*దేవుని చేరిన ఉత్తరం* - హృదయాన్ని కదిలించే మంచి కథ - డా.ఎం.హరి కిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు చాలా అమాయకుడు. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. అందరిల్లలో చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్లు పెట్టినవి తింటూ ఉండేవాడు.
ఆ పిల్లవానికి చదువు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక సమయం దొరికినా చదువుకుంటూ, రాసుకుంటూ, నేర్చుకుంటూ వుండేవాడు. ఆ పిల్లవానికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి ముచ్చటపడి వాళ్ళ పక్కింటి అతను తీసుకుపోయి హాస్టల్ వున్న ఒక బడిలో చేర్చాడు.
నెమ్మదిగా ఆ పిల్లవాడు బాగా చదువుకుంటూ, ఎప్పటికప్పుడు చెప్పినవి చెప్పినట్లు నేర్చుకుంటూ పదవ తరగతి పాసయ్యాడు.
కాళేజీలో చేరదామంటే డబ్బులు లేవు. ఎలాగబ్బా అని ఆలోచిస్తూ ఉంటే "ఎవరూ లేని వారికి ఆ దేవుడే దిక్కు. నమ్ముకున్న వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు" అని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
దాంతో ఒక ఉత్తరం కొని "స్వామీ... ఇప్పుడు నేను కాలేజీలో చేరడానికి డబ్బులు కావాలి. ఎలాగైనా పంపించు. నిన్నే నమ్ముకున్నా నువ్వే నాకు దిక్కు" అని రాశాడు. చిరునామా రాయాల్సిన చోట "దేవుడు, స్వర్గం" అని రాసి ఉత్తరాన్ని గుడికి తీసుకొని పోయి హుండీలో వేశాడు.
ఊహించని విధంగా ఆ పిల్లవానికి నాలుగు రోజుల తరువాత వెయ్యి రూపాయల మనియార్డర్ తో పాటు ఒక ఉత్తరం వచ్చింది. అందులో "బాబూ... నువ్వు బాగా కష్టపడి చదవాలి. నిన్ను నమ్మి వెయ్యి రూపాయలు పంపుతున్నా. నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదిస్తే నీ చదువు కోసం ఇంకా ఎంతైనా సహాయం చేస్తా. మాట నిలబెట్టుకో. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పకు" అని రాసి వుంది.
ఆ ఉత్తరాన్ని, డబ్బులను చూసి ఆ పిల్లవాడు ఆనందంతో పొంగిపోయాడు. "భగవంతుడే నాకు తోడుగా ఉన్నాడు" అని సంబరపడ్డాడు.
అప్పటినుంచి మరింత పట్టుదలగా చదవసాగాడు. అవసరమైనప్పుడల్లా ఉత్తరం రాయడం ఆలస్యం డబ్బులు వచ్చి పడేవి. అలా ఇంటర్ తో బాటు ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతాన్ని "దేవుడా ఇదంతా నీవు నాకు పెట్టిన బిక్షే" అంటూ తీసుకుపోయి దేవుని హుండీలో వేశాడు.
ఒక పేద అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. మొదటి శుభలేఖ ఆ దేవునికే పంపాలి అని దానిపై చిరునామా రాశాడు. అది చూసి ఆ అమ్మాయి "అదేంది దేవుడు, స్వర్గం అని రాస్తున్నావు. ఉత్తరాలు ఎక్కడైనా భగవంతునికి చేరుతాయా" అంది ఆశ్చర్యంగా.
అప్పుడు ఆ యువకుడు ఆమెకు జరిగిందంతా చెప్పాడు. ఆమె కాబోయే భర్త అమాయకత్వానికి నవ్వుకొని "దేవుడు అలా పంపించడం అసాధ్యం. దీని వెనక ఎవరున్నారో కనుక్కుందాం" అంది.
తర్వాతరోజు "స్వామీ... నాకు అత్యవసరమైన పనిబడింది. ఒక పదివేలు సహాయం చేయండి" అని ఒక ఉత్తరం రాసి దాన్ని తీసుకొని పోయి దేవుని హుండీలో వేశారు. దూరంగా కూర్చుని ఆ హుండీనే గమనించసాగారు. కాసేపటికి గుడి పూజారి వచ్చి హుండీలోని కానుకలు అన్నీ బయటకు తీశాడు. అందులో ఆ పిల్లవాడు రాసిన ఉత్తరం కనబడింది. దాన్ని చదివి ఎవరికో ఫోన్ చేశాడు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీసుకు పోయి పదివేలు మనియార్డర్ చేశాడు.
అది చూసిన ఆ యువకునికి తనను ఆదుకుంటున్న దేవుడు ఎవరో అర్థమైంది. వెంటనే పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆయన "నాయనా నీకు డబ్బులు పంపిస్తున్నది నేను కాదు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఒక తెలుగు టీచర్. నువ్వు మొదటిసారి ఉత్తరం రాసి హుండీలో వేసినప్పుడు నేను చదివి దానిని పక్కన పెడుతుంటే అప్పుడే గుడికి వచ్చిన ఆ టీచర్ గమనించాడు. అంతా చదివేసరికి ఆయనకి చాలా జాలి వేసింది. రహస్యంగా నీ గురించి విచారణ చేశాడు. నువ్వు అమాయకునివని, అనాధవని, చదువు తప్ప ఏమీ తెలియదని తెలుసుకుని నీకు సహాయం చేయడం మొదలు పెట్టాడు. అతను బదిలీపై వెళ్ళిపోతూ నీ నుంచి ఎప్పుడు ఉత్తరం వచ్చినా తనకు తెలియజేయమని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి నీవు ఉత్తరం రాసిన వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్పగానే డబ్బు పంపే ఏర్పాటు చేస్తున్నాడు" అని చెప్పాడు.
ఆ తెలుగు టీచర్ ఏ ఊరికి బదిలీ అయ్యాడో కనుక్కొని ఇద్దరూ ఆ ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక ఆ చిరునామా పట్టుకుని ఇంటికి వెళ్లారు. అది చాలా పాత ఇల్లు. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. తలుపు మూసి ఉంది. చిన్నగా కొట్టారు.
ఒక ముసిలామె వచ్చి 'ఎవరు' అంటూ తలుపుతీసింది.
"అమ్మా... సార్ ఉన్నాడా" అని అడిగారు.
ఆమె వాళ్ళ వంక చూసి "ఇంకెక్కడి సారు నాయనా... ఈ లోకాన్ని వీడి మూడు సంవత్సరాలవుతా ఉంది. ఇంతకూ మీరెవరు. ఇంత దూరం వచ్చారు" అంది.
సారు చనిపోతే తమకి డబ్బులు ఎవరు పంపిస్తున్నారో అర్థంకాక తన గురించి వివరించాడు.
దానికి ఆమె ఆ పిల్లవాణ్ణి ఆప్యాయంగా చూస్తూ "నాయనా... నిన్ను ఇదే మొదటిసారి చూడడం. అందుకే గుర్తుపట్టలేకపోయాను. సారు చనిపోతూ చనిపోతూ నీ గురించి చెప్పాడు. ఎన్ని కష్టాలలో ఉన్నా నీకు మనియార్డర్ పంపడం మాత్రం మానకూడదు. అని మాట తీసుకున్నాడు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే పింఛన్ డబ్బులో నీకు పంపిస్తున్నాను" అనింది.
ఆ మాట వినగానే ఆ పిల్లవాడు కదిలిపోయాడు.
ఆమె కాళ్లు పట్టుకొని "అమ్మా... ఎందుకు నామీద అంత ప్రేమ మీకు, మీ ఆయనకి" అన్నాడు కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉంటే.
ఆమె ఆ పిల్లవాని తల నిమురుతో "నాయనా మా ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడే ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ తరువాత పిల్లలు ఎవరూ పుట్టలేదు. వాడు చానా అమాయకుడు. అచ్చం నీలాగే వుంటాడు. మా ఆయన నీలో తన కొడుకుని చూసుకున్నాడు" అని చెప్పింది.
ఆ యువకుడు నెమ్మదిగా పైకి లేచాడు. "అమ్మా... నేను అనాధను కాను. మీ బిడ్డనే. ఇకనుంచి నీలో నా తల్లిని చూసుకుంటాను. నాకు దారి చూపించిన మీకు చివరి వరకు తోడుగా నిలబడతాను" అంటూ ఆమె చేయి పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment