*ప్రణవోపాసన....."*
ప్రణవం అంటే ఓంకారం. అకార ఉకార మకారాల కలయికతో ఏర్పడే ఓంకారాన్ని వేదసంహితలు పరబ్రహ్మకు ప్రతీకగా చెబుతాయి. పద్మాసనంలో కూర్చుని యోగులు ప్రణవోపాసన చేస్తుంటారు. సర్వసమగ్ర ఓంకారోపాసన సిద్ధించినప్పుడు యోగులు శుద్ధబ్రహ్మ స్వరూపంలో ఐక్యమవుతారు. అది పరిపూర్ణ నిర్వికల్ప నిరామయస్థితి. జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థల తరవాత జీవాత్మను సాక్షాత్తు పరమాత్మతో అనుసంధానించే తురీయమనే నాలుగో దశ అది. వేదాంతులు దాన్ని ‘కళ’గా అభివర్ణించారు.
ప్రణవోపాసనలో ‘ఓ’ అంటూ ఆరంభమయ్యేది నాదం. ‘మ్’ అనేది బిందువు. అవి రెండూ పూర్తయ్యాక ఏర్పడే గాఢమైన నిర్వికల్ప నిశ్శబ్ద స్థితి కళ!
జాగ్రదవస్థలోని జీవుణ్ని ‘విశ్వుడు’గాను, పరమాత్మను ‘విరాట్’గాను వ్యవహరిస్తారు. సకల ఇంద్రియాలతో వర్తిస్తాడు కనుక జీవుడు విశ్వుడవుతున్నాడు. జీవులందరి సమష్టి చైతన్య రూపం కనుక పరమాత్మను విరాట్ స్వరూపుడన్నారు. ఓంకారోపాసనలో తొలిదశగా జాగ్రదవస్థను విశ్వుడితోను, విశ్వుణ్ని విరాట్టుతోను, విరాట్టును ‘అ’ కారంతోను అనుసంధిస్తారు. ఉచ్చారణలో అకారం ఉకారంలోకి పర్యవసించేలోగా ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.
రెండోది స్వప్నావస్థ. స్వప్నావస్థలో జీవాత్మను ‘తైజసుడు’ గాను, పరమాత్మను ‘హిరణ్యగర్భుడు’గాను వ్యవహరిస్తారు. జీవుడు లేదా తైజసుడిలోని పంచప్రాణాలు (ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానాలు), అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు... మొత్తం పదిహేను స్వప్న స్థితిలో ఉండగా- మనసు ఆత్మ రెండూ జాగృతమై ఉంటాయి. తైజసులందరి సమష్టి చైతన్య స్వరూపం- హిరణ్యగర్భుడు! ప్రణవోపాసనలో స్వప్నావస్థను తైజసుడితోను, తైజసుని- హిరణ్యగర్భుడితోను, హిరణ్యగర్భుణ్ని- ‘ఉ’ కారంతోను అనుసంధిస్తూ ధ్యానం చేయడం రెండోదశ.
మూడోది సుషుప్తి. దీనిలో ప్రాణ, జ్ఞాన, కర్మేంద్రియాలు పదిహేనింటితోపాటు మనసు కూడా లయమైపోతుంది. కేవలం ఆత్మ మాత్రమే జాగృతమై ఉంటుంది. ఈ స్థితిలోని జీవాత్మను ‘ప్రాజ్ఞుడు’గాను పరమాత్మను ‘అంతర్యామి’గాను పేర్కొంటారు. ప్రాజ్ఞులందరి సర్వసామూహిక చైతన్య స్వరూపమే మనమందరం చెప్పుకొనే ‘అంతర్యామి’! ప్రణవోపాసనలోని ఈ మూడో దశలో సుషుప్తిని- ప్రాజ్ఞుడితో, ప్రాజ్ఞుణ్ని- అంతర్యామితో, అంతర్యామిని ‘మ’కారంతో అనుసంధించి దర్శనం సాధిస్తారు.
ఇలా ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడల్లా మూడు స్థితులను కలుపుకొంటూ రావాలి. క్రమంగా ‘నేను’ లయం అయిపోవాలి. తిరిగి తిరిగి అకార ఉకార మకారాల సంయోజనాన్ని అనుసంధానించుకోవాలి. అంటే జాగ్రత్, విశ్వ, విరాట్ సమన్విత ‘అ’ కారాన్ని-స్వప్న తైజస హిరణ్యగర్భసమన్విత ‘ఉ’కారంలోకి, ఆ ఉకారాన్ని- సుషుప్తి ప్రాజ్ఞ అంతర్యామి సమ్మిళిత ‘మ’ కారంలోకి క్రమక్రమంగా కలుపుకొంటూ ధ్యానం చేయాలి. ఇది సర్వ సమగ్ర ఓంకారోపాసనగా ప్రసిద్ధికెక్కిందని పెద్దలు వివరించారు. ప్రణవోపాసన సిద్ధిస్తే కలిగే అద్భుతమైన తురీయదశనే కళ అంటారు. అది శుద్ధపరబ్రహ్మ స్థానం. ఓంకారాన్ని నాదబిందు కళాత్మకంగా పేర్కొనడంలోని ఆంతర్యం అదే! ప్రణవాన్ని ఉపాసించేవారికి పరబ్రహ్మతో అనుసంధానం కుదురుతుందని గీతాచార్యుడు బోధించాడు.
‘ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ’ శ్లోకానికి తాత్పర్యం అదే...
No comments:
Post a Comment