Monday, January 6, 2025

 అరుణాచల 👏
ఓం నమో భగవతే శ్రీ రమణాయ

భక్తుడు :
భగవాన్ ! గురువు ఎట్లా లభిస్తాడు?

మహర్షి :
దైవము సర్వాంతర్యామి. దైవము కొఱకు తపించిపోయే భక్తుణ్ణి దయతలచి, వాని అర్హతకు అనుగుణంగా రూపము దాలుస్తాడు. భక్తుడు, దైవాణ్ణి మానవునిగా భావించి పరస్పర శరీరాల వలనే తాము ఇద్దరము అనుకుంటాడు.

కాని దైవావతారమైన గురువు అంతరాంతరాల్లో వర్తిల్లి, భక్తుని చేత వాని తప్పులు దిద్దించి, సరియైన మార్గంలో నడిపి, ఆత్మస్థితుడు అయ్యేదాక సాయపడతాడు.

ఆపైన శిష్యుడు అనుకొంటాడు : “పూర్వం నేను ఎంతగానో కలవరపడ్డాను. ఇంతకూ తనను ఏదీ బాధించని ఆ మునుపటి ఆత్మనే నేను. ఇంతదాకా బాధపడుతున్న వాడు ఎక్కడ? ఎక్కడా కానరాడే!”

 ****

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ప్రశ్న :
భగవన్! ఆత్మ-అహంకారం; ఈ రెండూ ఒకటేనా!

మహర్షి : 
అహంకారం లేకుండా ఆత్మ ఉండగలదు. కాని ఆత్మ లేకపోతే అహంకారం నిలువదు. అవి ఏలాంటివి అంటే సముద్రము(ఆత్మ)-బుడగ(అహం) వంటివి.

  ***

   ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ప్రశ్న:
భగవాన్! మౌనంగా కూర్చుంటే పనులు జరిగేది ఎలాగ? కర్మలు జరగకపోతే ఇక కర్మయోగానికి స్థానము ఎక్కడ ఉన్నది?

మహర్షి :
మొదట కర్మ అంటే ఏమో, ఎవని కర్మమో, కర్త ఎవరో తెలియవలెను కదా! వానిని పరిశీలించి యధార్థం విచారిస్తే, విధిగా అతడు శాంతుడూ, ఆత్మస్థితుడూ అవుతాడు. అప్పుడు కర్మలు వాటంతటఅవే సాగుతూనే ఉంటాయి.

  *

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

భక్తుడు :
భగవాన్! పుణ్యపాపములు అంటే ఏమి? అవి ఎందుకు ఉన్నట్లు?

మహర్షి :
అవి సాపేక్షాలు. అంటే ఒకటిని, ఆ రెండవదానితో పోల్చి తెలియవలసింది. పాప పుణ్యాలు తెలిసికొనే కర్త ఒకరు ఉండవలెను కదా! ఆ కర్త అహంకరణ. ఆహంకరణ మూలం కనిపెట్టు. అది 'ఆత్మ' యై తేలుతుంది. ఆత్మే మూలం, దైవం కూడా.

   **

  ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఆలోచనలు కలిగినప్పుడెల్లా అవి భగవంతుని ఆలోచనలు అనుకో. అప్పుడు ఆ ఆలోచనలు మరొకవిధంగా ఉండనూ లేవు. అది చాలు. భగవంతునికి మనస్సును అర్పించటమంటే అదే. భగవంతునికి వేరుగా ఏదైనా నిలువగలదా! అంతా భగవంతుడే. మనకెందుకీ చింతలు.

No comments:

Post a Comment