల ఉన్న వీనికి టపీటపీమని పెద్దగా చప్పుడు వినపడసాగింది. సైనికులు ఇంటి దగ్గరికి వచ్చినట్టున్నారు. ఇల్లంతా వెతుకుతా ఇనుప ముక్కలతో పొడుస్తా ఉన్నారు" అనుకున్నాడు.
కాసేపటికి చప్పుడు ఆగిపోయింది. వాడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
అరగంట గడిచాక వాని పెళ్ళాం వచ్చి మూత తెరిచింది "ఇందాకే సైనికులు వచ్చారు. నేను అటక మీద ఎవరికీ కనబడకుండా మూలన దాచిపెట్టుకున్నా కదా. కానీ వాళ్ళు అనుమానం తీరక ఇనుప ముక్కులతో అటకంతా టపీ టపీమని పొడిచి చూసినారు. అదృష్టం మూలన కూర్చోవడంతో నాకు వాళ్ళ ముక్కులు తగల్లేదు" అని చెప్పింది.
దానికి వాడు "నిన్నే కాదు... నన్ను కూడా చంపాలని చూశారు. గంగాళం లోపల ఎవరన్నా ఉన్నారేమో అనే అనుమానంతో దాని మీద అంతా టపీ టపీ మని కొట్టినారు. నా పైప్రాణాలు పైన్నే పోయాయి. దొరికిపోతానేమోనని భయపడ్డా. కిక్కురుమనకుండా అట్లాగే దాచి పెట్టుకున్నా. ఒక పది నిమిషాలు చూసి వాళ్ళు వెళ్ళిపోయారు" అని చెప్పాడు. అట్లా ఆ మాటల్లోనే నెమ్మదిగా రెండు రోజులు గడిచిపోయాయి.
ఆదివారం పొద్దున్నే భటులొచ్చి ఇద్దరినీ గ్రామాధికారి వద్దకు తీసుకుపోయారు. చాలామంది గ్రామపెద్దలు అక్కడికి చేరుకున్నారు. గ్రామాధికారి ఆ అమాయకుని వంక చూసి "నిజం చెప్పు... నీకు ఒక ఇనుప పెట్టె నిండా బంగారు వరహాలు, ముత్యాలు హారాలు, నగలు దొరికినాయి అంట కదా... నిజమేనా" అని అడిగాడు.
ఆ అమాయకుడు అబద్ధం చెప్పడు కదా దాంతో "అవును నిజమే... మా పక్కింటి ముసలామె కాశీకి పోతా పోతా నాకు అవన్నీ కానుకగా ఇచ్చింది" అని చెప్పాడు. కానీ అంతలోనే వాని పెళ్ళాం "లేదు దొరా... మా ఆయన చెప్పేటివన్నీ ఉత్త అబద్ధాలే. నోరు తెరిస్తే చాలు అబద్ధాల మీద అబ్ద్ధాలు చెబుతాడు" అంది.
దానికి గ్రామాధికారి కోపంగా "నీ మొగుడు నిజమని ఒప్పుకుంటా ఉంటే నువ్వేమో అబద్ధం అంటా ఉన్నావ్. నిరూపించగలవా" అని అడిగాడు.
ఆమె తలూపుతా మొగుని వంక తిరిగి "బంగారు నగలు ఉన్న ఇనప్పెట్టె ఎప్పుడు తెచ్చావ్ ఇంటికి. నాకు అస్సలు గుర్తు లేదు" అనింది. దానికి వాడు "అప్పుడే మర్చిపోయావా... మన వీధిలో లడ్ల వాన కురిసింది కదా దానికి రెండు రోజుల ముందు" అన్నాడు. ఆ మాటలు వినేసరికి అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు.
ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా "లడ్ల వాన కురవడం ఏమిటి? వీనికి కొంచెం తిక్కగాని ఉందా" అని అనుకున్నారు. ఆమె అమాయకంగా మొగుని వంక చూస్తూ "లడ్లవాన కురిసిందా... ఎప్పుడు" అంది.
దానికి ఆ అమాయకుడు కోపంగా "అదేందే అప్పుడే అన్నీ మర్చిపోయావు. ఆ రోజు సాయంత్రం ఇనప ముక్కులు ఉన్న పక్క ఊరి సైనికులు మన ఊరి మీదికి దండయాత్ర చేసి అందర్నీ పొడిచి పొడిచి చంపారు కదా.. ఆ రోజు" అన్నాడు.
ఆ మాటలు వినేసరికి సభలో అందరూ నవ్వడం నవ్వడం కాదు. లడ్ల వానంట, ఇనుప ముక్కుల సైనికులంట. వీడు కాకమ్మ కథలు భలే చెబుతున్నాడే" అనుకున్నారు. గ్రామాధికారి నవ్వుతా ఆమె వంక చూస్తూ "మీ ఆయనకు కొంచెం పిచ్చి పట్టినట్లు ఉందమ్మా. ఎవరికన్నా వైద్యునికి చూపించు. అనవసరంగా ఈ తిక్కలోని మాటలు విని విలువైన సమయమంతా వ్యర్థం చేసుకున్నాం" అంటూ లేచిపోయాడు.
ఆపద తొలిగిపోయినందుకు ఆమె 'హమ్మయ్య' అనుకుంది. నగలపెట్టె మొగునికి గూడా తెలియకుండా దాచి పెట్టి, అప్పుడొక హారం, అప్పుడొక నగ అమ్ముకుంటా జీవితాంతం హాయిగా కాలుమీద కాలేసుకుని బతికింది.
*****************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
*****************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment