Monday, January 6, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 *ఋణానుబంధ రూపేణా…!*
            ➖➖➖✍️

*పూర్వము ఒక గ్రామములో దంపతులు నివసించుచుండిరి. వారు ఎంతో అన్యోన్యముగా జీవనము సాగించుచుండిరి.*

*ఎందువల్లో గాని ఆ దంపతులకు చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. కన్న బిడ్డలు నట్టింట తిరుగుచుండగ తమ గృహము కళకళలాడవలెనని వారు ఆశించుచుండిరి.*

*సంతాన ప్రాప్తికై వారు ఎన్నియో పూజలు, నోములు నిర్వహించిరి. పూజా ఫల విశేషముగా కొంతకాలమునకు గృహస్థు భార్య గర్భవతి అయ్యెను. నెలలు నిండగనే ఆమెకు పండంటి మగ కవలపిల్లలు జన్మించిరి.అందులకు దంపతులు ఎంతగానో ఆనందించసాగిరి.*

*జంతువుల మనోభావములను, పసి పిల్లల భావములను తెల్సుకొనగల జ్ఞానమును భర్త కలిగియుండెను.*

*ఆ కవలపిల్లలు ఊయలలో పరుండియుండగా వారి మనోభావములను తెలుసుకొనదలంచి తండ్రి వారికి సమీపముగ వచ్చి కూర్చుని వారిని తదేకదృష్టితో వీక్షించసాగెను.*

*అందులో మొదటి పిల్లవాడు మనస్సులో ఈ విధముగా అనుకొనుచుండెను - "పూర్వజన్మమున నాకు ఈ ఇంటి యజమాని రెండు రూపాయలు బాకీ తీర్చవలసియున్నది. ఆ ఋణము తీరినవెంటనే నాకు ఇక్కడినుండి విముక్తి లభించును."*

*రెండవ పిల్లవాడు ఈ ప్రకారముగా మనస్సు నందు భావించుచుండెను… "నేను పూర్వజన్మమున ఈ గృహ యజమానురాలికి వందరూపాయలు బాకీపడియుంటిని. ఈ జన్మలో దానిని తీర్చిన తదుపరి నాకు వీరితో గల సంబంధము విడిపోవును."*

*వారిరువురి మనోభావములను గ్రహించిన తండ్రి - 'ఆహా! ఋణానుబంధము వలననే భార్యాసుతులు ఏర్పడుచుందురు గదా! లేకలేక మాకు జన్మించిన వీరు ఇక ఎంతకాలము మా ఇంట ఉందురో' అని తలంచుకొని చింతించసాగెను. అయినను ఈ విషయము భార్యకు తెలుపకుండ రహస్యముగ ఉంచదలచెను.*

*పిదప అతడు "నీవు నేరుగా మన పిల్లలకు పైకము ఇవ్వకు. మరియు వారి వద్దనుండి నేరుగా తీసుకొనకు" అని భార్యను హెచ్చరించెను.*

*భర్త మాటలయొక్క అంతరార్థమేమియు బోధపడకున్నను భార్య 'సరే' అనెను.*

*తదుపరి ఆ ఇద్దరి పసిబిడ్డలకు ఆముదము పెట్టుటకు రెండు, రెండు రూపాయలతో రెండు వేర్వేరు సీసాలలో ఆముదము తెప్పించిరి. కొన్ని రోజులకు ఆ సీసాలలోని ఆముదము పూర్తిగా పిల్లలకు వినియోగింపబడినది.*

*మొదటి పిల్లవాని రెండు రూపాయలు బాకీ తీరగానే అతడు మృతినొందెను. అది గాంచి తల్లి హృదయ విదారకముగా ఏడ్వసాగెను.*

*మరణించిన పిల్లవానిని చూచి తండ్రి, 'ఆహా! విధి ఎంత బలీయమైనది కదా!' అని అనుకొని, జీవించియున్న రెండవ పిల్లవానిని చూచియైనను ఊరడిల్లు మని భార్యను ఓదార్చెను.*

*రెండవవాడు సద్గుణములు అలవరచుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టుడయ్యెను. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుచు సంపాదించినదానిలో రోజూ కొంత పైకమును ఒక డబ్బాలో నిలువచేయసాగెను.*

*ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకు టిల్లు తగలబడిపోవుచుండెను. అది చూచిన ఆ పిల్లవాడు పరుగిడుచు పోయి తాను పైకమును - దాచిన డబ్బాను కొనివచ్చి ద్వారము వెలుపలగల తల్లికి ఒసంగెను. మరుక్షణమే సగముకాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలుని పై పడెను. వెంటనే అతడు మరణించెను.*

*ఆ దుర్ఘటనను చూచి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయిరి. ఉన్న ఒక్క కుమారుడుకూడ దూరమై పోయినందులకు తల్లి యొక్క బాధ చెప్పనలవి కాకుండెను. బాలునియొక్క ఋణవిషయము తండ్రికి స్మృతికి వచ్చెను.*

*ఆ డబ్బాలోని పైకము లెక్కచూడగా ఖచ్చిత ముగ అందు రు.100/-లు ఉండెను.*

*ఆనాడు తాను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేసి, "ఋణానుబంధము వలననే బంధువులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడును. మరియు ఆ ఋణములు తీరగనే ఎవరిదారి వారు వెడలెదరు" అని చెప్పి భర్త ఆమెను సము దాయించెను.*

*కల్సియున్న కొద్ది రోజులలో వారిపై మమకారము పెంచుకొనుట అవివేకమగును. ఋణానుబంధము తీరిపోయిన పిమ్మట లోకములో ఏదియై నను మనచెంత నుండదు. కనుక మన ధర్మమును మనము సక్రమముగా నెరవేర్చుచు దైవేచ్ఛపై ఆధారపడియుండవలెనని ఆ దంపతులు గ్రహించిరి. శేషజీవితమును ధర్మాచరణ యందు, దైవకార్య నిర్వహణము నందు గడపి వారు తమజన్మలను సార్థకం చేసుకొనిరి.*


*నీతి:*
*ఋణానుబంధము వలన, కర్మబంధము వలన లోకములో మనుజునకు, భార్యాపుత్రబంధుమిత్రాదులు ఏర్పడుచుందురు. సమయము ఆసన్నమైనపుడు ఎవరి మార్గమున వారు వెడలిపోవుదురు. కనుక జనులు, బంధ్వాదులపై అనురాగమమకారాలను పెంచుకొనరాదు.*

*శరీరము శాశ్వతముకాదని అది ఏనాటికైనను నశించిపోవును అను సత్యమును గుర్తెఱిగి మనుజుడు ధర్మప్రవర్తన కలవాడై, భగవంతుని యెడల అకుంఠిత విశ్వాసము, భక్తిని పెంపొందించుకొని కృతకృత్యుడు కావలెను.*✍️
           
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment