దేవాలయాలను నిర్వహించుకునే సత్తా హిందువులకు వుంది : కోటేశ్వర శర్మ
మన ఆలయాలను మన సంప్రదాయం ప్రకారమే నిర్వహించుకుందామని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ అన్నారు. దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులు, అక్కడి భక్తులు కలిసి ఉమ్మడిగా సహకారభావంతో, భక్తితో ఆలయాలు నిర్వహించుకుంటాం. అందులో ప్రభుత్వ జోక్యం ఉండనక్కరలేదని, దానికి అయోధ్య దేవాలయమే ఓ ఉదాహరణ అని వివరించారు. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆదివారం హైందవ శంఖారావం నిర్వహించింది.
ఒకరోజులో రెండున్నర లక్షల భక్తులకు దర్శనాలు సాఫీగా అయోధ్యలో జరుగుతుంటే అలాంటి వ్యవస్థను మన ఊళ్ళో మన ప్రజలు, మన భక్తులు కలిసి ఎందుకు ఏర్పాటు చేసుకోలేము? చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులు, అక్కడి భక్తులు కలిసి ఉమ్మడిగా సహకారభావంతో, భక్తితో ఆలయాలు నిర్వహించుకుంటామని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండనక్కరలేదని తేల్చి చెప్పారు.
దేవాలయాలకు ఒకేరకమైన కేంద్రీకృత నిర్వహణా పద్ధతి లేదని, ప్రతీ దేవాలయానికీ స్థానిక ఆచార సంప్రదాయాలు, రీతి రివాజులూ ఉంటాయన్నారు.కాబట్టి స్థానిక పెద్దలతో ధార్మిక ట్రస్టుల ఏర్పాటుతో ఆలయాలను నిర్వహించాలి అనే విహెచ్పి కోరుకుంటోందన్నారు. ఆ మేరకు ఒక ముసాయిదాను తయారుచేశామని పేర్కొన్నారు. ప్రతీ దేవాలయానికీ తనదైన ఆగమశాస్త్రం, సంప్రదాయం ఉన్నాయి. ఆ పద్ధతుల్లో గుడులను నిర్వహించాలి. ఆ పద్ధతిలో దేవాలయాల నిర్వహణ స్వతంత్రంగా జరగాలన్నారు.
దేవాలయాల నిర్వహణ ఎవరు చేస్తారు విహెచ్పియా, ఆర్ఎస్ఎస్ ఆ అని అడుగుతున్నారని, హిందూ సమాజం నిర్వహిస్తుందని, హిందూ సమాజానికి ఆ శక్తి ఉందని స్పష్టం చేశారు.ధనానికి లోటు లేదు. నిర్వహణా సామర్థ్యానికి లోటు లేదు. హిందువుల్లో అన్ని రకాల శక్తియుక్తులు కలిగినవారు ఉన్నారన్నారు.
కొన్ని రోజుల క్రితం జీయర్ స్వామీజీ దేవాలయాల విషయంలో నిరహార దీక్ష చేపట్టారని,ఆ రోజు నుంచీ ఆంధ్రలో దేవాలయాలను ప్రభుత్వం పెత్తనం నుంచి వెనక్కు తీసుకోవాలన్న ఉద్యమం మొదలైందన్నారు.
ఆరోజు జియ్యరు స్వామి, పెజావర్ స్వామి ప్రారంభించిన దీక్షను హిందూ సమాజం సరిగ్గా అర్ధం చేసుకోలేదని, తర్వాత తిరుపతిలో మార్పు చేర్పుల మీద చిన్నజీయర్ స్వామి పెద్ద ఉద్యమం ప్రారంభించారని, ఆ ఉద్యమం సఫలం కాలేదనిపించిందని, అందరూ కలసి చేద్దామనుకున్నా సాధ్యం కాలేదన్నారు.
తర్వాత కమలానంద భారతి స్వామీజీ రంగప్రవేశం చేసారు. ఊరూరా జనజాగ్రుతి చేశారని, రథయాత్రతో రాష్ట్రంలో ప్రతీ దేవాలయం గురించి వివరాలు సేకరించారన్నారు. ప్రతీ దేవాలయాల ఆస్తుల వివరాలు, వాటిలో అన్యాక్రాంతం అయిన వివరాలు సేకరించారు. దేవాలయాల్లో ఆస్తుల వివరాలతో బోర్టులు పెట్టించింది ఆయనే అని తెలిపారు.అలా ఈ ఉద్యమానికి ఎప్పుడో పునాది పడింది.విహెచ్పి ఆవిర్భావ సమయం నుంచే దేవాలయాల విముక్తి గురించి ఉద్యమాల నిర్మాణం ప్రారంభించిందని తెలిపారు.
బ్రిటిష్ ప్రభుత్వం 1959లో తమిళనాడు ఎండోమెంట్స్ చట్టం రూపొందించారని, ఈస్టిండియా కంపెనీ, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఆలయాల నిధుల దుర్వినియోగం ప్రారంభమైందని తెలిపారు.ఆ తర్వాత తమిళనాడు, దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే సుప్రీంకోర్టు ఎండోమెంట్స్ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా చెప్పాయన్నారు..
#hainadavasankharam #హైందవశంఖారావం
No comments:
Post a Comment