☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
91. అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యోదేవతా చంద్రమా
దేవతా...వరుణో దేవతా
అగ్ని, వాయువు, సూర్య, చంద్ర, వరుణాదులు దేవతలు(యజుర్వేదం)
దేవతలు - అంటే ఎక్కడో పైలోకాల్లో మాత్రమే ఉన్నవారు కారు. మన వేదవిజ్ఞానం ప్రకారం పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన నుండి సృష్టి నిర్వహణకై వెలువడిన అనంత
శక్తులే దేవతలు. అగ్ని, వాయు, సూర్య, చంద్ర, జలాదులు మనకు ప్రత్యక్షంగా కనబడేవి. ఇవేవీ జడ పదార్థాలు కావు. వీటి యందు వ్యాపించిన ఈశ్వర చైతన్యాన్ని
దేవతలుగా కొలుచుకుంటున్నాం.
అగ్ని - వాత(వాయు) - సూర్య..... మొదలైన పేర్లు చెబుతున్నా వాటిలోని 'దేవతా' శబ్దం సమానంగా ఉన్నది. అది మారడం లేదు. తద్దేవతా శక్తియే ఆయా రూపాలుగా అనుగ్రహిస్తున్నదని అర్థం.
( విశ్వమంతా వ్యాపించిన పంచభూతాది శక్తులు, వివిధ భావనాశక్తులు...వీటి ప్రభావమే సుఖదుఃఖాలకు హేతువులు. వాటిని మనకి అనుకూలంగా
ప్రసరింపజేసుకొని విశ్వమంతా ఈశ్వరమయంగా దర్శించే శాస్త్రీయమైన తాత్త్వికత మన హిందూ ఆరాధనా సంప్రదాయంలో ఉంది.)
దేవత ఒక ప్రకృతి స్వరూపంగా జనోపయోగం కోసం తనను తాను ఆవిష్కరించు కుంటున్నది. అగ్ని మనకి ఉపయుక్తమయ్యే ప్రకృతి పదార్థం. ఇలా వ్యక్తమైన ఈశ్వర
చైతన్యం అగ్ని దేవత. అగ్ని లక్షణంలోని విశిష్టతలు ఈ దేవతా రూపంలోను, మంత్రంలోను, పూజావిధానంలోను వ్యక్తమవుతాయి. అలాగే అగ్నికున్న విభిన్న విశేషాలు విభిన్నాగ్ని రూపాలుగా వేదపురాణాలు వర్ణించాయి. ఉదా: వైశ్వానరాగ్ని,
అంగిరాగ్ని మొదలైనవి.
ఇదే విధంగా జలం మొదలైన వాటికి కూడా దేవతా రూపాలున్నాయి. ఈ
దేవతలు, మన చుట్టూ ఉన్న పంచభూతాది శక్తులుగానే కాక, పంచభూతాదిమయమైన
మనలోనూ ఉన్నారు. మనలో ఉండే ఆత్మచైతన్యం వివిధ ఇంద్రియ, ఉపేంద్రియాలలో వివిధ రీతులలో వ్యక్తమౌతున్నట్లే ఈశ్వరచైతన్యం విశ్వమంతా విభిన్నంగా
వ్యక్తమౌతోంది. ఇదే వ్యష్టి - సమష్టి సమన్వయం. ఇంద్రియాలకు విడివిడిగా శక్తులున్నా
- అన్నిటికీ మూలం మన హృదయంలో ఏకంగా దీపించే చైతన్యమే. ఇలా విశ్వమంతా
దేవతామయం.
ఇంక మనలోనూ, ఈ విశ్వంలోనూ వ్యక్తమయ్యే వివిధ భావాలను వాటి
శక్తులను కూడా పరిశీలిస్తే, వాటిలోని దివ్యత్వాన్ని తెలుసుకోగలం. వాక్కు,
జ్ఞానం...మొదలైన బౌద్ధికశక్తులలోని దివ్యత్వాన్ని పరిశీలిస్తే వాగ్దేవి అనే దేవతను ధ్యానించగలం. తద్దేవతా ధ్యానాదుల వలన - వాక్ జ్ఞానశక్తుల సమృద్ధిని పొందగలం.
విశ్వవ్యాపకమైన వాక్ జ్ఞాన రూప మహాచైతన్యాన్ని మనలోని వాగ్బుద్ధులతో అనుసంధానించి తచ్ఛక్తిని గ్రహించడమే వాగ్దేవి ఉపాసన. ఇలాగే ఐశ్వర్యశక్తిని
లక్ష్మిగా, ప్రతాపశక్తిని దుర్గగా ఆరాధిస్తున్నాం. శ్రద్ధ, మేధ, ప్రజ్ఞ, సంతుష్టి, ధర్మం,కీర్తి, ప్రతిష్ఠ, పుష్టి, శాంతి... మొదలైన వాటి దివ్యత్వాన్ని కూడా దేవతలుగా కొలుచుకుంటున్నాం. తద్వారా వాటిని సమృద్ధిగా పొందగలం.
అయితే - పై చెప్పినవన్ని లోకోపకార శక్తులు. అలాగే శిక్షారూపంగా సవరించే విపరీత శక్తులు కూడా ఉంటాయి. అవి - అధర్మం, కలహం, అలక్ష్మి మొదలైనవి.వీటికీ శక్తి ఉంది కనుక దేవత్వం ఉంది. కానీ ఇవి పాపులపై పనిచేసే శక్తులు. అవి
మనజోలికి రాకూడదని, ఆ శక్తులను దూరంగా ఉండమని కోరుకోవాలి.
మొత్తానికి తేలినదేమిటంటే... విశ్వమంతా వ్యాపించిన పంచభూతాది శక్తులు,
వివిధ భావనాశక్తులు... వీటి ప్రభావమే సుఖదుఃఖాలకు హేతువులు. వాటిని మనకి
అనుకూలంగా ప్రసరింపజేసుకొని విశ్వమంతా ఈశ్వరమయంగా దర్శించే శాస్త్రీయమైన తాత్త్వికత మన హిందూ ఆరాధనా సంప్రదాయంలో ఉంది.
పనికొచ్చే ప్రతి ప్రకృతి అంశాన్నీ దైవంగా దర్శించే ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేనివారు దౌర్భాగ్యవంతులే. మన ఋషుల దర్శన శక్తిలోని దేవతలను సంభావించి
ధన్యులమవుదాం.
No comments:
Post a Comment