Vedantha panchadasi:
పారోక్ష్యేణ విబుద్ధ్యేన్ద్రో య ఆత్మేత్యాదిలక్షణాత్ ౹
అపరోక్షీకర్తు మిచ్ఛంశ్చతుర్వారం గురుం యయౌ ౹౹67౹౹
67.ఇంద్రుడు లక్షణముల ద్వారా బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానము సంపాదించెను.
అపై దానిని అపరోక్షము చేసికొనగోరి నాలుగు పర్యాయములు గురువు చెంతకు పోయెను.
ఆత్మా వా ఇదమిత్యాదౌ పరోక్షం బ్రహ్మ లక్షితమ్ ౹
ఆధ్యారోపాపవాదాభ్యాం ప్రజ్ఞానం బ్రహ్మదర్శితమ్ ౹౹68౹౹
68. సృష్టికి పూర్వము ఆత్మ మాత్రమే ఉండెను మొదలగు వాక్యముల వలన బ్రహ్మము పరోక్షముగ చెప్పబడినది. అధ్యారోప అపవాదముచే ప్రజ్ఞానం బ్రహ్మయని చెప్పబడినది.
వ్యాఖ్య:- తైత్తిరీయ శ్రుతి ననుసరించి భృగువుకు పరోక్షజ్ఞానపూర్వకమైన విచారణద్వారా సాక్షాత్కార స్వరూపాన్ని చూపించి,ఇక ఛాందోగ్యాన్ని బట్టి పరిశీలిస్తున్నారు.
"య ఆత్మాఽ పహత పాప్మా విజరో విమృత్యుర్విశోకః"
ఛాం.8-7-1
ఈ ఆత్మ పాపంలేనిది.
జరా మృత్యువులుగాని శోకంగాని లేనిది , అంటూ దేవతలకు రాజైన ఇంద్రుడు పై లక్షణాలు కల ఆత్మను పరోక్షరూపంలో స్థూల,సూక్ష్మ,కారణ శరీరాల విషయమై బాగా ఆలోచన చేసి వాటిని నిరాకరించి,
ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం నాలుగుసార్లు ప్రజాపతి దగ్గరకు వెళ్ళినట్లు ఛాందోగ్యం ఎనిమిదవ అధ్యాయంలో ఉంది.
దేవేంద్రుడు సకలభోగములను విడిచి పెట్టి 101 సంవత్సరములు ఆత్మజ్ఞానము కొరకు ప్రజాపతి దగ్గర కఠోర తపస్సు చేసియుండెను.
అంటే ,
ముందు పరోక్షరూపములో తెలుసుకొని పిమ్మట అపరోక్షజ్ఞనాన్ని కోరి గురువు దగ్గరకు వెళ్ళాడు.
ఆత్మజ్ఞానము కొరకు ఎన్ని కష్టములనైనను భరించవలయునని తెలియుచున్నది.
ఐతేరేయ శ్రుతిలో సైతం -
'ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీన్నాన్యత్కించన మిషత్'-
ఐత.1-1-1
సృష్టికి పూర్వం ఈ ఆత్మతత్త్వం ఒక్కటే అవ్యక్తంగా ఉంది.ఇంతకు మించి క్రియాశీలమైనది ఏదీలేదు.
'స ఈక్షత లోకాన్ను సృజా ఇతి'
ఐత.4-1-2
తాను లోకాన్ని సృజించాలి అని ఈ క్షణపూర్వకమైన సంకల్పం చేసాడు.
'తస్య త్రయ ఆవసథాస్త్రయః స్వప్నా అయమావసథోఽ యమావసథోఽ యమావపథః'
ఐ.4-3-12
ఆ ప్రత్యగ్రూపమైన పరమాత్మకు కన్ను,మనస్సు,హృదయాకాశం అనేవి మూడు స్థానాలు.
"స జాతో భూతాన్యభివ్యైక్షత కిమిహాన్యం వాసవిషత్" -
ఐ.4-3-12
జీవభావంతో ఉత్పన్నమైన పరమాత్మ ,భూతాల్ని తదాత్మ్య భావంతో గ్రహించాడు.నాకంటె అన్యులెవరున్నారు ? అని అన్నాడు.
'స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమపశ్యదిదమదర్శమితి'-
ఐ.4-3-12
నేను బ్రహ్మను చూచాను అంటూ అతడు ఆ పురుషుణ్ణి పూర్ణ బ్రహ్మరూపంలో చూచాడు.
"పురుషే హవా..."- ఐ.5-4-1
అన్నిటికంటె ముందు పురుష శరీరంలోనే శుక్రరూపంలో, గర్భరూపంలో పురుషుని ప్రథమజన్మ జరుగుతోంది.
"కోఽ యమాత్మేతి వయముపాస్మహే " - ఐ.5-5-1
మనం ఉపాసించే ఆత్మ ఏది ?
"ప్రజ్ఞానం బ్రహ్మ" -ఐ.6-5-3
ప్రజ్ఞానమే బ్రహ్మ.
"ఆత్మ వా ఇదమేక ఏవాగ్ర" తో ఆరంభించి,
'తస్యత్రయ అవసథా' అనే వాక్యం వరకు పరమాత్మ యందు జగత్తును అధ్యారోప ప్రకారముగా చెప్పి,
'సజాతో....వావదిత్' అనే వాక్యంతో ఆరోపితమైన జగత్తును నిషేదధించటం ద్వారా అపవాదాన్ని చూపించి,
'స ఏతమేవ పురుషం బ్రహ్మ...'
అనే వాక్యంతో ప్రత్యగాత్మ బ్రహ్మమే అని నిర్ధారించారు.
"పురుషే హ వా..."ఇత్యాది వాక్యాలతో జ్ఞానానికి సాధనమైన వైరాగ్యం కలగటం కోసం గర్భవాసాది ఘోరదుఃఖాల్ని చూపించారు.
"కోఽ యమాత్మేతి...."అని
విచారణ చేస్తూ "తత్" "త్వమ్"
పదాల అర్థాన్ని శోధించి చివరకు 'ప్రజ్ఞానం బ్రహ్మ' అంటూ ప్రజ్ఞానరూపమైననట్టి ఆత్మయే బ్రహ్మముయని ప్రతిపాదించారు.
అవాన్తరేణ వాక్యేన పరోక్షా బ్రహ్మధీర్భవేత్ ౹
సర్వత్రైవ మహావాక్య విచారాదపరోక్షధీః ౹౹69౹౹
69. ఇతర శ్రుతివాక్యముల నుండి బ్రహ్మము గూర్చిన పరోక్షజ్ఞానము పొందవచ్చును. మహావాక్యములను విచారించుట వలననే సర్వదా అపరోక్షజ్ఞానము కలుగును.
బ్రహ్మాపరోక్ష్యసిద్ధ్యర్థం మహావాక్య మితీరితమ్ ౹
వాక్యవృత్తావతో బ్రహ్మాపరోక్ష్యే విమతిర్నహి ౹౹70౹౹
70.వాక్యవృత్తియందు బ్రహ్మమును అపరోక్షము చేసికొనుటకు మహావాక్యము ఉద్దేశింపబడినదని చెప్పబడినది.కనుక ఆ విషయమునందు సంశయము లేదు.
వ్యాఖ్య:- సర్వత్రా శ్రుతులు స్వస్వరూపబోధకమైన అవాంతర వాక్యాల ద్వారా బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. కానీ,మహావాక్యములను విచారించుట వలననే సర్వదా అపరోక్షజ్ఞానమైన
జీవ బ్రహ్మైక్యజ్ఞానం లభిస్తుంది.
మహావాక్యములు అపరోక్షజ్ఞానము కొరకనుటకు ఏమి ప్రమాణమనిన ,
శంకర భగవత్పాదుల వాక్యవృత్తియే ప్రమాణమని చెప్పుచున్నాడు.
వాక్యవృత్తియందు బ్రహ్మమును అపరోక్షము చేసికొనుటకు మహావాక్యము ఉద్దేశింపబడినదని చెప్పబడినది.కనుక ఈ విషయమునందు సంశయము లేదు.
అందలి 44,45,46,48; 38-41 శ్లోకములే ఇప్పుడు
71 నుండి 78 వరకు ఉధృతములగుచున్నవి.
బ్రహ్మనిరూపణం చేసే వాక్యాలను మహావాక్యాలందురు.
మహావాక్యము లనేకములు గలవు.వాటిలో నాలుగు వేదముల సారమును బోధించు వాక్యములున్నవి.అవి
ఉపనిషత్తులలో చెప్పబడిన నాలుగు మహావాక్యములు.ఈ నాలుగు మహావాక్యములు అఖండార్థమును నొక్కివక్కాణించుచున్నవి.
1)"ప్రజ్ఞానం బ్రహ్మ" -సర్వమును తెలియు ప్రజ్ఞయే బ్రహ్మము.
బుగ్వేదము -ఐతరేయోపనిషత్తు -
లక్షణవాక్యము.
ముక్యార్థముతో సంబంధించిన జ్ఞానమే లక్షణయని చెప్పబడుచున్నది.
2)"అహం బ్రహ్మాస్మి" -
నేను బ్రహ్మమయితిని -
యజుర్వేదము -
బృహదారణ్యకోపనిషత్తు -
అనుభవవాక్యము.
3)"తత్త్వమసి" -
నీవు ఆపరబ్రహ్మమయితివి -
సామవేదము -
ఛాందోగ్యోపనిషత్తు -
ఉపదేశవాక్యము
4)"అయమాత్మ బ్రహ్మ" -
ఈ జీవాత్మయే పరబ్రహ్మము -
అథర్వణ వేదము -
మాండ్యూకోపనిషత్తు -
సాక్షాత్కారవాక్యము.
ఈ నాలుగు మహావాక్యాల ద్వారా మోక్షకాంక్షియైనవానికి జీవబ్రహ్మైక్యజ్ఞానం లభిస్తుంది.
శ్రోత్రియుడు,బ్రహ్మనిష్ఠుడు అయిన గురు ముఖం నుండి వెలువడిన మహా వాక్యార్థం వల్ల కలిగిన
అపరోక్ష ఆత్మజ్ఞానము వలన సంసారానికి కారణభూతమైన అజ్ఞానం,
చండభాస్కరుని కిరణాలవల్ల చీకటి తొలగి పోయినట్లు గా తొలగిపోతుంది.
No comments:
Post a Comment