Vedantha panchadasi:
అప్రవేశ్య చిదాత్మానం పృథక్పశ్యన్నహంకృతిమ్ ౹
ఇచ్ఛాస్తు కోటి వస్తూని న బాధో గ్రంథిభేదతః ౹౹262౹౹
262. చిదాత్మను అహంకారము నుండి వేరుపరచి తెలిసికొనిన పిదప కోటి వస్తువులందు కోరికలున్నను బాధ లేదు,
అజ్ఞాన గ్రంథి, చిజ్జడగ్రంథి భేదింపబడినది గనుక.
గ్రంథిభేదేపి సంభావ్యా ఇచ్ఛాః ప్రారబ్ధదోషతః ౹
బుద్ధ్వాపి పాపబాహుల్యా దసంతో యథా తవ ౹౹263౹౹
263. ప్రారబ్ధవశమున జ్ఞానియందు కోరికలు ఉదయింపవచ్చు, పరోక్షముగ అద్వైత సత్యమును తెలిసికొనినను పాపబాహుళ్యము వలన అసంతోషము ఉన్నట్లే.
వ్యాఖ్య:- అహంకారమునకు ఆత్మకు గల తాదాత్మ్యాధ్యాస మూడు విధములు.
సహసము,కర్మజము,భ్రమజము అని.
చిదాభాసుడు అహంకారము ఒకటియే అనునది సహజము.
అంతఃకరణము నందు ఆత్మ ప్రతిఫలనమే చిదాభాసుడు.
అహంకారమునకు స్థూలశరీరమునకు గల తాదాత్మ్యాధ్యాస కర్మజము,
ప్రారబ్ద వశమున ఇది ఏర్పడును.
అహంకారమే ఆత్మ అనే తాదాత్మ్యాధ్యాస భ్రమజము.
అజ్ఞానమూలకమగు భ్రమ వలన ఇది ఏర్పడును.
జ్ఞానియందు అజ్ఞానము నశించుటచే భ్రమజమగు అధ్యాస నశించును మరి ఎన్నటికిని అది తిరిగిరాదు.
కాని మిగిలిన రెండు అధ్యాసలు రావచ్చును.
ముముక్షులైనవారు చిదాత్మను అహంకారములో ప్రవేశ పెట్టకుండా తాదాత్మ్యాధ్యాసంతో అంతర్భావం కానీయకుండా -
అహంకారాన్ని చిదాత్మకంటే భిన్నమైన దానినిగా చూస్తూ అసంఖ్యాకమైన వస్తువులను కోరుతున్నా ,
కోట్లకొలది పదార్థాలను అనుభవిస్తున్నా బంధింపబడడు. ఎందుచేత ?
హృదయ గ్రంథి భేదనం జరిగింది కాబట్టి ! అంటే ,
అధ్యాసంవల్ల పుట్టేకోరికలే వదిలిపెట్టదగినవి.అంతేతప్ప ,
అన్నికోరికలు వదలిపెట్టదగినవికావు.
అహంకారం,చిదాత్మ ఒకటికావు అని గ్రహించినవారు ఎన్ని వస్తువులు కోరినా,ఎన్ని వస్తువులు అనుభవించినా,
ఆత్మ సాక్షాత్కారానికిగానీ మోక్షానికిగానీ ఏమీ అభ్యంతరం ఉండదు అని భావం.
అయితే, అధ్యాసం లేనప్పుడు అహంకారగతమైన కామాలు ఉండవుగదా ! అంటే -
గ్రంథి విచ్ఛేదనం జరిగినప్పటికీ ,
ప్రారబ్ధవశమున జ్ఞానియందు కోరికలు ఉదయింపవచ్చు,
ప్రారసబ్ధదోషం ఉన్నంతవరకు, ఇచ్ఛాదులు ఉండనే ఉంటాయి
ఆత్మతత్త్వజ్ఞానం కలిగినప్పటికీ,ఆ దుఃఖాలు ఉండటానికి కారణం పాపాల ఆధిక్యతే ! అంటే ,
ప్రారబ్ధకర్మ ప్రాబల్యం వలన అధ్యాసరహితుడైన జ్ఞానికి కూడా కామనలు వుంటాయి. కాని,
అవి ప్రభావాన్ని కలిగించలేనివి -
"దగ్ధబీజాలలాంటివి" !
అహంఙ్కా గతేచ్ఛాద్యైర్దేహ వ్యాధ్యాదిభిస్తథా ౹
వృక్షాదిజన్మనాశైర్వా చిద్రూపాత్మని కిం భవేత్ ౹౹264౹౹
264. తాను చిత్స్వరూపమైన ఆత్మయని తెలిసికొనిన జ్ఞానిని అహంకారవశములైన కోరికలు శరీరవ్యాధులు మొదలైనవి బాధింపవు,
అరణ్యములోని వృక్షముల పెరుగుటలు విరుగుటలు బాధింపనట్లే.
గ్రంథిభేదా త్పురాప్యేవమితి చేత్తన్న విస్మర ౹
అయమేవ గ్రంథిభేదస్తవ తేన కృతీ భవాన్ ౹౹265౹౹
265. గ్రంథిభేదమునకు పూర్వము కూడా ఆత్మను ఏదీ బాధింపదు కదా అనినచో ఆ సత్యమును మరువకు.
ఆ జ్ఞానమే గ్రంథిభేదము దాని వలననే కృతార్థత.
నైవం జానంతి మూఢాశ్చేత్సోఽ యం గ్రంథిర్న చాపరః ౹
గ్రంథి తద్భేదమాత్రేణ వైషమ్య మూఢబద్ధయోః ౹౹266౹౹
266. మూఢులకు ఈ విషయము తెలియదనినచో అదే అజ్ఞాన గ్రంథి.
ఈ గ్రంథి ఉండుట తెగుటలోనే మూఢులకు జ్ఞానులకు గల భేదము.
వ్యాఖ్య:- శరీరగతమైన వ్యాధులవల్ల,లేదావృక్షాదుల ఉత్పత్తి వినాశాదులవల్ల సాక్షీభూతమైన చైతన్యానికి నాశనమనేది ఎట్లా ఉండదో,అట్లాగే అహంకారగతమైన కామాదుల వల్ల ఆత్మకు హానిలేదు.
ఆత్మ అనేది అసంగం కాబట్టి ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది.
గ్రంథి భేదనానికి పూర్వంకూడా కామాదులవల్ల హాని ఉండదుగదా !
అంటే -
గ్రంథి భేదనానికి(అధ్యాసనివృత్తికి) పూర్వంకూడా ఆత్మయందు కామాది వికారాలు ఉండవు.
అంతేకాదు,గ్రంథి భేదనానికి పూర్వంకూడా సాక్షీభూతమైన ఆత్మయందు కామాదుల నివృత్తీ ఉండదు.ఎందుచేత ?
"చిదాత్మ అసంగమైనది కాబట్టి !మాయకు సంబంధించిన కామాదులు ఆత్మను బంధించలేవు" - అనే
ఈ విధమైన నీ నిశ్చయాత్మక జ్ఞానం సైతం గ్రంథి భేదనమే అవుతుంది.కాబట్టి ,
నీవు కృత్యుడవన్నమాటే !
ఈ విధమైన జ్ఞానం లేకపోవటమే గ్రంథి అని నిర్ణయిస్తున్నారు.
"పామరులైనవారు చిదాత్మ స్వరూపాన్ని ఎరుగరు" - అని ఈ విధంగా అనుకోవటమే గ్రంథి. ఇంతకంటే మించిన వేరొక గ్రంథి అని అంటూ ఉండదు.
ఇతరుల కంటె తాను ఎక్కువ అనే భావం,తాను వేరు పామరులు వేరు అనే ద్వైతభావం ఉండటమే గ్రంథి.
పామరునికి జ్ఞానికి వున్న భేదమల్లా-
మూర్ఖునియందు గ్రంథి అట్లాగే ఉంటుంది.
జ్ఞానియందు గ్రంథి విడిపోయి ఉంటుంది.
ఇదే ఇద్దరిలోనూ ఉండే భేదం.
తాను చిత్ స్వరూపమైన ఆత్మయని తెలిసి కొనిన జ్ఞానిని,
అహంకారవశములైన కోరికలు శరీరవ్యాధులు మొదలైనవి బాధింపవు.
శరీరమును నూరు ముక్కలు చేసినను ఆత్మకు హాని కలుగదు. కుండను పొడిచేసినను దానిలోపలి ఆకాశము నశించదు.
నామమాత్రముగా ఉండి సత్యము కాని మనఃపిశాచము నశించినను మనము నష్టపోవునదేమి ?
పూర్వము సుఖ,దుఖఃభావనలతో గూడిన మనస్సు ఉండెను.కానీ ఇప్పుడు అట్టి భావనలన్నియు నశించినవి గనుక మనస్సు ఎక్కడ ఉన్నది ?
"వ్యక్తి ఇతరముననుభవించును",
"వ్యక్తి ఇతరమును గ్రహించును",
"వ్యక్తి ఇతరమును దర్శిఃచును",
"వ్యక్తి ఆపదవలన బాధపడుచున్నాడు" - ఇట్టి భావనలను ఏ మూర్ఖుడు పెట్టుకొనును ?
ప్రకృతి మాత్రమేఅనుభవించును, మనస్సు పట్టుకొనును లేక తెలిసికొనును,బాధ దేహమునకు సంబంధించినది,దుష్టవ్యక్తి ఒక మూర్ఖుడు(అజ్ఞాని);
కానీ మోక్షమును పొందిన వ్యక్తియందు వీనిలో ఏదియూ ఉండదు.
నేను సుఖతృష్ణను పెట్టుకొనను, దానిని వదలించుకొనవలెనని కూడ నేను కోరుకొనను.
ఏది వచ్చిన అది వచ్చుగాక,ఏది పోయిన అది పోవుగాక.
నానావిధములగు అనుభవములభావనలు దేహములో ఉదయించుగాగ లేక
అస్తమించుగాక.
"నేను వానిలో లేను",
"అవి నాలో లేవు".
No comments:
Post a Comment