(541) (12.02.2026)
మూడు ముళ్ళ జీవితంలో అన్నీ సమస్యలే
తెల్లారి లేస్తూనే పలకరించేను ఎన్నో బాధలే
సంసారం అంటేనే అన్నీ సమకూర్చుకోవాలి
లేదు – కాదు అని అనుకుంటే ప్రతీదీ వెతుక్కోవాలి //
వచ్చే అర కొర జీతంతో జీవితాన్ని వెళ్ళదీస్తూ
ఫీజుల భారం మోయలేక చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివిస్తూ
ఒక పక్క పిల్లలకు అండగా ఉండాలి
మరో పక్క శ్రీవారికి చేతనైన సహాయం చేయాలి //
వయసు అయిపోయిన అత్తమామలు
పెళ్ళికాని ఆడపడుచులు
ఇందరిని చూచుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకు రావాలి
ఏ చిన్న తేడా వచ్చినా తల పట్టుకుని కూర్చోవాలి //
సంసారమనే సైకిల్ నడవడానికి రెండు చక్రాలు తిరగాలి
అందుకు శ్రీమతి కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి
ఏదో ఒక చిన్న కొలువు చేస్తేనే బ్రతుకు బండి ముందుకు సాగుతుంది
ఆపై వేన్నీళ్ళకు చన్నీళ్ళు కొద్ది తోడుగా నిలుస్తుంది //
ఏ చక్రం ఊడిపోయినా బండి ముందుకు నడవదు
ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం లేకపోయినా జీవితం గడవదు
చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి
అందుకు ఆలుమగలు ఒక్క మాట మీదే నిలబడాలి //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment