*శంబల - 21*
💮
*రచన : శ్రీ శార్వరి*
*శంబల జీవనం - 4*
“మేడం! ఏ వ్యాపకం లేక ఇక్కడ నాకు బోర్ గా ఉంది” అని అడిగాను.
“అప్పుడేనా? వచ్చి ఎంత కాలమైందని? ఏం తెలుసుకున్నావని? అసలు మిమ్మల్ని రప్పించింది ఎవరో, ఏ పని మీద ఇక్కడికి పిలిపించారో నాకు తెలియదు. వచ్చాక పని కాకుండానే వెళ్లిపోతారా? శంబల రావడం వెళ్లడం మీ ఇష్టం కాదు. మాస్టర్ల అనుమతి కావాలి దేనికైనా.” అంది.
“ఆ మాస్టర్లు ఎవరూ కనిపించడంలేదు. నాకు పిచ్చిపడుతోంది.”
“పట్టిందిగా శంబల పిచ్చి! పట్టిన పిచ్చి వదలగొట్టి పంపుతాలే.”
"నేను వెళ్లిపోవాలి మేడం! అక్కడ సగంలో ఆపిన పనులున్నాయి. పూర్తి చేయాలి."
"ఇక్కడ ఉండి అక్కడి పనులు పూర్తి చేయలేరా? ఆలయాలు చూడకుండానే వెళ్లిపోతే ఎలా? శంబల రహస్యం ఆ ఆలయాల్లో ఉంటుంది.”
"ఆలయదర్శనం అయ్యేలోగా నా పని అయ్యేట్లుంది. అసలు ఆలయాల్లోకి నన్ను అనుమతించకపోతే ఎలా?"
"నేను గ్యారంటీ. మీ విషయాలన్ని చూచే బాధ్యత నాది."
"ఇక్కడ తిండి, తిప్పలు లేకుండా ఎట్లా బ్రతకడం మేడం?"
"మేం బ్రతుకుతున్నట్లే మీరూ కూడా బ్రతుకుతారు" అన్నది కూల్ గా.
"ఇదీ ఒక బ్రతుకేనా?" అనుకున్నాను. పైకి అనలేదు.
"ఇదే బ్రతుకు మిత్రమా, మీరు ఎంతకాలం బ్రతికినా మీ బ్రతుకులు అశాశ్వతం. ఇక్కడ అంతా శాశ్వతం."
"ఇలా ఎంతకాలం జీవించాలి? జీవించి ఏం ప్రయోజనం? నా వల్ల కాదు మేడం నేను మనిషిని, మీలాగా దేవతని కాను."
“ఎప్పటికైనా ఇక్కడికి రావలసిందేగా. మీరు చేస్తున్న యోగం, తపస్సు ఇందుకొరకేగా."
"అప్పుడు చూద్దాంలేండి. ఇప్పటికి ఇక్కడి నుండి బయటపడే మార్గం చూపండి. మీకు ఆజన్మం రుణపడి ఉంటాను."
"మార్గం తెలుసు. కాని చెప్పలేను. మీరు వెళ్లడానికి నేను పర్మిషన్ ఇవ్వలేను. మాస్టర్స్ పర్మిషన్ కావాలి దేనికైనా. నేను చెప్పడానికైనా, మీరు వెళ్లడానికైనా."
"ఆలయాలకు వెళ్లే మార్గం చూపించండి. వెళ్లి మాస్టర్స్ నే అడుగుతాను."
"మీరు వెళ్లి అడిగితే వాళ్లు పలకరు శార్వరీ. అసలు నీ కళ్లకు వాళ్లెవరూ మీకు కనిపించరు. మీ ఆత్మశక్తి ఇంకా ఎక్కువ ద్విగుణీకృతం కావాలి స్వామి".
"నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అదైనా చెప్పండి ఎట్లా చావాలో?"
"నా వల్ల కాదు స్వామి" నవ్వుతూ అన్నది ఆమెగారు.
"ఏదో సామెత చెప్పినట్లు పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం. అట్లా ఉంది నా స్థితి."
"స్వామీ నువ్వు ఎలకవు కావు, పిల్లి కూనవు. యోగ కూనవు. అయినా మాస్టర్స్ ముద్దు పట్టివి. అభిమాన బిడ్డవు కదా.”
“మేడం, వచ్చే జన్మలో మీ కడుపున పుడతాను. నన్ను రక్షించండి. దయచేసి నన్ను వెళ్లిపోనీయండి.”
"అంటే నిన్ను మళ్లీ కనడం కోసం నేను పుట్టాలా? పురిటి నొప్పులు పడాలా ? భలే వాడివే. ఇక్కడ శంబలలో ఎవరికీ కడుపులు రావు బాబూ. ఎవరూ కనరు? అంతా ఆత్మ సంతానం. సద్యోగర్భాలు, సద్యోసంతానం. ఎవరికెవరు ఏమీ కారు తెలుసా!"
"మేడం! మీరు ఏది చెప్పినా చేస్తాను. దయచేసి నా విషయం కాస్త మాస్టర్లకు రికమెండ్ చేయండి ప్లీజ్.”
"సరే. ఆలయ భూములకు పోదాం వద. ఆలయాలు చూసినట్లు ఉంటుంది. నీ పర్మిషన్ ఏదో నీవే తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత నన్ను కూడా మీ ప్రపంచంలోకి తీసుకుపోతారా స్వామి?"
"మిమ్మల్నా?"
"ఏం తగనా? అక్కడ నాకు బాగానే ఉంటుంది. యోగీ మీతో వస్తాను. నేను ఎక్కడైనా adjust కాగలను తెలుసా!"
"వద్దు మేడం! మా ప్రపంచంలో కష్టాలు మీరు పడలేరు. అక్కడ మేమే బ్రతకలేక చస్తున్నాం. చావలేక బ్రతుకుతుంటాం. Horrible Life."
“ఫరవాలేదు. కష్టపడతాను. నాకూ అనుభవం కావాలిగా."
తారామాత వెంట బయలుదేరాను. నా వెంట దేవి బయలుదేరింది.
“ఈమె గారికీ పిల్లలంటే ప్రేమ ఎక్కువే” అనుకున్నాను.
"ఇక్కడ మొగుళ్లు, పిల్లలు, వాళ్ల మీది ప్రేమలు నామ మాత్రం స్వామీ, మీలాగా వెంపర్లాడరు. ఎవరికి వారే! ఎవరికి ఎవరూ ఏమీ కారు. ఎప్పుడన్నా ఎక్కడున్నా కనిపిస్తే, గుర్తిస్తే 'ఓహ్' అనుకుంటారు. అవి బంధాలు కావు. అనుబంధాలు కావు. ఉత్తి ఆత్మ సమీకరణాలు. ఇక్కడ ప్రేమ కామ మయం కాదు. మీ ప్రపంచం ప్రేమ రహితం, కామపూర్ణం. అంతే తేడా.
"అందుకే మేడం! బోర్ అంటున్నది?"
ఆమె అన్నది "మీ జీవితాలే హాయి యోగీ. స్వర్గం, స్వర్గం అంటూ ఊహిస్తూ సుఖపడిపోతారు. స్వర్గంలోని దేవతలకు మీరంటే ఇష్టం. భూమి పైకి రావాలని తెగ ఉబలాట పడుతుంటారు. స్వర్గంలో లేని సుఖాలు భూమి పైన ఉంటాయని దేవతల భావం. భూమి పైకి వచ్చినవారు తిరిగి స్వర్గం చేరరు తెలుసా? శంబల చేరుతుంటారు.”
"ఏం? స్వర్గానికి తిరిగిపోరా?"
"అదెక్కడ ఉంది స్వామి?”
ఒక కొండ ఎక్కి అంచున క్రిందికి దిగాం. ఒక గంట నడిచాం. మరొక గంట ప్రయాణం తర్వాత ఒక గుహ దగ్గరికి చేరుకున్నాం.
"ఈ గుహలో కూర్చుని శంబల ధ్యానం చేయండి. నెగెటివ్ ఆలోచనలు పూర్తిగా వదలండి. పూర్తిగా శూన్యం అయిపోండి. అసూయ, ద్వేషం, ఆశ, భయం ఏవీ ఉండకూడదు. భయపడ్డారో ఢాకినీ వస్తుంది.
నాకు నిజంగానే భయం వేసింది. వెంటనే నా ముందు ఒక మంచు మనిషి ప్రత్యక్షమైనాడు. అది ఢాకినీ అని భయంతో కళ్లు మూసుకున్నాను.
ఢాకినీ కాదు. అది బ్రహర్షి భార్గవ.
"హలో గురూజీ! పిలిచారా?" నవ్వుతూ అడిగాడు.
"పిలిచానా! భయంతో గావుకేక వేశానా!"
“అయితే నువ్వు ఎట్లా ఇక్కడ?""ఈ బాట నాకు తెలుసు గురూజీ. రండి పోదాం."
అది కలా? భ్రాంతా?
"పదండి. మిమ్మల్ని తిరిగి పంపిస్తాను" అంది తారాదేవి.
"పర్మిషన్ వచ్చింది యోగీ! సరిహద్దులు దాటిస్తాను పదండి!"
కళ్లు మూసుకుని కూర్చున్నాం. మరు నిమిషంలో షిగాట్సేలో ఉన్నాం భార్గవ, నేను.
తారాదేవి కనిపించలేదు.
🪷
*బై... బై... శంబల*
తిరుగు టపాలో లాసా చేరుకున్నాం.
ఖాట్మాండు చేరితే ఢిల్లీ చేరుకున్నట్లే. రెండు గంటలు ప్రయాణం. శంబల గురించి ఇంకా తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది.
అక్కడకు దగ్గరలో షిగాట్సే వద్ద 'తాషీలామా' ఆశ్రమం ఉందని భార్గవ చెప్పాడు. అప్పుడప్పుడు భార్గవ మంచి విషయాలు చెబుతాడు. పాపం అతడు మంచివాడే! మంచి మనసున్నవాడు. ఆయనతో ఒక రోజు గడపాలని నిర్ణయించుకున్నాం. భార్గవ లామా అపాయింట్మెంట్ తీసుకువచ్చాడు. ఇద్దరం లామాసరి చేరాం. భార్గవ్ కి అది తెలిసిన రూటే! సులభంగానే లామాతో భేటీ కుదిరింది.
ప్రశ్న : "మాస్టర్ లామా! మీరు బోధి సత్వులు, జ్ఞాన సంపన్నులు. దయచేసి శంబల గురించి మీ అనుభవాలు చెప్పండి. శంబల గురించిన విషయాలు ఎవరూ ఏవీ లోకానికి తెలియనివ్వరు ఎందుచేత?”
'కాలచక్రం' ప్రసిద్ధి దాని గురించి వివరంగా చెప్పండి."
“మీరు ఇండియా నుండి వచ్చారు గనుక మీకు గౌతమ బుద్ధుని గురించి తెలిసే ఉంటుంది. కాలచక్రం గురించి తెలుసుకు నే అర్హత మీకు ఉందనే నా అభిప్రాయం. మీరంటే మా టిబెట్ బౌద్ధులకు చాలా ఇష్టం. చాలా ప్రేమ, గౌరవం ఇండియా నుండి ఎవరు వచ్చినా బుద్ధుని వారసులని మా నమ్మకం.”
“ఇంతకాలం మాకు గర్వంగా ఉండేది బౌద్ధం శంబలలో సురక్షితంగా ఉందని. దాని పవిత్రతను మౌలికతను కాపాడుతు న్నామని. ఈ మధ్య తెలిసింది టిబెట్ లోని బౌద్ధంలో బౌద్ధధర్మం తగ్గిపోయింద ని. బౌద్ధంలో మంత్రాలు, తంత్రాలు ప్రవేశించాయి. ఇక్కడి బౌద్ధంలో ధర్మం కనిపించకుండా పోయి తంత్రం ఒక్కటే పైకొచ్చింది. బౌద్ధం పేర గారడీ విద్యలు ప్రాచుర్యం పొందాయి. అసలు బౌద్ధం తిరిగి జన్మభూమికి చేరుతోంది. ఈనాడు బుద్ధగయకున్న ప్రాధాన్యం టిబెట్ కి లేదు. లామాల ఉద్ధతి తగ్గిపోయింది.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment