Friday, January 31, 2025

****సన్యాసము... త్యాగము.....*

 *సన్యాసము... త్యాగము.....*

కోరిక చే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మఫలితాలు విడిచి పెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన, తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.

త్యాగం విషయంలో చిత్తశుద్దిని కల్గించు యాగ, దాన, తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు. వాటిని కూడా మమకారం లేక, ఫలాపేక్ష లేకుండా చేయాలి. కర్తవ్యాలను విడిచి పెట్టడం న్యాయం కాదు. అలా విడవడం తామస త్యాగం.
శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం. దానికి ఫలితం శూన్యం.

శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ, కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్వికత్యాగం. ఇలా చేయువాడు, సందేహాలు లేనివాడై ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు. సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు.
శరీరం కల్గినవారు కర్మలను వదలడం అసాధ్యం. కాబట్టి కర్మఫలితాన్ని వదిలే వాడే త్యాగి.

ఇష్టము, అనిష్టము, మిశ్రమము ..అని కర్మఫలాలు మూడు రకాలు. కోరిక కల్గిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును. కర్మఫల త్యాగులకు ఆ ఫలితాలు అందవు.

శరీరం, అహంకారం, ఇంద్రియాలు, ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు, పరమాత్మ అను ఈ ఐదే అన్ని కర్మలకూ కారణమని సాంఖ్య శాస్త్రం చెప్తోంది.

మనస్సు, మాట, శరీరాలతో చేసే అన్ని మంచి, చెడు కర్మలకూ ఈ ఐదే కారణము. ఈ విషయాలు తెలియనివారు, చెడ్డ భావల వారు మాత్రం తమే చేస్తున్నట్టూ అహంకారంతో తిరుగుతారు. తను పని చేస్తున్నానన్న అహంకారం లేనివాడు, అజ్ఞానం లేనివాడు ఈ లోకం లో అందరినీ చంపినా సరే.. ఆ పాపం వాడికి ఏ మాత్రమూ అంటదు.

జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత ..అని మూడు కర్మ ప్రోత్సాహకాలు. అలాగే..

కర్త, కర్మ, సాధనం.. అని కర్మ సంగ్రహం మూడు రకాలు.

జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం మూడేసి విధాలుగా ఉన్నాయి...

జ్ఞానం...

1) విభిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశమై, మార్పు లేని, ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం.

2) ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం.

3) ఏది చూస్తే అదే సర్వమని అనుకొనే జ్ఞానం తామస జ్ఞానం.

కర్మ...

1) అభిమాన, మమకార, ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం.

2) ఫలితం పైన ఆసక్తితో, అహంకార అభిమానాలతో, చాలా కష్టంతో చేయునవి రాజస కర్మలు.

3) మంచిచెడ్డలను, కష్టనిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామస కర్మ.

కర్త...

1) ఫలితం పైన ఆశ పెట్టుకోకుండా, నిరహంకారియై, ఫలితం లోని మంచిచెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పని చేయువాడు సాత్విక కర్త.

2) ఫలితం పైన ఆశతో, అభిమానంతో, లోభగుణంతో, హింసతో, అశుచిగా, సుఖదుఃఖాలకు చలిస్తూ పని చేయువాడు రాజస కర్త.

3) ధైర్యం పోగొట్టుకొని, మూర్ఖత్వంతో, మోసంతో, దీనమనస్సు తో, వృథా కాలయాపంతో పనిచేయువాడు తామస కర్త.

బుద్ధి, ధృతి అనే ఈ రెండూ గుణబేధాలచే మూడు విధాలు...

బుద్ధి...

1) ధర్మాధర్మములందు ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్యాకర్తవ్యాలను, భయాభయాలను, బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి.

2) ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజస బుద్ధి.

3) ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామస బుద్ధి.

ధృతి...

1) మనసు, ప్రాణం, ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు.

2) ఫలితంపై అధిక ఆసక్తి, ధర్మ, అర్థ, కామాలందు చూపే అధిక పట్టూదలే రాజస ధృతి.

3) కల, భయం, బాధ, విషాదం, గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసికధృతి.

సుఖాలు మూడు విధాలు...

1) మొదట దుఃఖకరమైనా సాధన చేస్తున్నకొద్దీ సులవు అనిపించి, ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో ఆ అమృతమయ బుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం.

2) ఇంద్రియ సంయోగం వలన పుట్టేదీ, మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజస సుఖం.

3) ఎప్పుడూ మోహింపచేస్తూ, నిద్ర, ఆలస్య, ప్రమాదాలతో కూడినది తామస సుఖం.

త్రిగుణాలకు అతీతమైనది ఏదీ భూ, స్వర్గ లోకాలలో, దేవతలలో ఎక్కడా ఉండదు.

స్వభావ గుణాలను అనుసరించి నాలుగు వర్ణాలవారికీ కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి...

1) బాహ్య, అంతర ఇంద్రియనిగ్రహం, తపస్సు, శౌచం, క్షమ, సూటి స్వభావం, శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు.

2) శౌర్యం, తేజస్సు, ధైర్యం, వెన్ను చూపనితనం, సపాత్రదానం, ఉత్సాహశక్తులు క్షత్రియ కర్మలు.

3) వ్యాపారం, సేవావృత్తి వైశ్యులకు..

4) వ్యవసాయం, గోరక్షణ, శూద్రులకు స్వభావ కర్మలు.

తన స్వభావ కర్మలను శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతాడు. పరమాత్మను తనకు విధించబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు.

మాయ లేని నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించి, శబ్దాది విషయాలను వదిలి, రాగద్వేష రహితుడై, నిత్యమూ వైరాగియై, యేకాంత వాసంతో, అల్పాహారియై, మనస్సు, మాట, శరీరాలల్ను నియమబద్దం చేసి, ధ్యాన యోగియై, అహంకార, అభిమాన, కామ, క్రోధాలను వదిలి, విషయ స్వీకారం విడిచి, మమకారంలేని వాడై, శాంతచిత్తం కల్గినవాడే బ్రహ్మభావానికి అర్హుడు.

బ్రహ్మజ్ఞాని దేనినీ కోరడు. దేనికీ దుఃఖించడు. అన్ని భూతాలందూ సమ దృష్టి కల్గి ఈశ్వర భక్తిని పొందుతాడు. ఆ భక్తిని పొందినవాడు ఈశ్వరుడుని పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే ఈశ్వరుని లో ఐక్యం అవుతాడు. ఎన్ని పనులు చేస్తున్నా, ఈశ్వరుడుని నమ్మిన కర్మయోగి ఈశ్వరుడుని పరమపదమే పొందుతాడు.

అన్ని కర్మలూ ఈశ్వరుడికి అర్పించి సమ బుద్దిరూపమైన యోగం చేసి. ఈశ్వరుడె పరమగతి అని తెలుసుకొని నీ మనసును ఈశ్వరుని యందు లగ్నం చేయి. ఈశ్వరుడుని శరణు కోరితే ఆయన అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తారు.

సర్వభూతాలనూ తన మాయచే కీలు బొమ్మలలా ఆడిస్తూన్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అతడినే అన్నివిధాలా శరణు వేడు. ఈశ్వరుని దయచతనేే శాంతి, మోక్షం పొందుతారు...    

No comments:

Post a Comment