☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
92. పశ్యన్తి సర్వే చక్షుషా, న సర్వే మనసా విదుః
అందరూ కంటితో చూస్తున్నారు కానీ అందరూ మనస్సుతో తెలుసుకోలేరు
(అథర్వవేదం)
సూర్యభగవానుని గురించి వేదమాత చెప్పిన వాక్యమిది. కంటితో మనం చూసే సూర్యాది జ్యోతిస్సులలోని దైవత్వాన్ని మనస్సుతో భావించవలసినదే. కానీ మానవులు
కేవలం బాహ్యదృష్టితో సూర్యాదులను జడ ప్రకృతిగానే చూడగలుగు తున్నారు.
భౌతిక దృష్టితోనే పరిశీలిస్తున్నారు.
'మనసా' అనే మాటకి 'జ్ఞానముచే' అనే అర్థాన్ని కూడా భావించవచ్చు - 'మన అవబోధనే' అనే ధాత్వర్థాన్ని అనుసరించి.
సూక్ష్మమైన జ్ఞానముతో - స్థూలమైన సూర్యాదులలోని దేవతా చైతన్యాన్ని
గ్రహించగలం. కానీ ఆ జ్ఞానమును సంపాదించలేక, దానితో సత్యాన్ని
చూడలేకపోతున్నాం.
కంటితో దర్శించడం సర్వసామాన్యం. కానీ జ్ఞానముతో దైవతత్త్వాన్ని, ఆత్మతత్త్వాన్ని దర్శించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే "అందరూ” అనే మాట పై మంత్రంలో
ఉన్నది. స్థూలదృష్టి అందరికీ ఉంటుంది- సూక్ష్మదృష్టి అందరికీ ఉండదు. అదే పై మంత్రభావం. సూక్ష్మమైన దృష్టితోనే ఆత్మతత్త్వాన్ని తెలుసుకోగలం.
ఈ సూక్ష్మదృష్టినే 'జ్ఞానదృష్టి'... అంతర్ముఖావలోకనం.... ఇలాంటి మాటలతో వేదాంతవాఙ్మయం బోధిస్తోంది.
“అందరూ కేవలం బహిర్ముఖ ప్రవృత్తి గలిగిన ఇంద్రియాలననుసరించి ప్రపంచాన్ని అనుభవిస్తారు. ధీరుడైన ఏ ఒక్కడో మాత్రమే బహిర్ముఖత్వం నుండి వెనుదిరిగి అంతరృష్టితో ప్రత్యగాత్మను దర్శిస్తారు" కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్షత్అని ఉపనిషద్వచనం.
ఆ విధమైన బ్రహ్మజ్ఞానదృష్టిని అలవరచుకోవడానికే ఆధ్యాత్మిక సాధనలు. లోకంలో అవివేకి దృష్టికీ - భౌతిక విజ్ఞాని దృష్టికీ తేడా ఉన్నది కదా! అలాగే భౌతిక విజ్ఞానదృష్టికీ
ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టికీ తేడా ఉంది.
కేవలం పశుప్రాయమైన అవివేకి చూసే ప్రపంచం కన్నా, ఒక భౌతిక శాస్త్రవేత్త చూసే ప్రపంచదృష్టి విభిన్నమైనది. అంతకంటే ఆధ్యాత్మికవేత్త చూపు ప్రత్యేకం.
‘అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికమ్' - అని గీతాచార్యుని మాట.విడివిడిగా కనబడే ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఏకతత్త్వాన్ని చూడడమే ఉత్తమ జ్ఞానమని దీని భావం.
'పండితాః సమదర్శనః’
'యః పశ్యతి స పశ్యతి'
-
వంటి మాటలు ఈ 'దృష్టి' గురించే చెబుతున్నాయి. రకరకాల నగలను
చూసేటప్పుడు, అవన్నీ ఒకే సువర్ణంతో ఉన్నవని తెలుసుకోవడం ఏకదృష్టి. నగలుగా చూస్తే భిన్న దృష్టి. భిన్న దృష్టి అందరికీ సహజం. ఏకదృష్టియే వివేకంతో లభించేది.
ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం సామాన్యదృష్టి - పరమేశ్వరమయంగా దర్శించడం జ్ఞానదృష్టి. “మనసా విదుః" - అనే మాటలోని అర్థం ఇదే.
“... తస్మిన్ దృష్టే పరావరే” పరమాత్మ యందు దృష్టిని నిలిపినప్పుడు, హృదయగ్రంధి భేదింపబడి, సంశయములు ఛేదింపబడి, కర్మబంధములు క్షీణించి కైవల్యాన్ని
పొందుతాడని ఉపనిషత్తు పలుకు.
No comments:
Post a Comment